విశ్వగురుపై రగులుతున్న ఇన్వెస్టర్లు
ప్రపంచంలో చివరికి పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కూడా లాభాల బాటలో ఉండగా మన దేశంలోని స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. ఇజ్రాయెల్ మార్కెట్ లాభాల్లో ఉన్నది. అమెరికా మార్కెట్లు సానుకూలంగానే స్పందిస్తున్నాయి.
దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటు సాధించినట్టు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నెల క్రితం ప్రకటించారు. ఈ వృద్ధి రేటుతో దేశమంతా సంబురపడుతున్నదని గర్వంగా చెప్పారు. వాస్తవానికి ప్రపంచంలో మరే దేశం సాధించని విధంగా 7.8 శాతం వృద్ధి రేటు సాధించి ఉంటే స్టాక్‌మార్కెట్ రాకెట్లా దూసుకువెళ్లి ఉండేది. కానీ అలా జరుగలేదు. స్టాక్‌మార్కెట్ పాతాళానికి దూసుకెళ్తున్నది. ఈనెల 8వ తేదీన ఒక్కరోజే రూ.10.20 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. వరుసగా ఎనిమిది వారాల పాటు మార్కెట్ మైనస్‌లో ముగియడం 25 ఏండ్ల క్రితం నాటి రికార్డు. ప్రపంచాన్ని కలవరపెట్టిన కరోనా సమయంలో కూడా మార్కెట్ రెండు నెలల్లోపే కోలుకున్నది. కానీ ఇప్పుడు గత రెండేండ్ల నుంచి మార్కెట్ ఎలాంటి లాభాలు ఇవ్వలేదు. ఈ కాలంలో సెన్సెక్స్ 12.12 శాతం మైనస్‌లో ఉన్నది. నిఫ్టీ 11.01 శాతం మైనస్‌లో ఉన్నది. అంటే రూ.లక్ష పెట్టుబడి పెట్టినవారు రెండేండ్ల తర్వాత రూ.12 వేల నష్టంతో ఉన్నట్టు లెక్క. ఈ రెండేండ్ల కాలంలో సెన్సెక్స్ 9,874 పాయింట్లు నష్టపోతే, నిఫ్టీ 2,750 పాయింట్లు కోల్పోయింది.
ప్రపంచంలో చివరికి పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కూడా లాభాల బాటలో ఉండగా మన దేశంలోని స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. ఇజ్రాయెల్ మార్కెట్ లాభాల్లో ఉన్నది. అమెరికా మార్కెట్లు సానుకూలంగానే స్పందిస్తున్నాయి. మన దేశంలో మార్కెట్ పతనానికి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణమని పాలకులు నమ్మబలుకుతున్నారు. బయటి కారణాలతోపాటు మన సొంత కారణాలు కూడా మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. స్వల్పకాలిక ఆదాయం, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ టాక్స్ పెంచడంతో మార్కెట్ నడ్డివిరిచినట్టు అయింది. స్టాక్ మార్కెట్లో 13.5 కోట్ల మంది ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో 5.9 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లు కొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా పెట్టుబడి పెడుతారు. దేశంలో మొత్తం ఇన్వెస్టర్ల సంఖ్య సుమారు 15 కోట్ల మంది అనుకుంటే.. 28.35 కోట్ల మ్యూచువల్ ఫండ్స్ ఖాతాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఖాతాలు ఉండవచ్చు. మధ్యతరగతికి చెందిన వీరంతా గడచిన రెండేండ్ల నుంచి నష్టాల్లోనే కూరుకుపోయారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ మధ్యతరగతే ప్రధాన పాత్ర పోషించారు. స్టాక్ మార్కెట్లో రెండేండ్ల నుంచి నష్టాలు చవిచూస్తున్న ఈ వర్గం ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మధ్యతరగతి వర్గం 15 కోట్ల మంది అంటే ఎన్నికల్లో ఫలితాలు నిర్ణయించే శక్తి ఉన్న వర్గం.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత రెండేండ్ల నుంచి నిధుల తరలింపును నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. 2025లో రూ.1.66 లక్షల కోట్లు, 2026లో అక్టోబర్ నాటికే రూ.2.92 కోట్లు తరలించారు. ఇంకా రెండు నెలల సమయం ఉన్నది. గత సంవత్సరం కన్నా ఈ సారి రెట్టింపు అమ్మకాలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ స్థాయిలో తరలిస్తే నిజానికి స్టాక్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోవాలి. హర్షద్ మెహతా సంక్షోభ సమయంలో పడిపోయినట్టు ఇప్పుడు కూడా పడిపోవాలి. మార్కెట్ కొంతవరకు తట్టుకుని నిలబడిందంటే మన యువ ఇన్వెస్టర్లే కారణం. ఐటీతోపాటు వివిధ ఉద్యోగాల్లో ఉన్న యువత భవిష్యత్తు కోసం నెలనెలా సిప్ ద్వారా పెట్టుబడులు పెడుతున్నారు. భవిష్యత్తులో బాగుంటుందనే నమ్మకంతో వారు ఇన్వెస్ట్ చేస్తూ రెండేండ్ల నుంచి నష్టాలు భరిస్తున్నారు. ఇప్పుడు నమ్మకం సన్నగిల్లి వారంతా మార్కెట్ నుంచి తప్పుకొంటే పరిస్థితులు దయనీయంగా మారే అవకాశం ఉన్నది.
2014లో డాలర్‌తో పోలిస్తే ఆ ఏడాది అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆసియా-పసిఫిక్ టాప్ టెన్ కరెన్సీలో మన రూపాయి మొదటి స్థానంలో నిలిచింది. 2025-26లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 9.9 శాతం పడిపోయి ఆసియా కరెన్సీలో అత్యంత బలహీనమైనదిగా నిలిచింది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ కరెన్సీ కన్నా మన కరెన్సీ బలహీనంగా ఉన్నది. బీజేపీ అభిమానులు మోదీని విశ్వగురు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రూపాయి పాతాళంలో పడిపోతుంటే ఆ అభిమానులు మాత్రం విశ్వగురు నినాదాన్ని మాత్రం వదలడం లేదు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ కరెన్సీ కన్నా మన కరెన్సీ బలహీనంగా ఉన్నదని ఎవరైనా అంటే..‘అయితే పాకిస్థాన్‌కు పో’ అని బీజేపీ అభిమానులు సూచిస్తున్నారు. మన రూపాయి కన్నా అఫ్ఘాన్ రూపాయి విలువ ఎక్కువ. మన రూపాయికి అఫ్ఘాన్ 1 రూపాయి 35 పైసలు సమానం. హైదరాబాద్‌లో ఇప్పుడు కిలో బియ్యం ధర రూ.85 ఉన్నది. సరిగ్గా ఆరు నెలల క్రితం వరకు ఈ ధర రూ.50 వరకు ఉండేది. కేవలం ఆరు నెలల్లో 70 శాతం పెరుగడమంటే..ఇది గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనిది. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని 2016లో మోదీ బరేలిలో జరిగిన రైతు సభలో హామీ ఇచ్చారు. చెప్పిన గడువు దాటి నాలుగేండ్లు అవుతున్నా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. కానీ ఆరు నెలల్లోనే బియ్యం ధరలు రెట్టింపు అయ్యాయి. మధ్యతరగతి జీవితాలను సంక్షోభంలోకి నెడుతున్నారు.
ఆహార ధాన్యాలు సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హటావో అని నినాదం ఇచ్చినట్టు కేంద్రంలోని బీజేపీ పాలన మధ్యతరగతిని చాలా వేగంగా పేదలుగా మారుస్తున్నది. దేశంలో 80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారంటూ సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు.
పరిస్థితి ఇలానే ఉంటే పేదల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. అసంతృప్తితో యువత ఉద్యమిస్తుంటే..నివారించే మార్గాలపై కేంద్ర పాలకులు దృష్టి పెట్టకుండా అణచివేతపైనే దృష్టి సారిస్తున్నారు. ఇకనైనా ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి ముంచుకొస్తున్న ప్రమాదంపై దృష్టి పెట్టకపోతే దేశం తీవ్రంగా నష్టపోతుంది.
బుద్దా మురళి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

