అంధకారాన్ని కుప్పలుగా పోసిన చోట
అడుగుల కింద నేలనీ లాక్కుని
పరాయిలనుగా చేసిన చోట
ఆకాశంలో మా భాగమే లేదన్న చోట
ఒక దీపవృక్షం అంకురించి భవిష్యత్తు కోసం
తనని తాను కాల్చుకున్నది
ఆ వృక్షానికి భవిష్యత్తు తెలుసు
ఆ వృక్షం ప్రవక్తలా తన వారి తల రాతను
తన చూపుడు వేలుతో దిద్ది
అవమానం మొలిచే ప్రతి చోట
కులం బుసలు కొట్టే ప్రతి చోట
ఎలా తప్పించుకోవాలో జ్ఞానతైలంతో
అక్షరాలను వెలిగించింది
అదో మహానది వేల వేల పుస్తకాల
జ్ఞానాన్ని మస్తిష్కంలో నింపుకొని
దేశమంతా న్యాయం కోసమే నిలబడేట్టు
తనను తాను చెక్కుకున్న నది
నలిగిపోతున్న గొంతులకు పిడికిలై నిలబడ్డ నది
తోసివేయబడ్డవాళ్ళ పక్షాన- ‘హక్కులు మీకివని’
తన తరువాతి తరం కోసం
విత్తనమై కలలుగన్న ఆది భారత మూలనది
మనిషి మనిషికీ గౌరవం దక్కాలని
రాజ్యాంగాన్ని రెండుభుజలా మోపి
దేశానికే దారిచూపిస్తున్న వెలుగునది
పోరాటం చేసి అలసిన తెలంగాణ చేతులకూ కాళ్ళకు స్ఫూర్తినిచ్చిన నది
తెలంగాణకిప్పుడు దారి చూపుతున్న నది
అందుకే ఆరడుగుల విగ్రహాన్ని చేసికాదు
నూటా ఇరవై అయిదు అడుగుల నిలువెత్తు దీపవృక్షాన్ని
తెలంగాణ తన గుండెపై ప్రతిష్ఠించుకుంది
స్పటిక పాలన కోసం ఆయన వెంటే నడవాలని
రాష్ట్ర సచివాలయాన్నే ఆ నదినే పాదాల దగ్గర కొత్తగా నిలిపింది.
ఆ నది మాకు మార్గదర్శి
ఆ దీపవృక్షం తెలంగాణ ఆత్మ రక్ష
అతని చూపుడు వేలు
కుల మత వివక్షలు దాటించే వారధి
ఆ నదే మా బాబా సాహెబ్
ఆ దీప వృక్షమే మా అంబేద్కర్
ఆయన అడుగుజాడలే వేల
అడుగులకు పునాది రాళ్ళు
మెర్సీ మార్గరెట్ , 90528 09952
నేడు… నగర నడిబొడ్డున
ఉదయించనున్నాడొక
అస్తమయమెరుగని జ్ఞానసూర్యుడు.
అంటరానిదన్న జాతిలో ఆఖర్న పుట్టి
అనితర సాధ్యమైనన్ని అందలాలెక్కి
అసమానతలపై అహర్నిశలు
పోరుసల్పిన అసమాన్య దీరోదాత్తుడు.
ఉదయించనున్నాడొక
అస్తమయమెరుగని జ్ఞానసూర్యుడు.
సబ్బండ కులాలను నిబ్బర
హృదయులన్ జేసి
సవరించినాడు భారతదేశ వెన్నెముకను
ఊరి చివరన్ బుట్టి
బ్రాహ్మణోత్తములన్ పక్కకునెట్టి,
అగ్రహారముల అహంకారమ్ దించి
నిచ్చెనమెట్ల అక్రమనీతిన్
మనుస్మృతి దహనంతో బూడిదజేసి
ఖండాలు దాటివెళ్లి
జంట పీహెచ్‌డీలు సాధించి
అర్ధశాస్త్రమున్, న్యాయశాస్త్రమున్
ఔపోసన పట్టిన మహా జ్ఞానయోధుడు
భరతమాత ఏరికోరి జన్మనిచ్చిన
మట్టిలో మాణిక్యమితడు.
రూపాయి నిగ్గు తేల్చి
రిజర్వు బ్యాంకు సృష్టికి ఊపిరిపోసిన
అద్వితీయ ఆలోచనాపరుండు.
సమాన వేతన చట్టాన్ని, ఎనిమిది గంటల పనివేళల్ని మహిళా ఓటుహక్కుని
పోరాడి సాధించిన కార్మిక ప్రేమి
ఈ విశ్వమానవ ప్రేమికుండు.
సంబురాలు జేయండి.
తెలంగాణ బిడ్డలారా అంబరాన్నంటే
వేడుకలు జేయండి.
నేడు ఏప్రిల్ పద్నాలుగున, భాగ్యనగర నడిబొడ్డున నిరుపమాన తేజోమూర్తుడు,
నూటపాతిక అడుగుల
బ్రహ్మాండ విగ్రహరూపమై
ఉదయించనున్నాడొక
అస్తమయమెరుగని
జ్ఞానసూర్యుడు.
అరుణ గోగులమండ, 88971 07984
బహుజనుల బతుకుల్లో
అక్షర కొలిమిని రాజేసిన అగ్గి రవ్వ
మట్టి మనుషుల మంచికోసం
మమత పంచిన మహిమాన్వితుడు
అభాగ్యులను అక్కున చేర్చుకొని
ఆవలి తీరాలకు చేర్చిన అక్షరధారి
అక్షరసేద్యం చేస్తూ
నిత్యం నిప్పుల వాగులు దాటిన
నిండు పున్నమి చంద్రుడు
అందనంత ఎత్తులోనూ
అద్వితీయ రూపుడు
విధి రాతలు మార్చినట్టి
విగ్రహ స్వరూపునికి
తెలంగాణ రాష్ర్టాన
మెండైన ఏలికలు నిండైన మనముతో
నిజంగా ఇచ్చిన నిండు గౌరవం
ప్రగతిపథంలో పయనిస్తున్న
మన బంగారు తెలంగాణకు
బాటలు వేయగా
చేయిచేయి కలుపుకొని
ఐకమత్యంతో అందరం ఒకటై
అక్షరజ్యోతులు వెలిగిద్దాం
మన తెలంగాణ గొప్పతనాన్ని
అవని అంతా చాటుదాం..!
డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ: 97042 26681
అంటరాని జాతులకే
పరిమితం చేసిన విగ్రహం
నేడు ప్రజాస్వామ్య ప్రతీకగా
నగరం నడి బొడ్డున
125 అడుగుల ఎత్తులో నిలుచున్నది
విగ్రహం కాదు అది సర్వజనుల సమానత్వపు ప్రతీక
ఆ విగ్రహాన్ని చూస్తుంటే
తప్పిపోయిన పిల్లవాడు
తల్లి ఒడిని చేరిన ఆనందం
తల్లి ప్రేమను మరిపించే
త్యాగానికి ప్రతిరూపం అతడు
– దాసరి లక్ష్మయ్య
నదికి నడక మొదలైనట్లు
బాబా సాహెబ్ ప్రవాహం మొదలైంది
స్వరపేటిక జై భీమ్ అయి
వరదలా నినాదం వెల్లువెత్తింది
రాతి గుండె పొంగులోంచి
తాళం మొదలైంది
లాగుతున్న జ్ఞాన తాడు లోంచి
సన్నగా ఒక మెరుపు ధ్వనించింది
అలలు అలలుగా పల్లవించిన
ఆత్మగౌరవ కెరటాలు
ఆకాశానికి ఎగిసిపడ్డాయి
రాష్ట్రం ఏప్రిల్ పద్నాలుగుగా మారి
పరవళ్లు తొక్కుతున్నది
జై భీమ్, జై భీమ్ ఇప్పుడు
ఒక అఖండ జ్యోతై వెలుగుతున్నది!
ఆకాశం అంచున భీంరావు కొలువుదీరిండు
తెలంగాణ నేల పరవశించి
జ్ఞానక్షేత్రంగా మారిపోయింది
బుద్ధుడే తిరిగివచ్చి మళ్లీ నిలబడినట్లు
మట్టిలోంచి నీలివనంగా
మొలకెత్తిన ఆత్మగౌరవం
రాజధాని నడి ఊరిలో
పురుడు పోసుకున్నది
పుట్టడం ఒక చరిత్ర
వికసించడం మరో చరిత్ర!
ఎవరు తపస్సు చేస్తే
తెలంగాణ నేలపైకి దిగివచ్చిందో గాని
యాతమేస్తేనే బువ్వ కంచంలకొచ్చేది
వడ్లు బియ్యంగా మారినట్లు
మాటలు చేతలుగా మారినవి
విగ్రహం ఒక నినాదమై
మూగ గొంతులు
మువ్వల సవ్వడి చేస్తున్నాయి
ఇప్పుడు ప్రపంచమే
తెలంగాణ వైపు చూస్తుంది!
బాబాసాహెబ్ అంటే ఒక విప్లవం
బాబాసాహెబ్ అంటే ఒక ఉద్యమం
ఒక మార్పు, ఒక జీవనది
ఎదిరెపల్లి కాశన్న: 96400 06304
భూదేవిపై
ప్రవహిస్తున్న దుఃఖధారలో వెలసిన
రాజకీయ స్వాంతనకు
నిలువెత్తు నిలిచిన రూపం ఇది
నేటికి కూడా బాబా ఊరవతలి దుఃఖమే
దుఃఖాశ్రుకణమేగా ఈ విగ్రహం
దుఃఖగింజా! మా దుఃఖగింజా!
మమ్మల్ని ఓ రాసిలా పోస్తే నీలా అగుపిస్తాం గానీ
సర్వకాలాల్లోనూ మేమింకా బానిసలకు బానిసలుగానే ఉన్నాం
నువ్వు మాత్రం ఆకాశంలోనే కాదు
సదా మా జీవన భవనంలో వెలిగే ప్రతిరూపానివి నీవే!
ఊరవతలి ప్రహ్లాదుల ఇళ్లను ఊర్లను చేయడానికేగా
నీవిక్కడ నిలుచున్నది!
నీ చూపుడు వేలు
హరిజనుడి హృదయ బాణంలాగే ఉంది
అనేవాళ్లు అంటారు గానీ
ఈ విగ్రహం మాత్రం
ఆత్మగౌరవంలో అంతర్భాగమే
ఒకే ఒక్కసారి ఆత్మ తృప్తి కోసం
అంతరాత్మతో నిలుచొని చూడు
అనంతమైన ఆనందమే కలుగుతుంది
ట్యాంక్‌బండ్ విగ్రహాల కన్న
కాస్తంత ఎత్తుగా నీవెందుకున్నావంటే
నిత్యం జనజీవన దుఃఖాన్ని అధ్యయనం చేయడానికే మరి!
రాజ్యాంగంలో ఇమడని న్యాయస్థానంలో పొదగని
మా నమ్మకాల ఆత్మవిశ్వాసాల అంతర్మథనానికి ఆకృతి నీవే!
దేశాన్ని బాబా రూపంలో చూడటమంటే
మన ఆత్మ ప్రక్షాళనకు ప్రత్యామ్నాయ నడకను నేర్పడమే!
డాక్టర్ నాళేశ్వరం శంకరం: 94404 51960
ఇప్పటికీ అతని కల ఎవరికీ అర్థం కాలే
ఎవరి అవసరాలకు వారు
అన్వయించుకుంటున్నారు!
పెను దుఃఖంలోంచి వెలుగై మొలిచినవాడు
గడ్డ కట్టిన పెను చీకట్లను పటాపంచలు చేస్తూ..!
అతని యుద్ధమంతా వివక్షల మీదనే
అతని ఆలోచనలన్నీ సమభావన సాధన మీదనే!
ఎన్ని మెలికలు తిప్పింది మన చరిత్ర
ఒక్కో ముడిని విప్పి దారులు వేయడమంటే
కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడమే!
సకల సంపదలు సమభోజ్యం కావటానికి
జ్ఞానమొక్కటే వెలుగుదారి అన్నాడు!
ప్రజాస్వామ్యమంటే మెజారిటే కావచ్చు
ఆ మెజారిటీ పశు బలమైనప్పుడు
వెసులుబాటు కల గన్నందుకే
తెలంగాణ స్వేచ్ఛాగీతమైంది
క్రాంతదర్శి కావటం వల్లే
ఎద ఎదలో చమురక్కర లేని దీపమైండు
పుస్తక పాణియై మార్గదర్శి అయిండు!
విశ్వనగరం నడిబొడ్డున ఆకాశమెత్తు నిలిచి
చదువు పోరాడి సాధించమని బోధిస్తున్నాడు!
పూలే బుద్ధుడు మహాత్ముడు
కలగలిసిన మానవీయ మూర్తి
మన మనసులో మెదిలే
బాబాసాహెబ్ అంబేద్కర్!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి: 94402 33261
అరవయేండ్ల తండ్లాటకు
నీ అక్షరాలే విముక్తినిచ్చినయ్
కర్ర ఉన్నోందే బర్రె కావద్దని
నోరున్నోనిదే రాజ్యం కావద్దని
బక్క జీవులకు బాసటగ నిలిచినవ్
నాలుగు కోట్ల మంది కలను
ఒక్క ఆర్టికల్-3 పోటుతో నిజం చేసినవ్
చిన్న జాగలకు సిరి ఎక్కువన్న ఇగురం
నువ్వు మాకు పెట్టిన బిక్ష…
అభివృద్ధి ఆఖరి గుడిసె దాకా అందాలన్న
నీ తండ్లాటకు ‘జైభీమ్’లు
ఆత్మగౌరవ పతాకమా…
తలెత్తుకొని బతికే జాడ
మా భవిష్యత్తుకు బాటలేసిన నీడ
జ్ఞాన యోధుడా…
నాలుగు వందల ఏండ్ల నగరం ఎద మీద
ధిక్కార పతాకమై నిలబడ్డవ్
పట్నానికొస్తే.. ఇప్పుడు చార్మినారే కాదు
నిన్ను కూడా కన్నులారా చూసుకుంటం
గుండెల నిండా తలుచుకుంటం
వెలుగుదారిలో…
నీ అడుగుల్లో అడుగేసి సాగుతం…
డాక్టర్ పసునూరి రవీందర్: 77026 48825
బతుకమ్మ సిగలో బంతిపువ్వులా
తెలంగాణ శిఖరాగ్రాన చూపుడు వేలు
నేనిప్పుడు నా నేల మీద నిలబడి
ఆకాశాన్ని చూస్తున్నాను అంబేద్కర్‌ను చూస్తున్నాను
అంబేద్కర్‌ను చూస్తే ఆకాశాన్ని చూసినట్లే
అంబేద్కరే ఆకాశం.. ఆకాశమే అంబేద్కర్!
వనపట్ల సుబ్బయ్య: 94927 65358
అంబేద్కర్ పేరున మన తెలంగాణమున
వెలిసింది సచివాలయం ఆ పక్కనే
నిలిచింది అద్భుతమైన అంబేద్కర్ విగ్రహం
అసమాన మేధావి అంబేద్కరునకు
ఇది తెలంగాణ జనుల నీరాజనం
చరిత్రలో నిలిచిపోయే ఘన నీరాజనం
అంబేద్కరునకు లేదు మరణం
ఆ మహనీయునకు ప్రణామం
బూర దేవానందం: 81435 89789
అతడొక విజ్ఞాన గని.. హితమైన ప్రజ్ఞాన ధ్వని
పీడిత తాడిత జనులకు
రాజకీయ కార్యదర్శి రాజ్యాంగ మార్గదర్శి
బడుగుల జీవితాన ఒడిదుడుకులను మార్చిన
బహుజనుల ఆత్మబంధువు
భారత రాజ్యాంగ జ్ఞాన సింధువు
రాఘవ మాస్టారు కేదారి