పుల్ల పుల్ల చేర్చితే గూడు
ఇటుక ఇటుక పేర్చితే భవనం
జీవితం జీవితం నడిస్తే తరం
అనుభవం అనుభవం సంఘర్షిస్తే సిద్దాంతం
‘ఓయీ సహాధ్యాయీ,
మరి భావజాలాన్నెలా నిర్మిస్తావు’ అని అతను
చౌరస్తా నిలబడి పెద్ద గొంతుకతో అరిచాడు.
కోట్లాది మంది రహదారిలో వెళ్తున్నారు
ఎవరి అంతర్గత ప్రపంచంలో వాళ్ళు పొర్లుతూ
గజిబిజిగా హడావిడిగా పరిగెత్తుతున్నారు…
ప్రశాంతంగా నడుస్తున్న ఒక్క ‘మనిషి’ మాత్రం
ఒక చేతిలో ఆకాశాన్ని మరో చేతిలో అగ్నినీ పట్టుకొని
జేబు నిండా సముద్రాన్నీ, పాదాల నిండా బురదను పులుముకుని
భూమిని కొలుస్తూ వెళ్తున్నాడు
అతను చౌరస్తా మధ్యలోకి వచ్చి ఆగి
నేలలోని మట్టిని తవ్వి అక్షరాలు చెక్కడం మెదలెట్టాడు
అలా చెక్కుతూ, చెక్కుతూ
ఆలోచనలన్నిటినీ రాశి పోసి ప్రశ్నలతో పుటం పెట్టి
గతకాలపు కన్నీటి నదులను, నడిచొచ్చిన గాయాల రక్త శిలలను
ఆశల మేఘాలతో వస్త్ర కాగితం పట్టి
వచ్చిన ‘రజను’నంతా గుండెలపై పూసుకుని
‘నేనే సమాధానం’ అని ఆ మనిషి అరిచి చెప్పాడు..
భావజాలం అంటే సూర్యున్ని వెలిగించడమే
కాంతి రేఖలను ప్రసాదించడమే అనీ చెప్పాడు.
తను నడిచిన నేల అంతటా అక్షరాలను వెదజల్లి
మరెన్నో సూర్యుళ్ళను జ్వలింపజేశాడు…
దశాబ్దాలు గడిచిపోయాయి
ఈసారి ఇంకొకరెవరో గుంపుల్లోంచి అడిగారు
‘భావజాలాన్నెలా వ్యాప్తి చేస్తావు?’ అని!
గజిబిజిగా పరిగెడుతున్న జనం మధ్య నుంచి
ఈసారి కూడా ‘ఒక్క మనిషి’ మాత్రమే స్పందించాడు…
నడుస్తున్న వాడు ఆగి తిరిగొచ్చి చౌరస్తాలో నిలబడ్డాడు
నేల తల్లిని పూజించి స్వేచ్ఛా పునాదులు తీసి
కలలు ఇటుకలతో, అహరహం శ్రమించి, ప్రాణాన్ని అడ్డుపెట్టి
మొదటి మనిషి రూపాన్ని విగ్రహంగా
ఆకాశమంతా ఎత్తులో నిలిపాడు…
ప్రజల గుండె చప్పుల్ళకు దృశ్యాన్ని చెక్కాడు…
ఇప్పుడు అక్కడి గాలులంతటా
‘సమానత్వమే మానవత్వం’ అనే నినాదం
మంత్రఘో:లా అష్టదిక్కులా వ్యాపిస్తోంది…!
మామిడి హరికృష్ణ: 80080 05231
రాజ్యాంగ రథసారథి, బాధిత బలగానికి బంధువు సూపుడేలు
మను మాయలు నేర్సిన మల్లన్నల మీద
గురిబెట్టి గుడ్లెర్ర జేస్తంది
హిందూ సముద్రాన్ని తల్లుడమ్మల్లుడంజేసి
అంటరాని కులం చీకట్ల బలైన బాంచగాల్లకు
రిజర్వేషన్ కూటికుండ రివాజులు దెచ్చి
తలింత తాగుమంటే…
నాసబెట్టి వాసన బట్టిన మల్లన్నలు
అయిపుతోని కుండచుట్టు కుదురోలెజేరి
ముందునోళ్లను ముర్క సూడనియ్యలే
ఎనుకోల్లకు యెర్క జెయ్యలే
పంచుకతినే ప్రజాస్వామ్య బాండమున్నదనే
హక్కు ముక్కలు దెఉవని యెడ్డియెల్లన్నలు, ఎల్లక్కల సేతులు
మనువు మోపిన మోర్దోపు బండ కింది సొరికెల్నే సొట్టబడ్డయి
మాదిగకు సావని బొందలు, సాగనంపే పీనుగలు
సచ్చిన గొడ్లతోల్లు కచ్చు గదులనీయని పుచ్చులు వూరెల్లనీయలే
మోచి సెప్పుల కుప్పల కిర్రులు
గొంతికెలనే కుతికెబడ్డ మెతుకులు
బైండ్ల కొమ్ము, డుబ్బుల కొలుపులిడ్వలే
సిందు అందెల బాగోతాలకు, తీగై సాగిన రాగాలకు
అప్పుపడ్డ వుప్పసలు డక్కలి కళ జాంబ పురాణ పటాలు
ఏకరువు బెట్టిన ఆకలి డొక్కలు
రెల్లిగుల్ల బరువుల గొళ్ళాలూడలే
బుడగె జంగం జమిడికె తొడిమెలు పొలిమేర్లు దాటని పొద్దులు
పాకీ తలను మూసేసిన రోత బకీట్లు
పలకా బలపము చిలకరించని చిమ్మట్ల చీకట్లు
మెల్లమెల్లగ రిజర్వేషన్ మెతుకులకు కూటుగయి
అండ్లమాకో బుక్కున్నదనీ,
దాన్ని లెక్కగ పంచుక తిందామని పబ్బతి బడ్తున్నయి
యేండ్లకేండ్లు సరిసప్పల్లేకుండ కుండంతా
ఏకచత్రంగా కుడిచిన మల్లన్నలు
ఏకతా రాగంబాడుకునే ఏక్ మినార్లయి
వేయి పడిగెల వుక్కు అడుగుల్తో…
కోర్టు కోరలై కొరికేసినా..
ఎల్లక్కలు, ఎల్లన్నలు అసెంబ్లీ అంచులకు
పార్లమెంటు పంచల పానసరం బడ్డా
దశాబ్దాలుగా దండోరేసినా, కంచె దాటని కమిషండ్లేసినా,
పాబందులు కానియ్యని రాబందుతనాలు
మీడియా కన్నులు పెన్నులు గుండె విప్పని గుటుక్కులు
అంబేద్కర్ బొమ్మను నిత్తెం అంగిట్ల ఆడిస్తూ
విజన్ ని కింది దాకా చేరని కితాబును జేసి
అక్షరాన్ని అడుగుదాకా అందనియ్యక
మనువును తనువంత తడుపుకున్న మల్లన్నలు
అంబేడ్కరిజాన్ని అడుగు వట్టిస్తున్నరు
ఎల్లక్కలు, ఎల్లన్నలంత
ఎదమీద యెత్తుకున్న నాయకత్వం
మనువు పెద్దయ్యల కాల్ల చుట్టు పిల్లికాకలు
పాతికేండ్లయినా పండని విషాద ఫలము
రేపటి కొత్త నెత్తురు అంబేద్కర్
అడుగులు సడులు విజయాలై
ఆఖరి అంచు పంచదాకా
పల్లందిగే పతాకలైతయి.
జూపాక సుభద్ర: 94410 91305
హైదరాబాదు భాగ్య నగరంలో కొత్త వెన్నెల!
తెలంగాణ రాష్ట్రమంతా పర్చుకునే మమతల వెండి వెన్నెల!
కోట్లమందిని దిల్ సే అలై బలై తీసుకునే నిండు పున్నమి వెన్నెల.
ఆత్మీయులకు ఆలింగనం అహంకారులకు సింహస్వప్నం..!
అతనే బాబాసాహెబ్! శిల్పమై వెలిసిన జ్ఞాన సాహెబ్!
అజ్ఞానం చీకట్లను దునుమాడే కాగడై దేశపు దీపమై వెలుగుతున్న దీపమాల సాహెబ్..!
అఖండ జంబూద్వీప మేరు పర్వతమే.. అయినా సాహెబ్ కాళ్ళు ఎల్లప్పుడూ
సారం, పదనున్న మగాణం భూమిలోనే..
నూటిరువై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నా.. సాహెబ్ చూపులన్నీ
ఆత్మభిమానం గల భూమి మీదనే..! ఆ మనుషుల మీదనే..
ఇంకా అంటారా?.. దేశపు కిరీటంలో పుదిచ్చినది కోహినూర్ వజ్రం తెలంగాణ అయితే!
తెలంగాణకు కలికితురాయి అతను
సాహెబ్‌కు ఓపికతో పాటు ఇకమతు.. ఇమ్మత్తూ ఎక్కువే…
అందరూ రండీ! కరచాలనం చేయండి.. ఎదురు బదురు ముచ్చట వెట్టుండి..
‘సాహెబ్! నీ చూపుడు వేలును కాస్తా అటువైపు సారించండి!
అటే! దేశ వనరులను అమ్ముతున్న వారివైపు, కొంటున్న వారి వైపు! అని.
సాహెబ్‌ను కలవడానికి అపాయింట్మెంట్ అక్కరలేదు.
లైన్ కట్టే పనిలేదు. చీటి పంపే పని అసలు లేదు.
ఇగ తడువెందుకు? రాండి! బాబా సాహెబ్ అంబేద్కర్‌తో సంవాదం చేయండి.
ఒక్కటిమాత్రం చేయండి! వచ్చేముందు మీ ఇండ్లలోని గ్రంథాల నిండా ఉన్న
అక్షరాల్లో దూరి ఉన్న సాహెబ్‌ను చదివిరాండి.
నిజాయితీపరులైన జ్ఞానవంతులు అంటే సాహెబ్‌కు చాలా ఇష్టం.
ఎదిరిచూస్తూ మీతో పాటు నేను… !! జై భీమ్!!
డాక్టర్ గోగు శ్యామల: 98669 78450
ఇప్పటిదాకా హైదరాబాద్ అంటే
చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్
మ్యూజియం మాత్రమే అనుకున్నాం
ఇప్పటినుంచి అంబేద్కర్,
సచివాలయం, అమరజ్యోతి కూడా
అని కొత్తగా అర్థం చేసుకుందాం
ఉద్యమాల గడ్డ సాక్షిగా చెప్తున్నా!
మూడు నిర్మాణాలు, మూడు ప్రతీకలు
మూడు కాలాలలో మానవ వికాస దీపికలు
ఇప్పుడు నా తెలంగాణ
బహిష్కృతుల ఆత్మగౌరవ పతాకం!
విస్మృతుల వికాస స్ఫూర్తికేతనం!!
విజితుల నిత్యచైతన్య జ్వలనం!!!
అయినంపూడి శ్రీలక్ష్మి: 99799 28562
ఆ చూపుడు వేలే
దారి చూపకుంటే ఇంత దూరం
నడిచి వచ్చేవాళ్లమా…
ఆ అడుగులే ముందుకు నడవకుంటే
గుడి.. ఒడి.. బాయి.. చెరువు
మాకు అంది ఉండేవా…
ఆ చేతిలోని
ఆ వయి లేకుంటే
ఇలా నిలబడగలిగే వాళ్లమా….
నిన్నటిదాక టాంక్బండంటే
బుద్ధుడొక్కడే..
ఇవ్వాళ్టి నుంచి
వెయ్యిన్నొక్క కాంతుల సూర్యుడు కూడా..
డా పత్తిపాక మోహన్: 99662 29548