మల్లావఝల సదాశివుడు ఆర్తి.. ప్రజా చైతన్య దీప్తి
ఆయన గొప్ప సంఘ సంస్కర్త. ఆనాడే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని పోరాడి దగ్గరుండి ఎంతోమంది దళితులకు గుడిలోకి ప్రవేశం కల్పించారు. కుల వివక్షను ప్రశ్నించారు. మాలమాదిగలతో కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయించారు.
(చెమన్, సంగిశెట్టిలకు ఈనెల 3న స్మారక మల్లావఝల పురస్కారం ప్రదానం జరుగనున్న సందర్భంగా..)
తెలంగాణ నేల నుదిటికి పాటల ‘ఎర్రకుంకుమ’ను పెట్టి గుండెకింది తడిలో తన కలాన్ని, గళాన్ని ముంచి అశ్రులిపిలో ఇక్కడి నెత్తుటి మడుగులకు అక్షర రూపమిచ్చిన ప్రజాకవి, గోదావరి గొంతుక, ఉపాధ్యాయుడు, తెలంగాణ ఉద్యమ కారుడు మల్లావఝల సదాశివుడు. 1945లో పెద్దపల్లి జిల్లా ముర్మూర్ గ్రామంలో జన్మించిన సదాశివునికి గ్రామీణ కళల పట్ల, పల్లెపాటల పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. గ్రామాల్లో ప్రదర్శించే ఒగ్గుకథలు, గొల్లసుద్దులు, కోలాటం పాటలు, భజనపాటలు, బతుకమ్మ పాటలు అన్నీ కంఠతా వచ్చేవి.
ఈ నేపథ్యమే అతనిని తదనంతర కాలంలో ప్రజా వాగ్గేయకారుడిగా మలిచింది. తెలంగాణలో తలెత్తిన ప్రతి సంక్షోభ సందర్భంలో ఆయన ప్రజల పక్షాన్నే నిలబడి పోరాడారు. నక్సలైట్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. ఆయన ఎన్నో పాటలు రాసి, పాడి, నాటకాలు రాసి, ప్రదర్శించి ప్రజా సమూహాలను చైతన్యపరిచారు.
ఆయన గొప్ప సంఘ సంస్కర్త. ఆనాడే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని పోరాడి దగ్గరుండి ఎంతోమంది దళితులకు గుడిలోకి ప్రవేశం కల్పించారు. కుల వివక్షను ప్రశ్నించారు. మాలమాదిగలతో కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయించారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లో చేరి ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు అరకొర జీతాలు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. మద్యపానాన్ని వ్యతిరేకించి ‘తాగుడుకే బానిసైతివా వోరన్నా/పాము పడగ నీడనుంటివా…నిషా నిజం కాదుర, విషం బతుకు నీదిరా/విందుల మందు బారు వీధి వల్లకాడురా/సారాజుల పన్నాగంరా వోరన్న/రేపటి నీ శవదహనంరా’ వంటి పాటలు రాసి, పాడి మందుబాబులను మద్యపానానికి దూరం చేశారు. టీచర్‌గా జిల్లా అక్షర ఉజ్వల కోఆర్డినేటర్‌గా కూడా పనిచేస్తూ ‘నా మనసు మబ్బు మీద చుక్కల్లాంటి అక్షరాలు పొదుగుతున్న చేతులకు దండాలు…ఆ చేతుల చదువులమ్మకు దండాలు’ అంటూ అక్షరాలను వెలిగించే పాటలు రాశారు.
సింగరేణి కార్మిక సమాఖ్య ఉద్యమాలకు ఆయన మద్దతు పలికారు. విపరీతమైన పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. ఆ దశలోనే ‘ఏమున్నదక్కో ఏమున్నదక్కా/ ముల్లె సదురుకున్న, ఎల్లిపోతావున్న/ఈ ఊళ్లే నాకింక ఏమున్నదక్కా’ లాంటి పాటలు రాసి ఆనాటి నిర్బంధాన్ని, ఊరొదిలి వలసబాట పట్టిన యువకుల దుఃఖాన్ని వినిపించారు. ఈ పాటే తర్వాత ఆర్.నారాయణ మూర్తి ‘ఎర్రసైన్యం’ సినిమాలో వచ్చి ప్రజాదరణ పొందింది.
సదాశివ స్త్రీల సమస్యల మీద రాసిన ‘పారాణి ఆరలేదు చెల్లెలా/నీకు నూరేళ్లు నిండాయా చెల్లెలా/రోజుకొక్క ఆడపడుచు కాలుతున్న నేల ఇది/రంగుల కలలో చిక్కిన నవయువకుల పాపమిది/అందుకనే ప్రతి ఆడది రౌద్రశక్తి కావాలి/అందాక నీ గొంతున అగ్నిగీతి మోగాలి’ లాంటి పాటలు కూడా సంచలనమయ్యాయి.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో మల్లావఝల సదాశివుడిది క్రియాశీల పాత్ర. ఆయన రాసిన పాటలు ఆ రోజుల్లో తెలంగాణ దుఃఖ సంతకాలుగా మిగిలిపోయాయంటే అతిశయోక్తికాదు. ‘తలాపున పారుతుంది గోదారి/నీ చేను నీ చెలకా ఎడారి/ రైతన్నా నీ బతుకు అమాస/ఎన్టీపీసి చూస్తోంది తమాషా’ లాంటి పాటలు ఉద్యమాన్ని మరింత రగిలించాయి.
అగ్నికెరటం లాంటి మల్లావఝల సదాశివుడి పేరు మీద గత రెండు దశాబ్దాలుగా ఆయన కుటుంబ సభ్యులు, తెలంగాణ వికాస సమితి కలిసి ‘మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం’ అందజేస్తున్నారు. గతంలో గూడ అంజన్న, జయరాజు, గోరటి వెంకన్న, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, విమలక్క, నిస్సార్, మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న, తైదల అంజయ్య, వజ్జల శివకుమార్, బెల్లి యాదయ్య, అయాచితం శ్రీధర్, మోహన్ ఋషి, మునాస వెంకట్, వనపట్ల సుబ్బయ్య, కోడూరి విజయ్ కుమార్ తదితర ప్రముఖులకు ఈ అవార్డు లభించింది. 2024-25 సంవత్సరానికి డా. చెమన్‌సింగ్‌కు, 2025-26 సంవత్సరానికి డా.సంగిశెట్టి శ్రీనివాస్‌కు ఈ నెల 3న ఈ అవార్డు అందజేస్తున్నారు.
సమకాలీన తెలంగాణ సాహిత్యంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న కవి, ప్రజ్ఞాశాలి, రచయిత డాక్టర్ చెమన్ సింగ్. వృత్తిరీత్యా వైద్యుడైనప్పటికీ, ప్రవృత్తిగా సాహిత్యాన్నే ఊపిరిగా మలచుకొని కవిగా, కథకుడిగా, వ్యాసకర్తగా విశేషమైన కృషి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన చెమన్ సింగ్, గ్రామీణ తెలంగాణ జీవితాన్ని, శ్రమజీవుల వేదనలను, మానవీయ సంబంధాలను తన సాహిత్యంలో అత్యంత ఆర్ద్రంగా ఆవిష్కరించారు. కవిగా ఆయన ప్రయాణంలో కలత చెందిన సందర్భాలే ఎక్కువ. ఆయన కవిత్వంలో వచన శైలి చాలా సరళంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. చెమన్‌కు బొగ్గుపొరల్లోని కార్మికుల శ్రామిక గొంతు అలజడి బాగా తెలుసు కాబట్టి పీడిత వర్గాల పట్ల సానుభూతిని, రేపటి ఉదయం పట్ల ఆశావాదాన్ని ప్రకటించడం ఆయన కవిత్వంలో ప్రధాన వస్తువైంది.
‘కుమ్మరికుంటోని కథలు’ చెమన్ సింగ్ కథా ప్రక్రియలో అత్యంత ప్రసిద్ధి పొందిన రచన. 1970-1985 ప్రాంతంలో తెలంగాణ పల్లెల్లోని సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులను, తన బాల్య స్మృతులను కథల రూపంలో ఆయన మలిచారు. ఈ కథల్లో ఊహాజనిత పాత్రలు కాకుండా, గ్రామీణ వాతావరణంలో తిరిగే సజీవ మనుషులు, వారి ఆత్మీయతలు, కష్టసుఖాలు కనిపిస్తాయి. ‘అమ్మమ్మ ఏడ్పు’, ‘సైకిల్ ఎక్కితే శిక్ష’, ‘ఇస్పాక్ ఆటలు’, ‘చిరుతల రామాయణం’, ‘బొంబాయి పొయ్యి’, ‘బతుకమ్మ పువ్వులు’ వంటి కథలు ఆనాటి తెలంగాణ పల్లె జీవితానికి నిలువెత్తు అద్దం పడతాయి. డాక్టర్ చెమన్ సింగ్ సాహిత్య కృషి తెలంగాణ ప్రాంతపు మట్టి వాసనను, పల్లె జీవనాన్ని, నాటి తరపు అనుభవాలను వర్తమాన తరానికి అందించడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించింది. తన నిరాడంబరమైన శైలి, ఆర్ద్రతతో కూడిన కథనంతో తెలంగాణ సాహిత్య జగత్తులో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఒక ప్రాంతపు అస్తిత్వం దాని చరిత్రలోనూ, సాహిత్యంలోనూ నిక్షిప్తమై ఉంటుంది. కొన్నిసార్లు ఆ చరిత్ర వెలుగు చూడకుండా కాలగర్భంలో కలిసిపోతుంది. ఆ సాహిత్యం వ్యూహాత్మకంగా నిర్లక్ష్యానికి గురవుతుంది. అటువంటి విస్మృత చరిత్ర, సాహిత్య పుటలను తిరగేస్తూ, తెలంగాణ మట్టి వాసనలను, స్థానిక చరిత్రను, దళిత బహుజన జీవితాల అక్షర రూపాలను నిరంతరం వెలికితీస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి డా.సంగిశెట్టి శ్రీనివాస్. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన తెలంగాణ తొలితరం రచయితలను (దస్త్రమ్), కవులను, పత్రికల (షబ్నవీసు)ను వెలికితీయడంలో ఆయన చూపిన చొరవ అసాధారణం.
తెలుగు సాహిత్యంలో తొలి దళిత కథాయిత్రి తాడి నాగమ్మ అనే చారిత్రక సత్యాన్ని ఆధారాలతో నిరూపించి, ‘తొలి తెలుగు దళిత కథాయిత్రి తాడి నాగమ్మ’ గ్రంథం వెలువరించారు. తెలంగాణ కథా వికాసాన్ని, దాని ప్రాచీనతను, శైలిని విశ్లేషిస్తూ ప్రాంతీయ అస్తిత్వ స్పృహను సాహిత్య వేదికలపై ప్రతిష్టించారు. పరిశోధకుడిగానే కాక, సంపాదకుడిగా సంగిశెట్టి శ్రీనివాస్ నిర్వహించిన పాత్ర అమోఘం.
విడివిడిగా ఉన్న సాహిత్య రూపాలను ఒకచోటికి చేర్చి, భవిష్యత్ తరాలకు పరిశోధనా నిధిగా అందించడంలో ఆయన సిద్ధహస్తులు. ఆయన రచనల్లోనూ, పరిశోధనల్లోనూ స్పష్టంగా కనిపించే మరొక కోణం సబాల్టర్న్ (అణగారిన వర్గాల) స్పృహ. కేంద్రీకృత సాహిత్య చరిత్రకు భిన్నంగా, అంచులకు నెట్టేసిన ప్రజా జీవితాలను, వారి మౌఖిక, లిఖిత సంప్రదాయాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. సాహిత్య చరిత్ర నిర్మాణంలో బహుజన, దళిత కథకుల, కవుల పాత్ర ఎంతటిదో నిరూపిస్తూ, ప్రాచీన తెలంగాణ గ్రంథాలయం నుంచి ఆధునిక డిజిటల్ యుగం వరకు తెలంగాణ సాహిత్య మూలాలను వెలికితీశారు. చరిత్ర మరచిపోయిన అక్షరాలకు పునర్జన్మనిస్తూ, తెలంగాణ సాహిత్య వికాసానికి ఆయన అందిస్తున్న సేవలు చిరస్మరణీయం.
కవిగా ఆయన ప్రయాణంలో కలత చెందిన సందర్భాలే ఎక్కువ. ఆయన కవిత్వంలో వచన శైలి చాలా సరళంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. చెమన్‌కు బొగ్గుపొరల్లోని కార్మికుల శ్రామిక గొంతు అలజడి బాగా తెలుసు కాబట్టి పీడిత వర్గాల పట్ల సానుభూతిని, రేపటి ఉదయం పట్ల ఆశావాదాన్ని ప్రకటించడం ఆయన కవిత్వంలో ప్రధాన వస్తువైంది.
డా.వెల్దండి శ్రీధర్
9866977741
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

