విద్యావిధానం అంటే ఒక వర్గానితో, ఒక సమూహానికో వర్తించే సంక్షేమ పథకం కాదు. విద్య అంటే సమాజంలోని పిల్లలంతా సుశిక్షితులైన మానవ వనరుగా రూపొందించే సుదీర్ఘ ప్రక్రియ. పదేండ్ల పాఠశాల విద్య, రెండేండ్ల్ల ఇంటర్మీడియట్ విద్య, తర్వాత డిగ్రీ/వృత్తి విద్య/విశ్వవిద్యాలయ విద్యతో కూడిన సుదీర్ఘ ప్రక్రియ.
విద్యారంగంలో మార్పులు చేసే ముందు ప్రభుత్వం కూలంకషంగా చర్చలు జరపాలి. ఆ చర్చల్లో మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, సామాజిక శాస్త్రవేత్తల సూచనలు తీసుకొని, మన సమాజానికి, మన అవసరాలకు అనుగుణంగా మానవవనరులను తయారుచేసే విద్యావిధానాన్ని రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్చా లేకుండా, ఎలాంటి డిమాండ్ లేకుండా ‘లేడికి లేచిందే పరుగు’ చందంగా ‘రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ప్రారంభిస్తాం.. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తాం.. స్కిల్ యూనివర్సిటీ, క్రీడా విశ్వవిద్యాలయం స్థాపిస్తాం’ అనే ప్రచార ఆర్భాటపు ప్రకటనలతో విద్యావిధానం మెరుగు కాదు. ఇటువంటి ప్రకటనల తర్వాత ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ తన పనులను ప్రారంభించి, సిఫారసులను సమర్పించకుండానే ఇంటర్ విద్యను రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు రద్దవుతాయని ప్రభుత్వం ఇటీవల ఏకపక్షంగా ప్రకటించింది.
కానీ అందుకు తగిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇంకా ప్రకటించలేదు. పాఠశాల విద్యలో ఇంటర్ తరగతులను విలీనం చేస్తే
అక్కడ వసతులు ఎలా ఉండాలి? ఇప్పుడున్న జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, ఇతర బోధనేతర సిబ్బందిని ఏంచేస్తారు? వారి సర్వీసు నిబంధనలు ఎలా ఉండాలి? ప్రైవేట్ విద్యాసంస్థలు ఇంటర్ తరగతులను ఎలా నిర్వహించాలి? లేదా ప్రైవేట్
సంస్థలన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తారా? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి!
పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయటానికి తెలంగాణ విద్యాచట్టాన్ని (1982) సవరించాలి. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాచట్టాన్ని (1971) రద్దు చేయాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్ఎస్సీ బోర్డు), ఇంటర్మీడియట్ విద్యామండలి (ఇంటర్ బోర్డు)ను కలిపి ఒకే ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయాలి. ఉమ్మడి బోర్డుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్ఈబీ)గా నామకరణం చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఫలితంగా జూనియర్ కళాశాలలు పాఠశాల విద్య పరిధిలోకి వస్తాయి.
తెలంగాణలో ఏటా 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో 17 శాతం అంటే దాదాపు లక్షకు పైగా ఇంటర్‌తోనే ఆపేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపితే 3,325 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ కాలేజీలు 1,482 కాగా, 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 1,002 గురుకులాలు, 475 కేజీబీవీలు, 190 మాడల్ స్కూళ్లు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి 9, 10 తరగతుల్లో 94 శాతంగా ఉండగా, ఇంటర్‌కు వచ్చేసరికి 83 శాతంగా ఉన్నది. పదవ తరగతి పాసైన విద్యార్థుల్లో 16.5 శాతం మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతుండగా, 66.5 శాతం మంది ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారు. ఇంకా 17 శాతం విద్యార్థులు డ్రాపవుట్లుగా ఉన్నారు.
ఇంటర్ విద్య విలీన ప్రక్రియ ద్వారా విద్యార్థుల డ్రాపవుట్లు తగ్గించాలనే బలమైన కారణంగా ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. పాఠశాల విద్య పూర్తిచేసిన విద్యార్థులు పైచదువుల కోసం తమ ప్రాంతం నుంచి సుదూరంగా ఉన్న కళాశాలలకు వెళ్లాల్సి వస్తున్నదని, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతోనే విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అధికారులు వివరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ విద్య అందుబాటులో లేకపోవటంతోనే టెన్త్ తర్వాత బాలికలు చదువు ఆపేస్తున్నారని అంటున్నారు.
12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించటం వల్ల డ్రాపవుట్ల సంఖ్య తగ్గుతుందని, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు లాంటి సౌకర్యాలను విద్యార్థులు సమర్థంగా ఉపయోగించవచ్చని ప్రభుత్వం చెప్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న గురుకులాలు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఇప్పటికే 12వ తరగతి వరకూ బోధన కొనసాగుతున్నది. 55 ఏండ్లుగా ఇంటర్మీడియట్ విద్య కీలక పాత్ర పోషిస్తూ, ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతూ వైద్య, ఇంజినీరింగ్ లాంటి వృత్తి విద్యల్లో రాణించేలా చేస్తున్నది.
ఇప్పుడు పాఠశాల విద్యతో విలీనం చేయటం ద్వారా ఈ ప్రత్యేకత తొలగిపోతుంది. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించి అన్ని సబ్జెక్టులను పెట్టి, ప్రవేశాలు జరిపి, అధ్యాపకుల నియామకాలతో పటిష్టమైన బోధన జరిగేలా చర్యలు తీసుకుని తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపొందించాలి. అప్పుడే డ్రాపవుట్ల సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. ఆ బాధ్యతను వదిలి, రెండు, మూడు కార్పొరేట్ సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గేలా ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు చర్యలను అదుపు చేయకుండా, మొత్తం ఇంటర్ కోర్సునే తొలగిస్తామని అనటం పాలకుల అవివేకమైన చర్య అవుతుంది.
(వ్యాసకర్త: విద్యారంగ విశ్లేషకుడు)
-కె.వేణుగోపాల్ ,98665 14577