ఒకటా రెండా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్ జనవరి 29న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 ఒక్కటేనా? రకరకాల నివేదికలు డజన్ల కొద్దీ ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో తెలియజెప్తూ.. అవేవీ ఆయన ప్రభుత్వం ప్రకటించినవి కావు. కనుక కళ్లుండి అవి చూడగలిగిన వారికి అది చాలు, వాస్తవాలేమిటో తెలిసేందుకు. కానీ కళ్లుండీ చూడలేని కబోది మేధావులకు మరొక వెయ్యి నివేదికలైనా చాలవు కండ్లు తెరుచుకునేందుకు.
కేసీఆర్ అంటే రాజకీయంగా ఎంతమాత్రం సరిపడని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మంత్రులు వివిధాంశాలపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు, ఆర్థిక సర్వేలు, బడ్జెట్ పత్రాలు, వారు గతంలో నడిపిన ప్లానింగ్ కమిషన్, ప్రస్తుతం నిర్వహిస్తున్న నీతి ఆయోగ్‌ల నివేదికలు, రిజర్వ్ బ్యాంకు నివేదికలు, కాగ్ నివేదికలు, అనేక అంతర్జాతీయ అధ్యయనాలు, విశ్వవిద్యాలయాల పరిశోధనలు, చివరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సైతం మింగలేక కక్కలేక తప్పనిసరై పేర్కొన్న గణాంకాలు. ఇలా ఒకటా రెండా? బీఆర్ఎస్ ఇంకా పాలిస్తుండినప్పుడు, తర్వాత ఈ రెండేండ్ల్లలో కూడా.
అయితేనేమిగాక. దివాంధ మేధావులకు కనిపించవు, చెవులు వినిపించవు. మేధావులకు స్వీయ అధ్యయనాలతో ఏర్పడే అంతర్ దృష్టి కూడా ఉంటుందంటారు. కానీ తెలంగాణలో మేధావులుగా చెలామణి అయ్యే కొందరికి అది అయినా లేదు. పోనీ సొంత అధ్యయనాలు జరిపి పైన పేర్కొన్న నివేదికలు తప్పని నిరూపించరు. కారణం వారికి స్వప్రయోజనాలు, ఆ కారణంగా కలిగే సంకుచిత దృష్టి, వాటినే సమాజ ప్రయోజనాలుగా చూపగల చాతుర్యాలు మాత్రమే ఉంటాయి. దానితో దురుద్దేశాలు ఏర్పడుతాయి. ప్రజల వద్దకు వెళ్లరు. ఆ విషయాలపై వారి అనుభవాలు, ఆలోచనలు ఏమిటో తెలుసుకోరు. వాస్తవాలు తెలుస్తాయేమోన్ననది వారి భయం. కనుక వక్రీకరణలే శర్యణమవుతాయి.
ఎంత దూరమో ఎందుకు. ఈ సోకాల్డ్ మేధావులలో పెద్ద సంఖ్య హైదరాబాద్‌లోనే ఉంటారు. ప్రభుత్వం మూసీ పథకం పేరిట వందలాది మంది పేదల చిన్న చిన్న ఇండ్లు, రేకుల షెడ్లను అరాచకంగా కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి కూలగొడుతూ, వారిని ఇంకా ఉడుకుతున్న అన్నపు గిన్నెలు సహా బజార్ల పాలు చేస్తూ… చిన్న పిల్లలను స్కూలు పుస్తకాలైనా తీసుకోకుండా తరిమివేస్తూ… బాధితులలో ఒక వృద్ధురాలు ఆత్మహత్య సైతం చేసుకోగా, ఆ పేదలంతా ప్రస్తుత ప్రభుత్వాన్ని మనమెన్నడూ వినని రీతిలో ఆగ్రహంగా శాపనార్థాలు పెట్టి ప్రశ్నిస్తున్న రోజుల్లో ఈ మేడిపండు మేధావుల్లో ఒక్కరంటే ఒక్కరైనా, ఒక్కటంటే ఒక్కసారానై అటు తొంగిచూశారా? ఒక ప్రకటన చేశారా? ఇందిరా పార్కు వద్ద ఒక్కరైనా ధర్నాకు కూర్చున్నారా? వారిదృష్టిలో అవి పేదల హక్కులు కావు, పౌరహక్కులు కావు.
పేదరైతుల ఇండ్లపై అర్ధరాత్రి దాడులు జరిపి, మహిళలను సైతం అవమానించి, వారి భూములను ఎవరో పెట్టుబడిదారుల కంపెనీల కోసం బలవంతంగా ఆక్రమించజూసిన లగచర్ల వంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. అదే ఇంకా కొనసాగుతున్నది. భూములు తీసుకు తీరుతామని మంత్రులు బాహాటంగా ప్రకటిస్తున్నారు. మన మేధావి బృహస్పతులు కొందరు ఆ జిల్లాలవారే. అయినా వారు కండ్లు తెరుచుకోనిది ఎందువల్ల? జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న చెక్‌డ్యాములను ఇసుకకోసం కొందరు ప్రభుత్వ నేతల అండదండలతో పేల్చివేస్తూ, రైతులు గగ్గోలు పెడుతుండగా, ఈ మేధావి వేషధారులకు అటు వెళ్లిచూద్దామనే ఆలోచన రానిది ఎందువల్ల?
ఈ అపర మేధావుల్లో అనేకులు విద్యారంగంలో పనిచేసినవారు, ఇంకా చేస్తున్నవారు. రిటైరయినా లక్షల రూపాయల ప్రాజెక్టులు సంపాదించుతూ, లక్షల రూపాయల పెన్షన్లు వెనుకేసుకుంటున్నవారే. వారికి ఇవేవీ సమస్యలు కావు. కానీ, విద్యారంగ దుస్థితికి ఎంతగానో ఆందోళన చెందుతున్నట్లు నటనలు చేసే వీరు, వరుసగా గురుకుల విద్యార్థులు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు నాసిరకం ఆహారంతో బాధపడుతుండటం సరేసరి.
కాగా, అంతకుమించి కలుషితాహారంతో తరచూ ఆస్పత్రుల పాలవుతుండగా కండ్లు తెరువనిది ఎందుకు? ఇంకా సూటిగా అడగాలంటే… కండ్ల్లు తెరవలేకపోవటంలో రహస్యమేమిటి? ఆ విద్యార్థుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయినా వీరికి విద్యారంగ పరిరక్షణ అవసరమని తోచలేదా? విద్యార్థులైన చిన్నపిల్లల ప్రాణాలూ పట్టలేదా?
రైతాంగం ఎంతెంత గగ్గోలు పెడుతున్నది? రైతు బంధు సమయానికి అందక తిరిగి అప్పులపాలవుతూ, రైతు బీమా పూర్తిగా ఆగిపోయి చిన్నరైతుల కుటుంబాలు వీధినపడుతూ, యూరియా దొరకక పంట ఎర్రబారి రైతులు రాత్రంతా క్యూలల్లో చలివేళ ముసుగుదన్ని పడుకుని, పంట దిగుబడి సగానికి తగ్గుతూ ఇంటిల్లిపాది తిరిగి రోదిస్తున్న పాడుకాలం తిరిగి రాగా, మేధావులు తమ గుడ్డి కండ్లకు గంతలు కూడా కట్టుకున్నారెందుకు? పెన్షన్ల హెచ్చింపు సహా అనేక హామీలు కొడిగట్టి పోతుండగా, గత ప్రభుత్వపు అప్పుల భారమంటూ సాకులు చెప్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి వంత పాడటానికి మినహా, అధిక అప్పులనే వాదన పచ్చి అబద్ధమంటూ కేంద్ర సంస్థలు ప్రకటిస్తున్న నివేదికలు ఈ నకిలీ మేధావులకు కనిపించటం లేదు.
విషయం ఏమిటంటే, నగరాలలో సుఖంగా బతికే ఈ భద్రలోక మేధావులకు గ్రామీణుల సమస్యలు, వారి కష్ట సుఖాలు, మనోభావాలతో సంబంధంలేదు. తాము నివసించే నగరాలలోని మూసీ తీరపు పేదల వంటివారి జీవితాలు, ఆక్రందనలతో నిమిత్తం లేదు. పొరుగున గల లగచర్ల కంటికి ఆగదు. వీరు సుఖజీవులు. వీరి దృష్టికి వారివేవీ పౌరహక్కులు కావు. వారి దృష్టిలో పౌర హక్కులు వారి ఏసీ భవనాలు, ఏసీ కార్లు, లంచ్ వరకు ఇందిరా పార్క్ ధర్నాలు, ఏసీ హాళ్లలో రొడ్డుకొట్టుడు ఉపన్యాసాలు, మరునాడు పత్రికల్లో ఫొటోల చుట్టూ తిరుగుతుంటాయి. నక్సలైట్ ఉద్యమకాలంలో అంతకుమించి చాలానే చేశారు. కానీ ఆ దశ శంకరన్, కన్నాభిరాన్, బాలగోపాల్‌లతో ముగిసిపోయింది. ఇపుడు మిగిలిందంతా రాజకీయీ, పట్టణీ, మేధోవిలాసాలు మాత్రమే. ఆబ్జెక్టివిటీ నుంచి సబ్జెక్టివిటీగా రూపాంతరం చెంది, దానినే ఆబ్జెక్టివిటీగా ప్రదర్శించే మేధో విన్యాసాలు మాత్రమే.
అందువల్లనే కాంగ్రెస్ ప్రచార రథాలకు జండాలు ఊపుతారుగాని, అదే అశోక్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు నిరాశకు గురై నిరసనలు తెలిపి పోలీసు లాఠీఛార్జ్లకు గురైతే అటు పోయి వారికి సంఘీభావం తెలిపేందుకు సాహసించలేరు. ఓట్లను ఆశించి వచ్చిన రాహుల్ గాంధీ మహాశయుడు ఆ నిరుద్యోగులతో వేడి వేడి చాయ్‌లు తాగి, తమను ఆహ్వానిస్తే మురిసిపోయి వెళ్ళి లంచ్ చేసి కీర్తిస్తారు గాని, అదే నాయకుడిని అదే నిరుద్యోగులు ‘రావయ్యా..రా, మా ప్రశ్నలకు జవాబు చెప్పు’ మని నిలదీస్తే వారితో పాటు గొంతు కలుపలేరు. ఈ ధోరణిపై ప్రశ్నలు ఎదురవుతే నేలచూపులు చూస్తారు, దిక్కులు చూస్తారు, నంగినంగిగా మాట్లాడుతారు, నీళ్లు నములుతారు. అంతే తప్ప ఇప్పటికీ కండ్లు మాత్రం మూసుకునే ఉంటారు.
వీరికి ఎంతమాత్రం తీసిపోనివారు కమ్యూనిస్టు నాయకోత్తములు. వారికి ఎవరు సీట్లు బిచ్చమేస్తే వారినే ప్రజోద్ధారకులని కీర్తించి, ఆ బిచ్చం వేయని పాపానికి ఇతరులను ప్రజాద్రోహులంటూ తమ జెండాలోని కొడవళ్లను కిందకు తీసి ఖండిస్తారు. తదుపరి ఎన్నికల్లో తిరిగి ఈ సీట్ల బిచ్చాన్ని బట్టి ఈ పాత్రలు తారుమారవుతుంటాయి. దివాంధ మేధావులకు తీసిపోని ఈ డయలెక్టికల్ అంధులకు కూడా పైన పేర్కొన్న ఏ నివేదికలూ కనిపించవు. అందుకు అనుగుణంగా మూసీ బాధితులు, లగచర్ల రైతులు, చెక్‌డ్యాముల పేల్చివేతలు, గురుకుల విద్యార్థుల వెతలు, దళిత బంధు, రైతు బీమా ఎగవేతలు, రైతు బంధు ఆలస్యాలు, యూరియా ఇక్కట్లు, మహిళలకు కిట్ల్ల నిలిపివేత, వందలాది హామీల ఎగవేత మొదలైనవేవీ దృష్టికి రావు గాక రావు. ఆ విధంగా వీరు కండ్లుండీ కబోదులైన కామ్రేడ్లు. అందువల్ల, అనేకానేక నివేదికలలో తాజాది అయిన ఆర్థిక సర్వే వీరి కండ్లు తెరిపించగలదేమోనని ఆశించి నిరాశ చెందవద్దు.