మన నేల మీద
మళ్ళీ పల్లేరు మొలకల జాడలు
నిశ్శబ్దంగా పరచుకుంటున్న కరువు నీడలు
మరోసారి పట్నం వైపు
పల్లెల వలస చూపులు
ఆకుపచ్చ తెలంగాణ దృశ్యం
కనుమరుగయ్యే కుట్ర
సాధించుకున్న స్వేచ్ఛ వెనక
పరాయి జెండా రెపరెపలు
భ్రమలు ఒక్కొక్కటిగా మంచు తెరలై
కనుమరుగవుతున్న విషాదకాలం
శకుని మాయాజూదం
చివరి అంకానికి చేరుకున్న వికృత వేళ
జట్లు జట్లుగా దుష్టచతుష్టయం
ఏకమై కొత్త కొత్త కుట్రలకు
ఆజ్యం పోస్తున్నారు
నీటి దొంగలకు ఇంటి దొంగల తోడు
మాన్పుకున్న గాయాలను
గెలికి చూస్తున్నారు
యుద్ధం తప్పనప్పుడు సాధకుడు
పాంచజన్యం పూరించాల్సిందే!
మౌనం ఎంత శక్తివంతమో
చరిత్రలో ఒక పాఠమై నిలిచిపోవాలి!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261