ఈ నిశీధిలో నిండుగా నిన్నే స్మరిస్తున్నా
నీ సహచర్య రసమయ రవధూళిలో
మధుర స్వప్నమై కేరింతలు కొడుతున్నా
నీ వెచ్చని అక్షర స్పర్శతో తనువును విల్లును చేసి
సూటిగా భావాల బాణాల్ని సంధిస్తున్నా
చీకటిని చిక్కగా నేసిన
అజ్ఞానాంధకారాల్లోకి నీ సావాసంతో
మెరిసే కాంతిపుంజమై దూసుకొస్తున్నా
కవ్విస్తూ.. నవ్విస్తూ..
పదాల పొందికలతో పెనవేసుకుంటూ..
పడుచుదనంతో ఉరకలు వేస్తూ..
ప్రేమగా.. గోముగా.. వయ్యారాలు పోతూ
తరంగిణివై నువ్వొస్తుంటే మనసంతా
ఝంఝామారుతమై పల్లవిస్తుంది
నా జ్ఞానఝరీ సంగీతంలో ఆకుపచ్చ వనమై..
నన్నత్తుకునే వెచ్చని కవనమై
నువ్వు పరిఢవిల్లుతుంటే
దేహమంతా పరిమళమై పులకరిస్తుంది..
నా చెలివై.. సాహిత్య చక్కిలిగిలివై
అభిసారికవై.. అభినవశ్రీవై
కలలో ఇలలో కనువిందు చేస్తున్న
నా మానస మనోరమవై
నన్ను ఆసాంతం ఆవహిస్తుంటే..
మరో స్వర్గంలో విహరిస్తున్న
మరో ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నా..
ఓ సుమధుర సౌందర్య లహరీ
ఓ నవరసాల సరిగమల శ్రావణీ..
ఓ నా కవితా కన్యకా..
నా కలానికి బలానివై.. నాలో చరణమై
నా మదిలో ప్రభవై, ప్రభంజనమై
నా హృదిలో అమృతమై.. అమరమై
నాలో అణువణువూ ఘూర్ణిల్లుతున్న
నా ప్రియాతి ప్రియమైన నీకు
నిలువెల్లా ప్రణమిల్లుతున్నా..!
డాక్టర్ కటుకోఝ్వల రమేశ్: 99490 83327