ఇంటి ఇల్లాలు చేసేదీ ఓ పనేనా? అనే చులకనభావం మన సమాజంలో పాతుకుపోయింది. కానీ అదే ఇల్లాలు ఇంటిల్లిపాదికీ బండెడు పని చేసిపెడితేనే సంసార చక్రం సవ్యంగా తిరుగుతుంది. అదేదో సినిమాలో చెప్పినట్టుగా అమ్మ రాజీనామా చేస్తే అందరి పరిస్థితీ తలకిందులే. అయినా అలాంటి అమ్మ పనికి ఓ విలువ అంటూ ఉన్నదా? అంటే లేదనే సమాధానం వస్తుంది. అపుడప్పుడూ అమూల్యమని ఆకాశానికెత్తేస్తారేమో గానీ విడివిడిగా ఒక్కో పనికి ఇంత అని విలువ కట్టరు. భారతీయ సమాజంలో గృహిణులకు విశిష్ట స్థానం ఉన్నప్పటికీ, వారి శ్రమను ఏమాత్రం గుర్తించకపోవడం ఒక సామాజిక వైపరీత్యం. ఇంటి నిర్వహణ, పిల్లల సంరక్షణ, వృద్ధులకు సేవలు, కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం-ఈ కష్టమైన అష్టావధానాన్ని ఇంతులు ఇష్టంగానే చేస్తుంటారు.
గృహిణిగా స్థిరపడ్డ మహిళ భర్త మీ ఆవిడ ఏంచేస్తున్నదని అడిగితే ‘ఏమీ లేదని’ అలవోకగా చెప్పేస్తాడు. ఇల్లాలి పనిని ‘ఉద్యోగం’గా పరిగణించకుండా, దానికి ఎలాంటి ఆర్థిక విలువ కట్టకుండా ఉండటం అన్యాయమే అవుతుందని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పులో అభిప్రాయపడింది. గృహిణులు చేసే శ్రమకు ఆర్థిక విలువ కచ్చితంగా ఉంటుందని తేల్చిచెప్పింది. అంతేకాదు, వారి శ్రమ దేశ నిర్మాణంలో కీలకమైనదని అభివర్ణించింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాద పరిహార కేసుల్లో, గృహిణి మరణం లేదా గాయపడిన సందర్భాల్లో, ఆమె కుటుంబానికి కలిగే నష్టం కేవలం భావోద్వేగపరమైనదే కాకుండా, ఆర్థికపరమైనదిగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉన్నదని కోర్టు నొక్కిచెప్పింది. ఈ సందర్భంగా నష్టపరిహారం కింద గృహిణి ఇంటి పనికి నెలకు రూ.30 వేలుగా నిర్ధారించింది.
ఈ పరిణామాన్ని కేవలం ఒక న్యాయపరమైన నిర్ణయంగా మాత్రమే కాకుండా, సామాజిక దృక్పథంలో ఒక విప్లవాత్మక మార్పునకు నాందిగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు గృహిణుల పనిని అదృశ్య శ్రమగా పరిగణిస్తూ, దానిని లెక్కచేయని పరిస్థితి ఉండేది. కానీ ఈ తీర్పు ద్వారా ఆ శ్రమను స్పష్టంగా నిర్వచించి, దానికి విలువ నిర్ణయించడం విశేషం. ఈ తీర్పు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గృహిణుల పని కూడా ఒక పూర్తి కాలపు ఉద్యోగ బాధ్యత వంటిదేనని, అది కుటుంబ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమని సమాజం అంగీకరించాల్సిన అవసరం ఉన్నది.
ఇది స్త్రీ, పురుష సమానత్వానికి కూడా బలమైన పునాది వేస్తుంది. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గృహిణుల పనికి కచ్చితమైన ఆర్థిక విలువ ఎలా నిర్ణయించాలి? ప్రాంతాల వారీగా, జీవన ప్రమాణాల ప్రకారం ఈ విలువ మారాలా? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. అయినప్పటికీ, ఈ నిర్ణయం ఆ దిశగా ఒక తొలిఅడుగు మాత్రమే. ప్రభుత్వాలు కూడా ఈ తీర్పును దృష్టిలో ఉంచుకుని గృహిణుల కోసం విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు.. గృహిణులకు పెన్షన్ పథకాలు, ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత వంటి కార్యక్రమాలు తీసుకురావచ్చు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచడంలో తోడ్పడుతుంది.
సుప్రీంకోర్టు తీర్పు పురుషాధిక్య భావజాలానికి ఒక సవాలు వంటిదని చెప్పక తప్పదు. గృహిణుల ఇంటిపని వారి సహజ కర్తవ్యమని ప్రబోధిస్తూ, దానికి విలువ ఇవ్వకపోవడం అనేది కాలం చెల్లిన దృక్పథం. ఇప్పుడు ఆ దృక్పథం మారాల్సిన సమయం వచ్చింది. కుటుంబ సభ్యులు కూడా గృహిణుల శ్రమను గౌరవించి, వారిని సమాన భాగస్వాములుగా చూడాల్సి ఉన్నది. ఈ తీర్పు వల్ల సమాజంలో రాత్రికి రాత్రే మార్పు ఏమీ రాకపోవచ్చు. అయితే, మార్పు దిశగా ఇదో ముందడుగు అని చెప్పవచ్చు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని సమాజం కూడా గృహిణుల పనిని గుర్తించి, వారికి తగిన గౌరవం ఇవ్వడం ద్వారా సమానత్వం, న్యాయం, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది. మొత్తానికి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గృహిణుల శ్రమకు గౌరవం కల్పించే దిశగా ఒక మైలురాయిలా నిలుస్తుంది. ఇది కేవలం న్యాయ వ్యవస్థ విజయమే కాకుండా, సమాజాన్ని మరింత సమానత్వ దిశగా నడిపించే మార్గదర్శిగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ తీర్పు ఆధారంగా మరిన్ని సానుకూల మార్పులు రావాలని ఆశిద్దాం.