‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులు
వరదాచార్యులు చిన్ననాటి నుంచే సృజనాత్మకతాశక్తిని అణువణువు నా జీర్ణించుకున్నవారు. ఆయన శారదాదే వి మంత్రోపాసకులు. సంప్రదాయ భా వా ల్ని కవితాత్మకంగా ప్రకటించగల కవిగా చిన్నవయసులోనే గొప్ప పేరు సాధించిన ప్రౌఢకవి.
తెలుగు సాహిత్యంలో సంప్రదాయ కవితా ప్రవర్తకుడిగా ప్రవర్ధిల్లి, సరస్వతీదేవి మెడలో ‘మణిమాల’గా కాంతులీని, ‘అభినవ పోతన’గా తెలుగు ప్రజల హృదయపీఠంపై సుస్థిరస్థానం సంపాదించుకొని, సంస్కృతాంధ్ర భాషా ప్రౌఢ విరాట్టుగా విరాజిల్లిన మహాకవి డా. వానమామలై వరదాచార్యులు. 1912 ఆగస్ట్టు 16వ తేదీన వరంగల్ జిల్లా మడికొండలో ఆయన జన్మించారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ, శాసనమండలి సభ్యుడిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు.
వరదాచార్యులు చిన్ననాటి నుంచే సృజనాత్మకతాశక్తిని అణువణువు నా జీర్ణించుకున్నవారు. ఆయన శారదాదే వి మంత్రోపాసకులు. సంప్రదాయ భా వా ల్ని కవితాత్మకంగా ప్రకటించగల కవిగా చిన్నవయసులోనే గొప్ప పేరు సాధించిన ప్రౌఢకవి. పద్యం, గేయం, వచన కవిత, నవల, నాటిక, బుర్రకథ, హరికథ ఇలా ప్రక్రియ ఏదైనా ఆయన కలం పాళీలో ఒదిగి అది సువర్ణ మణిమయ శోభితంగా వేయిరేకుల పద్మంలా వికసిస్తుంది. ‘మణిమాల’, ‘జయధ్వజము’, ‘స్తవరాజ పంచశతి’, ‘కూలిపోయే కొమ్మ’, ‘విప్ర లబ్ధ’, ‘పోతన చరిత్రము’, ’దాగురింతలు’ మొదలైన 62 గ్రంథాలను రాశారు. ‘జయధ్వ జం’ కావ్యంలోని గేయాలన్నీ భారతీయతకు అద్దం పట్టినవే. భారతమాతను స్తుతిస్తూ…
‘వేదవేదాంత విజ్ఞాన ప్రదాయినీ
బౌద్ధసిద్ధాంత నిర్వాణ ప్రచారిణీ
కాళిదాస వ్యాస
కావ్యమందాకినీ
సంగీత సాహిత్య సత్కళామోహినీ’
వరదన్నకు, పోతనకు ఎన్నో పోలికలు ఉన్నాయి. వరదన్న వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా కర్షకుడిగా మారి వ్యవసాయం చేసేవారు. కాబట్టి వ్యవసాయంలో..కవిత్వంలో పోతన బాటను అనుసరించారు. అందుకే ఆయన ‘అభినవ పోతన్న’గా పేరొందారు. వరదన్న అవిరళకృషి ఫలితమే పోతన చరిత్ర మహాకావ్యం. 1968లో ఈ కావ్యానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆధునిక మహాకవుల్లో పద్యకావ్యాలు రాసినవారు ఉన్నారు. గేయకావ్యాలు రాసినవారు ఉన్నారు. కానీ మహాకావ్యం రాసినవారు లేరు. పోతన జోడెద్దుల బండి పోతున్న తీరును మన అభినవ పోతన పలికించిన తీరు అందంగా కనిపిస్తుంది ఈ పద్యం లో…
‘చకచక గిత్తల కదుముకు
త్రకిట ధికిట ధకిట ధా మృదంగధ్వని టక్
టిక్ మను కేదారాహతి
నికట తటిని శకట మొకటి నిల్చినయంతన్’
అంటూ జోడెద్దుల వేగానికి, ఆ బండి చేసే శబ్దాన్ని అందులో మద్దెల ధ్వనికి అనుసరణీయ గతిలో ఆ బండి నడుస్తుందని లయాన్వితంగా వరదన్న చెప్పిన తీరు అత్యద్భుతం. వరదన్న ఎత్తుకున్నది పద్యమైనా, గద్యమైనా అది మన గుండెల్ని హత్తుకుంటుంది పరమ రమణీయంగా.
‘జలజల పూలు రాలినటు
చల్లని మెల్లని పిల్ల తెమ్మెరల్
తెలతెలవారి వీచినటు
తియ్యని కమ్మని మీగడల్
తొలితొలి విచ్చినటు తోరపు
సిగ్గునముగ్ధకన్ దొవల్
వలపుల జిమ్మునట్లు చెలువమ్మిడు
చొక్కపు కైత భారతీ!’
పూలు జలజలమని రాలినట్లుగా, పిల్లగాలులు చల్లగా, మెల్లగా తెలతెలవారి వీచినట్లుగా, తియ్యని పాలమీగడల్ మొదటిసారిగా తోడు విచ్చినట్లుగా ఎంతో సిగ్గుతో ముద్దరాలి కన్నులనే కలువలు ప్రేమను వెదజల్లినట్టుగా, చిక్కని, చక్కని కవిత్వం తన సొగసును వెదజల్లుతున్నదని వరదన్న శారదాదేవికి విన్నవించుకుంటున్న తీ రు అపూర్వం. అనన్యం. చాలా రోజుల నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రై తు కుటుంబం వర్షాగమనంతో, ఆనందోత్సాహాలతో పులకించిపోతున్న సందర్భం లో వరదన్న పలికించిన ఈ కింది గేయం తెలుగువాడి ఎదలో సుధలను వర్షిస్తుంది.
‘వచ్చెను వచ్చెను వర్షాలు
మా వసుధారాణికి తలబ్రాలు
విచ్చిన పూలై ప్రజాముఖమ్మున
వెల్లివిరిసెను మురిపాలు
కత్తులు కత్తులు కలిసినయట్టుల
ఉత్తరదిక్కున ఉరిమింది
కనుపాపల చెక్కని మెరిసింది
దివి గడగడగడగడ వణికింది
దిశ చకచకచకచక మెరిసింది
చలిగాడుపు రివరివసాగింది’
వరదన్న కలం అనంతమైనది. ‘మణిమాల’లోని ఈ పద్యం చదివితే ప్రపంచ సాహిత్యంలోనే ఇంతటి మానవతా దృక్పథంతో భావగర్భితంగా పద్యం రాయగల కవులు లేరేమో అనిపిస్తుంటుంది.
‘కరకు కసాయిదౌ ఖడ్గమ్ము గూడ దా
వెనుక ముందాడదే విశసనమున
ఈ యమాయిక పక్షినెటు జంపుటని యమ్ము
నా బోయకేల వెన్కంజ నిడదె
నోరెరుంగని లేళ్ళ గారింతు నెటులని
బార్తుపాకీ గుండె పగులదొక్కొ
నేనెట్లు జంపుదీమీను బిల్లలనని
గాలమ్ము పెడమోముగా మలగదె’
ఖడ్గం, బాణం, తుపాకీ, గాలం అమాయక ప్రాణులను హింసించడానికి కిరాతకుడు ఉపయోగించే ఆయుధాలు. అయితే ఇక్కడ జీవిని కోసేటప్పుడు కత్తి వెనుకకు ముందుకు పోతుంది. అంటే ఈ జీవిని చంపాలా? వద్దా? అని ఆలోచిస్తూ వెనుక ముందాడుతుందట. బాణం సంధించి వదిలే ముందు వెనుకకు పో తుంది. అంటే ఈ పక్షిని నేను చంపనే చం పనని వెనుకకుపోతుందట. మూగజీవాలను నేను చంపాలా? అని తుపాకీ గుండె ఢాం అని పగిలిపోతుందట. చేపపిల్లలను గాలం చంపనని పెడమొగం పెడుతుందట. ఎందుకంటే గాలం మొన వంకరగా ఉంటుంది కదా! ఇటువంటి ఆయుధాలకున్న మానవతా దృక్పథం, దయ ఆ కిరాతకునికి లేదని వరదాచార్యులు చేసిన భావనావిన్యాసం అమోఘమైనది.
ఇంతటి మహాకవికి వారణాసి విశ్వవిద్యాలయం 1976లో గౌరవ డాక్టరేట్ ప్రకటించి, ‘విద్యావాచస్పతి’ అనే బిరుదుతో సత్కరించింది. జగిత్యాల జిల్లా కోరుట్లలోని భారతీ సాహిత్య సమితి వ్యవస్థాపకుడు, అష్టావధాని డా.అందె వేంకటరాజం ‘వానమామలై వరదాచార్యుల కృతులు- అనుశీలనం’ అనే అంశంపై పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 1975లో కోరుట్లలో వరదన్న షష్టిపూర్తి మహోత్సవాలను వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు అందె వేంకటరాజం. ఆ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు వరదాచార్యులకు గండపెండేరాన్ని అలంకరించారు. దివాకర్ల వేంకటావధాని స్వర్ణకంకణాన్ని బహూకరించారు. డా.వానమామలై వరదాచార్యులు 1984 అక్టోబర్ 31న పరమపదించినా, తెలుగు ప్రజల హృదయాకాశంలో కవిచంద్రునిగా పండువెన్నెలలతో ప్రకాశిస్తూనే ఉంటారు.
తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

