నిండు నూరేండ్ల ప్రాణం
పై వాన్ని చేరాలని ఆరాటపడతావుంటే
నీవు జన్మనిచ్చినవాళ్ళు, కోడళ్ళూ అల్లుళ్ళూ
వారు జన్మనిచ్చినవాళ్ళు మనవళ్లు మనవరాండ్లు
విషాద వదనాలై నీ చుట్టూ మూగినపుడు..
నీ చివరి ఉచ్ఛాస నిచ్ఛాస
వారి గుండెచప్పుడును వారికే వినిపించినపుడు…
అంతటా ఆవరించిన నిశ్చబ్దం
పెనురోదనై ఒక్కసారిగా మిన్నంటినపుడు..
అపుడపుడే మాటలు నేర్చి ఏమైందని అడిగిన
వచ్చీరాని మాటల చిన్ని ప్రాణాన్ని గుండెలకత్తుకుని
నీ మునిమనవరాలు కన్నీటిసంద్రమైనపుడు…
ఊరంతా కుటుంబమై
నీ జ్ఞాపకాలు నెమరేసుకున్నపుడు…
రెక్కాడితే డొక్కాడని పేద అభిమానం
పని వదులుకుని
నీ కట్టె వెంట పెనుదుఃఖమై నడిచినపుడు…
నీ మతంకాని ప్రేమ నీ వర్గంకాని ఆప్యాయత
కుటుంబమంతా వేదనై ఇంట్లో పొయ్యి వెలిగించనపుడు
నీ మరణానికి స్మశానం నిశ్శబ్దంగా రోదించినపుడు…
ఇదే కదా జీవనసాఫల్యం… ఇదే కదా మోక్షం…
ఆస్తిపాస్తులు ఎన్ని సంపాదించిననేమి ఫలం…
నీ మరణానికి ఒక్క కన్నూ చెమర్చనపుడు…
బాధ పడిన ఆకాశం ఒక్క కంటి బొట్టు రాల్చనపుడు…
అశోక్ గుంటుక: 99081 44099