‘బ్లడ్ క్యాన్సర్’ చికిత్స నిమిత్తం డాక్టర్ సిడ్నీ ఫార్బర్ 75 ఏండ్ల కిందట పరిశోధనలు చేశాడు. ఫార్బర్ అవసరాలు, ఆలోచనలకనుగుణంగా డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు మెతోట్రెక్సేట్ ఔషధాన్ని అభివృద్ధి చేశాడు. చిత్రంగా అది 21వ శతాబ్దంలో రుమటాలజీ ఔషధంగా గుర్తింపు పొందింది. ఇంకా గుండెవ్యాధులు, స్త్రీ వ్యాధుల వంటి చికిత్సల్లో కూడా చోటు దక్కించుకున్నది.
న్యూయార్క్‌లోని బఫెలోలో 1903లో ఫార్బర్ జన్మించా డు. పోలండ్ నుంచి వలస వచ్చిన యూదు కుటుంబం తనది. తండ్రి సైమన్, తల్లి మటి ల్డా. 14 మంది సంతానంలో 3వ వాడు. ఇం టిలో విద్యా వాతావరణం ఉండేది. ఫార్బర్ తండ్రి పిల్లలతో పుస్తకాలు చదివించి సమీక్షలు రాయించేవాడు. ఇంటిలో యిద్దిష్, బయట ఇంగ్లిష్, జర్మన్ మాట్లాడేవాడు.
కిశోర వయసులో ఉన్న ఫార్బర్ 1918లో ఇన్ఫ్లుయెంజా మహమ్మారి ఘోరాలను చూశా డు. ఆ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ప్రజలను బలి తీసుకోగా, బఫెలోలోనే 20 వేల మందిని పొట్టన పెట్టుకున్నది. ఫార్బర్ వైద్యశాస్త్రం చదవటానికి ఆ సంఘటన ప్రేరణ అయింది. కానీ, అమెరికాలో 1920లకు ముం దున్న యూదు వ్యతిరేక భావనల వల్ల అక్కడ సీటు దుర్లభమైంది. దాంతో ఫార్బర్ జర్మనీలో సీటు పొందాడు. రెండవ సంవత్సరంలో అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చేరగలిగాడు. 1927లో చదువు పూర్తయింది. పాథాలజిస్ట్‌గా శిక్షణ పొందాడు. పిల్లల పాథాలజీ మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడు. చాలామంది పిల్లలు ‘బ్లడ్ క్యాన్సర్’తో రాలిపోవటం ఆయనను కలవరపెట్టింది. క్యాన్సర్ చికిత్సలో పురోగతి సాధించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికీ క్యాన్సర్ చికిత్స చాలా అపరిపక్వంగా ఉండేది. కానీ, 1948 కల్లా ఒక ఆశా రేఖ కనిపించింది. అదే మెతోట్రెక్సేట్!
బోస్టన్‌లో డార్ చెస్టర్కు చెందిన రెండేండ్ల పిల్లవాడు రాబర్ట్ సాండ్లర్ చాలా నీరసంగా ఉండేవాడు. అంతకుముందు ఆగస్టులో ఆ పిల్లవానికి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని నిర్ధారణయింది. తరచూ జ్వరం, రక్తహీనత, ప్లేట్లెట్స్ తగ్గుదల ఉండేది. దాంతోపాటు ప్లీహం పెరుగుదల, ఎముకల నొప్పి, వెన్నుపోటుతో బాధపడేవాడు. తెల్ల రక్తకణాల సంఖ్య మైక్రోలీటర్‌కు 70 వేలకు పెరిగిపోయింది.
భారతీయ బయోకెమిస్ట్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు హార్వర్డ్‌లో చదివి అమెరికాలోనే పరిశోధనలు చేస్తున్నడు. ఫోలేట్, ఫోలేట్ ఆంటగోనిస్ట్లు, డై ఇథైల్ కార్బమాజిన్ సిట్రేట్, ఐఎన్హెచ్, క్లోర్ టెట్రాసైక్లిన్ వంటి ఔషధాలను కనుగొన్న శాస్త్రవేత్త సుబ్బారావు. సుబ్బారావు ఫోలిక్ యాసిడ్ మీద చేసిన పరిశోధనలు ఫార్బర్ను ఆకర్షించినయి. పిల్లల రక్తహీనతకు ఫోలిక్ యాసిడ్ వల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనాకు వచ్చిండు, ఇచ్చిండు. ఆశించిన ఫలితం లేకపోగా, వ్యాధి అధికం కాజొచ్చింది. ఫోలేట్‌తో లింఫోబ్లాస్ట్లు వృద్ధిచెందితే, ఆంటీ ఫోలేట్‌తో వాటి వృద్ధిని నిరోధించవచ్చనే పరికల్పనకు వచ్చిండు. సుబ్బారావు బృందం టెరో ప్టెరిన్/ అమైనోప్టెరిన్ అనే యాంటీ ఫోలేట్ అందజేసింది. డిసెంబర్ చివరలో ఆ ఔషధాన్ని సాం డ్లార్కు ఇచ్చిన్రు. తన పరికల్పన నిజమని నిరూపితమైంది. జనవరి చివరి కల్లా సాండ్లర్ తెల్లకణాల సంఖ్య 12 వేలకు తగ్గింది. ఫిబ్రవరిలో ఆ పిల్లవాడు తన కవల సోదరునితో ఆడుకోలిగాడు. అట్లా తొలి కీమోథెరపీ ఔషధంగా అమైనోప్టెరిన్ రూపకల్పన జరిగింది. అయినప్పటికీ రక్తపరీక్షలో క్యాన్సర్ లింఫోబ్లాస్టులు కనిపిస్తూనే ఉన్నయి. కాబట్టి అంతటితో ఆగలేదు సుబ్బారావు బృందం. దాన్ని మరింత మెరుగుపరచటానికి పరిశోధనలను ముమ్మరం చేసింది. హైడ్రోజెన్ అణువును మిథైల్ సమూహంతో విస్తాపం చెందించి, దానిని అమెతోప్టెరిన్గా అభివృద్ధి చేసింది.
దశాబ్దాల్లో క్యాన్సర్ కీమోథెరపీలో ప్రధాన ఔషధంగా మెతోట్రెక్సేట్ మారిపోయింది. నిశిత పరిశీలన ద్వారా దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిసి వచ్చినయి. 1972లో సోరియాసిస్ ఔషధంగా అనుమతి లభించింది.
తర్వాత దాని పేరు మెతోట్రెక్సేట్గా మార్చారు. మెతోట్రెక్సేట్తో సురక్షితంగా, సమర్థవంతంగా బ్లడ్ క్యాన్సర్‌లో తెల్లకణాల వృద్ధిని అరికట్టగలిగారు. తర్వాత దశాబ్దాల్లో క్యాన్సర్ కీమోథెరపీలో ప్రధాన ఔషధంగా మెతోట్రెక్సేట్ మారిపోయింది. నిశిత పరిశీలన ద్వారా దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిసి వచ్చినయి. 1972లో సోరియాసిస్ ఔషధంగా అనుమతి లభించింది. మెతోట్రెక్సేట్ను బోస్టన్‌లో బ్రిఘామ్ దవాఖానలోని డాక్టర్ మైకేల్ వీన్ బ్లాట్ కీళ్ల వాతానికి పనిచేసే ప్రధాన ఔషధాల జాబితాలో చేర్చిండు. వీన్ బ్లాస్ట్ 1980లలో తన పరిశోధన ఫలితాలను ప్రచురించిండు. కీళ్ల వాతానికి ఇప్పుడు ఇది కీలక ఔషధం. అతెరోస్లెరోటిక్ హార్ట్ వ్యాధి లో ప్రయోజనకర ఔషధంగా రుజువైంది.
డాక్టర్ సిడ్నీ ఫార్బర్ పిల్లల పాథాలజీ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడు. చాలామంది పిల్లలు ‘బ్లడ్ క్యాన్సర్’తో
రాలిపోవటం ఆయనను కలవరపెట్టింది. క్యాన్సర్ చికిత్సలో పురోగతి సాధించాలని ఆయన నిర్ణయించుకున్నాడు.
జీవ చర్యలను నియంత్రించే ఔషధం అయినందున ఇది పిండం మీద, గర్భస్థ శిశువు మీద ప్రమాదకర ప్రభావం చూపగలదని త్వరలోనే గుర్తించారు. అధునాతన ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, గర్భాశయానికి అవతల ఏర్పడిన పిండాన్ని (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) అంతం చేయటానికి మెతోట్రెక్సేట్ మీదనే ఆధారపడుతున్నరు. ఇంకా స్త్రీ వైద్యంలోని ముత్యాల గర్భం, టెరటోకార్సినోమా వంటి మరి కొన్నింటికి మెతోట్రెక్సేట్ సరైన ఔషధంగా నిలిచి ఉన్నది. బహుశా కనిపెట్టిన సుబ్బారావు, ప్రయోగించిన ఫార్బర్లు కూడా మెతోట్రెక్సేట్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఒనగూడుతాయని ఊహించి ఉండరు. ఇప్పుడు ‘మెతోట్రెక్సేట్’ వజ్రోత్సవం జరుపుకొంటున్నది.
డాక్టర్ రాపోలు సత్యనారాయణ: 94401 63211
(వ్యాసకర్త: ఇండియన్ ఫార్మాస్యూటికల్అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)