కార్మికుడు తన వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పింఛన్ కీలకపాత్ర పోషిస్తుంది. దశాబ్దాల తరబడి పనిచేసి, పని చేయలేని స్థితిలో పదవీ విరమణ చేసిన వారికి నిర్దిష్ట మొత్తంలో పింఛన్ చెల్లించడం ప్రభుత్వ విధి. అది కార్మికుడి హక్కు కూడా. కొత్త పింఛన్ స్కీం (ఎన్పీఎస్)ను రద్దుచేసి పాత పింఛన్ స్కీం (ఓపీఎస్)ను మళ్లీ తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పింఛన్ స్కీం 1995 (ఈపీఎస్-95) పరిధిలోకి వచ్చే పింఛనర్లు తమ కనీస నెలవారీ పింఛన్‌ను 2014, సెప్టెంబర్‌లో నిర్ణయించిన ప్రస్తుత రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్డ్ సాయుధ దళాల సిబ్బంది ఒకే ర్యాంక్, ఒకే పింఛన్ డిమాండ్‌తో సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. 2004 తర్వాత ఉద్యోగం చేరిన ప్రభుత్వ ఉద్యోగులంద రికీ తప్పనిసరి అయిన కొత్త పింఛన్ స్కీమ్ ఎన్పీఎస్. ఇది కార్మికుడి పదవీ విరమణ తర్వాత కనీస నెలవారీ ఆదాయానికి హామీ ఉండదు. అందుకే పాత పింఛన్ స్కీమ్ (ఓపీఎస్) కోసం కార్మికులు పోరాటం చేస్తున్నా రు. కార్మికుడికి అతని చివరి జీతం, డియర్నెస్ అల వెన్స్‌లో 50 శాతం స్థిర పింఛన్ ఆదాయానికి ఓపీఎస్ హామీ ఇస్తుంది. ప్రస్తుతం ఎన్పీఎస్ కింద పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు పొందుతున్న పింఛన్ చాలా తక్కువ మొత్తంగా ఉన్నది. రూ.2000-5000 రూపాయల లోపు మాత్రమే వస్తుంది. ఇది వృద్ధాప్యం లో సరిపోవడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ను వ్యతిరేకిస్తున్నారు.
బొగ్గు విశ్రాంత కార్మికులకు కూడా కోల్‌మైన్స్ పింఛన్ స్కీం-1998 పొందుపరిచిన నిబంధనల ప్రకారం 26 ఏండ్ల కిందట కనీస పింఛన్ రూ.350గా నిర్ణయించారు. కార్మిక సంఘాలు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘాల పోరాటాల ఫలితంగా కేంద్రప్రభుత్వం కోల్‌మైన్స్ పింఛన్ స్కీం సవరణ చేసి గెజిట్‌లో బొగ్గు విశ్రాంత కార్మికుల కనీస పింఛన్ రూ.1000 చేసింది. ఈ పింఛన్ పొందేవారు దాదాపు 19,000 ఉండవచ్చు నేమో! ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వృద్ధాప్య పింఛన్ 2,016 రూపాయల కన్నా తక్కువ. అవి కూడా సరైన సమయంలో రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్షరాస్యత గల విశ్రాంత బొగ్గు కార్మికులు, వితంతువులు పెరిగిన వెయ్యి రూపాయల కనీస పింఛన్ కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి వెంటనే కనీస పిం ఛన్ వెయ్యి రూపాయలను అమలుచేస్తూ బకాయిలను వెంటనే చెల్లించాలి.
– ఆళవందార్ వేణు మాధవ్,
86860 51752