విద్వత్కవి.. వాసాల శౌరి
పద్యం, గేయం, వచనం, పాట, నాటిక, నాటకం, ఏకపాత్ర, వ్యాసం మొదలైన ప్రక్రియల్లో విలక్షణమైన రచనలు చేశారు ఆయన.
పద్యం, గేయం, వచనం, పాట, నాటిక, నాటకం, ఏకపాత్ర, వ్యాసం మొదలైన ప్రక్రియల్లో విలక్షణమైన రచనలు చేశారు ఆయన. అంతేకాకుండా ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులకు జ్ఞానదీపమయ్యారు. కవిగా ఎంతోమంది కవి పండితులకు దారిదీపమయ్యారు. ఆయనే జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద విద్యల ద్వారా ఎంతోమంది పేదలకు ఉచిత సేవలు అందించిన ప్రముఖ విద్వత్కవి వాసాల శౌరి.
వాసాల శౌరి జగిత్యాల జిల్లా మెట్పల్లి సమీపంలోని చౌలమద్ది గ్రామంలో వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1949 జనవరి 5న జన్మించారు. ఎంఏబీవోఎల్ చదివిన శౌరి చిన్ననాటి నుంచే తెలుగు సాహిత్యం పట్ల మిక్కిలి అభిరుచి కలిగి ఉండేవారు. కోరుట్లలోని భారతీ సాహిత్య సమితి వ్యవస్థాపకుడు, ప్రముఖ కవి, అష్టావధాని డా.అందె వేంకటరాజం సాన్నిహిత్యంలో సాహిత్యాన్ని ఆయన అధ్యయనం చేశారు. అక్కడ నిర్వహించే అనేకానేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, కవితా గానం చేసి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
రామాయణం, భారతం, భాగవతం, అమరకోశం, గురుబాల ప్రబోధిక, కావ్య, వ్యాకరణ, అలంకార, తర్కశాస్ర్తాలను లోతుగా అధ్యయనం చేసి సాహిత్యంపై మంచి పట్టు సాధించారు. తెలుగు భాషోపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. సమతా గీతాలు, ఉత్తరుడు, పిలుపు, వాసరాంబ శతకం, భజనావళి, ఆధ్యాత్మిక వ్యాసావళి, బాలగేయాలు, విద్యార్థి ప్రబోధ శతకం, శ్రీ రామానందస్వామి జీవిత చరిత్ర, కోకిలమ్మ, సైనికుడా, ఎటుపోతున్నది నా దేశం మొదలైన 15 పుస్తకాలకు పైగా రచించారు. పద్యాలు, గేయాలు, వచన కవితలు, నాటికలు, నాటకాలు, పిల్లల పాటలు, ఏకపాత్రలు, వ్యాసాలు వంటి ప్రక్రియల్లో రచనలు చేసి అందరి చేత శభాస్ అనిపించుకున్న కవి వాసాల శౌరి.
‘నీ యనుగ్రహమున్నచో నిఖిల జీవ సంఘము పలుక జాలును సంతసమున నీ కృప కరవైన యెడల నీరజ భవు డైన పలుక నేరడు కదా అంబుజాక్షి‘
నీ అనుగ్రహం ఉంటే సకల జీవరాసులు పలుకగలుగుతాయి. నీ దయ కరువైనప్పుడు ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ మాట్లాడలేడు కదా తల్లీ! అని ఆ పలుకులమ్మను కీర్తిస్తూ ఆయన రాసిన పద్యం మనందరినీ పరవశింపజేస్తుంది. డా.సీ నారాయణరెడ్డి, జీవీ సుబ్రహ్మణ్యం, వానమామలై వరదాచార్యులు, కోవెల సుప్రసన్నాచార్యులు, దివాకర్ల వెంకటావధాని, అందె వెంకటరాజం వంటి మహానుభావులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండడమే కాకుండా వారితో అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందారు వాసాల శౌరి.
‘అర్ధరాత్రి వేళ అందరు శయనింప నీవు నిమిషమైన నిదుర గొనక అఖిల జగముకు వెల్తురు నొసగు దీవు నీదు మహిమ పొగడ నెవరి తరము’
చల్లని వెన్నెలలు పంచి, జగమంతా వెలిగించి అందరికీ హాయిని చేకూర్చే చంద్రుని గురించి ఇంత చక్కని పద్యాన్ని అందించిన శౌరి ధన్యుడు.
‘దురాచారాలు ప్రబలిపోతున్నాయి మూఢవిశ్వాసాలు ముదిరిపోతున్నాయి తీవ్రవాదము తీవ్రమవుతున్నది మత్తు పదార్థ సేవనంలో మత్తు చిత్తయి పోతున్నది సమాజం’
అంటూ మారిన నేటి వ్యవస్థ గురించి మదనపడ్డారు వాసాల శౌరి. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పటికీ చివరికి మెట్పల్లిలో ఆయన స్థిరపడ్డారు. మెట్పల్లిలోని జాతీయ సాహిత్య పరిషత్తుకు ఉపాధ్యక్షుడిగా, కోరుట్లలోని భారతీ సాహిత్య సమితి శాశ్వత సభ్యుడిగా, లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడిగా విశేషమైన సేవలందించారు వాసాల శౌరి. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులకు తెలుగు భాషపై, తెలుగు సాహిత్యంపై అభిరుచి కలిగించి, పిల్లల చేత కవితలు, కథలు, వ్యాసాలు రాయించి వారిని మంచి కవులుగా, కళాకారులుగా తీర్చిదిద్దారు. విద్యార్థుల రచనలతో ‘శుభోదయం’ అనే పేరుతో పాఠశాల వార్షిక సంచికను వెలువరించి ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు శౌరి. ఆయన సేవలకుగాను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది.
‘గ్రంథమనగా రత్న పేటిక గ్రంథ మన విజ్ఞాన దీపిక మంచిపొత్తము కడు పవిత్రము వాంఛ మీర పఠించు నిత్యము’
ఇలాంటి చక్కని గేయాలు ఆయన సాహిత్యంలో కోకొల్లలు. ఆయన కవిత్వంలోనే కాదు.. జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద శాస్ర్తాల్లో కూడా ఆయనకు చక్కని ప్రావీణ్యం ఉన్నది. ‘కవి తిలక’, ‘కవి రత్న’ వంటి బిరుదులు, అనేక గౌరవ సత్కారాలు, పురస్కారాలు అందుకున్న వాసాల శౌరి 2021 మే 7న పరమపదించారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి ,9440369939
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

