మారుతున్న కాలంతో పాటు వ్యాపారస్థులు వినియోగదారులను ఆకర్షించి, తమ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుకునే విధానం కూడా మారిపోయింది. సంప్రదాయ మార్కెటింగ్ వెనక్కిపోయి, మార్కెటింగ్‌లో డిజిటల్ విధానం అనే నవశకం ఆరంభమైంది.
దీంతో సంప్రదాయ మార్కెటింగ్ వ్యూహాలు కనుమరుగవుతున్నాయి. కొత్త రకం పద్ధతులు నేడు ప్రజాదరణ పొందుతున్నాయి. మరోమాటలో చెప్పాలంటే… వ్యాపార ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్ ప్రధాన వాహికగా మారిపోయింది.
ఆధునిక ప్రపంచంలో ‘ఇంటర్నెట్’ ఒక సరికొత్త మార్కెట్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయవంతమైన వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్రమాణంగా మారింది. ఇది వివిధ ఉత్పత్తులకు, సేవలకు అనేక అవకాశాలు కల్పిస్తూ బహుముఖంగా విస్తరిస్తున్నది. వ్యాపారంలో మెరుగుదలను చూడాలనుకున్నా, అమ్మకాలను పెంచుకోవాలనుకున్నా డిజిటల్ మార్కెటింగ్‌లోకి ప్రవేశించక తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది.
సోషల్ మీడియా: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర ప్లాట్‌ఫామ్‌లు ఈ విభాగం కింద ఉన్నాయి. ఇవి ఆయా వ్యాపారాలకు విలువైన ‘కంటెంట్’ను సృష్టించడం ద్వారా సంబంధిత బ్రాండ్‌ను బహుళ ప్రచారంలో పెట్టడానికి, అమ్మకాలను పెంచటానికి తోడ్పడు తున్నాయి. వ్యాపారస్థులు తమ వినియోగదారులతో అనుసంధానమై వారి అభిరుచులను తెలుసుకోవటానికి, తమను తాము మెరుగుపర్చుకోవటానికి కూడా అవకాశం కల్పిస్తుంది ఈ వేదిక.
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ): ఆన్లైన్ ట్రాఫిక్‌ను, వెబ్సైట్ల ర్యాంకింగ్‌ను పెంచుకోవడానికి వ్యాపారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అత్యంత నాణ్యతతో, ఎక్కువ సంఖ్యలో ఖాతాదారులకు సేవలందించటానికి ఇది ఉపకరిస్తుంది. గూగుల్ ఎస్ఈఆర్పీలో వెబ్సైట్ ర్యాంక్ ఎంత ఎక్కువ ఉంటే, బ్రాండ్ వాల్యూను అంతగా పెంచుకోవడానికి అవకాశాలుంటాయి.
కంటెంట్ మార్కెటింగ్: ఇదొక రకమైన కొత్తరకం మార్కెటింగ్ వ్యూహం. ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవటం కన్నా, ఆయా ఉత్పత్తుల తాలూకు కంటెంట్‌ను వినియోగదారులకు విడమర్చి చెప్పటంపై దీంట్లో ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ విధంగా తమ ఉత్పత్తులు, సేవల వైపు వినియోగదారులను ఆకర్షించే పద్ధతి ఇది.
వీడియో మార్కెటింగ్: వీడియో అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ప్రచార సాధనం. పదాలతో కూడిన మెసేజీలకన్నా చిన్న చిన్న వీడియోల ద్వారా ఎక్కువ మంది చెంతకు వెళ్లవచ్చు. ఎడ్యుకేష నల్, ఎంటర్టైనింగ్, లైవ్, ప్రీ-రికార్డెడ్ వంటి పలు రకాల వీడియో కంటెంట్ అందుబాటులో ఉంటోంది.
ఈ-మెయిల్ మార్కెటింగ్: డిజిటల్ మార్కెటింగ్ ప్రారంభమైన కొత్తలో వినియోగంలోకి వచ్చిన వేదికల్లో ఇది ఒకటి. కొత్త ఉత్పత్తులు, డిస్కౌంట్లు, స్పెషల్ ఈవెంట్లు వంటి వాటి గురించి వినియోగదారులకు ఎప్పటికప్పుడు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించవచ్చు.
పే పర్ క్లిక్ (పీపీసీ): వ్యాపారస్థులు తమ వెబ్‌సైట్‌కు వినియోగదారులను (ట్రాఫిక్‌ను) ఆకర్షించే మార్కెటింగ్ వ్యూహం. యాడ్ రూపంలో ఇవి ఉంటాయి. యాడ్‌ను క్లిక్ చేసిన ప్రతిసారీ ప్రచురణకర్తకు నిర్ణీతమొత్తం చెల్లిస్తారు.
మొబైల్ మార్కెటింగ్: నేడు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వినియోగం ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నది. ముఖ్యంగా యువ వినియోగదారులను ఆకర్షించటానికి ఇది అత్యంత ప్రధాన వేదికగా మారింది. ఒక కంపెనీ వెబ్సైట్లో ఉండే సమాచారం అంతా నేడు మొబైల్ యాప్ రూపంలో సెల్ఫోన్లో అందుబాటులో ఉంటున్నది. గూగుల్ రీసెర్చ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 27 శాతం మంది ప్రజలు మొబైల్ వాయిస్ సెర్చ్‌ను ఉపయోగించి, వివిధ ఉత్పత్తులు, సేవల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కాబట్టి, డిజిటల్ మార్కెటింగ్‌లో మొబైల్ మార్కెటింగ్ అత్యంత కీలక విభాగంగా అవతరిస్తున్నది.
ఆడియో మార్కెటింగ్: గత శతాబ్దం ఆరంభంలో మొదలైన రేడియో నేటికీ తన ప్రాధాన్యతను కోల్పోలేదు. కాకపోతే కొత్తరూపంలో ముందుకొచ్చింది. గూగుల్ హోమ్, అమెజాన్ అలెక్సా, పాడ్‌కాస్ట్‌లు, ఎఫ్ఎం చానళ్లు వంటి నూతన రూపాల్లో ఆడియో కొత్తతరాన్ని ఆకర్షిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆడియో మార్కెటింగ్ కూడా ముందుకొచ్చి విశేష ప్రజాదరణ పొందుతున్నది.
ఇంటర్నెట్ వినియోగదారులు కోట్ల సంఖ్యలో ఉంటారు. వారి సంఖ్య రోజూ మరింత పెరుగుతున్నది. దీన్ని బట్టి చూస్తే.. డిజిటల్ మార్కెటింగ్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారులను కనుగొనడానికి మీ వ్యాపారానికి బహుళ ప్రచారం అవసరం. దానికి ఆన్లైన్ మార్కెట్ ఉత్తమ మార్గం. సంప్రదాయ మార్కెటింగ్ కంటే డిజిటల్ మార్కెటింగ్ చవకైనది. సంప్రదాయ పద్ధతుల్లో ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యాపార ప్రచారం కోసం ముద్రించాల్సిన సామాగ్రి అవసరం కూడా ఖరీదైనది. దీనికి సమయం కూడా ఎక్కువ పడుతుంది.
కానీ డిజిటల్ మార్కెటింగ్‌తో చిన్న వ్యాపారమైనా తక్కువ వనరులతోనే వెంటనే ప్రారంభించవచ్చు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న అన్ని రకాల విధానాలను అనుసరిస్తూ మార్కెట్‌ను విస్తరించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. ఆన్లైన్లో ప్రకటనల ద్వారా లక్ష్యిత వినియోగదారులు ఎవరో తెలుసుకొని అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. వ్యాపారంలో మీ పోటీదారులు ఏమి చేస్తున్నారో తెలుసుకోవచ్చు. మీ పోటీదారుల కంటే ఎక్కువ మంది కస్టమర్లను మీ వెబ్‌సైట్‌కు రప్పించుకోవటానికి పలురకాల ఆన్లైన్ ‘టూల్స్’ను ఉపయోగించవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్‌లో మరో ముఖ్యమైన అంశం ఏమంటే.. వినియోగదారుల అభిప్రాయాలను, సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉండటం. కస్టమర్ల ప్రశ్నలకు సమాధానమివ్వడం, ఉత్పత్తులు, సేవల వినియోగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, వారిని రిపీటెడ్ కస్టమర్లుగా మార్చడం ద్వారా మార్కెటింగ్ నిపుణులు వారితో సంబంధాలను పెంచుకుంటారు. వినియోగదారులతో మంచి సంబంధాలే, మీ వ్యాపారవృద్ధికి గీటురాయి. డిజిటల్ మార్కెటింగ్ మొదట అయోమయంగా అనిపించవచ్చు. కానీ కొంత సమయాన్ని వెచ్చిస్తే దాని గురించి అవగాహన పెంచుకొని వినియోగించుకోవచ్చు.
– శ్రీధర్ జక్కుల,
96426 32683