సర్కారీ వైద్యం మంచం పట్టింది. పట్టించుకునే నాథుడు లేక బిక్కుబిక్కుమంటున్నది. వైద్యశాలల్లో సరైన వసతులు, మందులు లేక మంచం పట్టింది. రాష్ట్రంలో సామాన్యులకు తక్షణ ఉపశమనం సమకూర్చాల్సిన ప్రజావైద్య రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నది. ఓ వైపు కేసీఆర్ హయాంలో కట్టిన టిమ్స్ వైద్యాలయాలకు రిబ్బన్ కటింగ్‌లు చేస్తూ ఊరేగుతున్న కాంగ్రెస్ సర్కార్ మరోవైపు అట్టడుగు స్థాయి వైద్య సౌకర్యాలపై పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) డాక్టర్ల కొరత 68 శాతం పైగా ఉన్నది. ప్రభుత్వం బడ్జెట్లో ఆరోగ్యరంగానికి భారీగా నిధులు కేటాయించినట్టు చూపుతున్నప్పటికీ అందులో 40 శాతం కూడా ఖర్చు చేయకపోవడం దారుణం. మిగిలిన 60 శాతం నిధులు ఎక్కడ నక్కాయో తెలియదు. సకాలంలో నిధులు విడుదల కానందువల్ల రోగులు కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు కూడా కరువయ్యాయి.
మరోవైపు మందుల కొరత దారుణంగా వేధిస్తున్నది. బడ్జెట్లో అంకెల మాయాజాలం, ఆచరణలో అసమర్థత వల్ల పల్లె వైద్యశాలలు ఎందుకూ కొరగాకుండాపోయి, సమస్యలకు నిలయాలుగా తయారయ్యాయి. మొదటి 100 రోజుల్లోనే వైద్యపోస్టులు భర్తీ చేస్తామని ఊదరగొట్టి గద్దె నెక్కిన కాంగ్రెస్ సర్కార్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పల్లె దవాఖానల్లో 3,200కు పైగా ఆరోగ్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. అసమర్థ పాలన, అక్రమ విధానాల వల్ల నియామక ప్రక్రియ కోర్టు కేసుల్లో చిక్కుకొంటుండటం గమనార్హం. ఎన్నికలకు ముందు ఉచిత వైద్యం, కార్పొరేట్ స్థాయి ఆరోగ్య కేంద్రాలు అంటూ ఊరించిన కాంగ్రెస్ అదనంగా సాధించిందేమీ లేకపోగా చివరికి అసలుకే ఎసరు తెచ్చింది. బాగుపరచడం మాటేమోగానీ ఉన్న సౌకర్యాలే లేకుండా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 687ఆరోగ్య కేంద్రాలు నిరుపేదల చికిత్సకు ఏకైక దిక్కుగా ఉన్నాయి. ఇప్పుడవి మందుల కొరతతో, మౌలిక వసతుల లేమితో కేవలం బోర్డులుగా మిగిలిపోయి వెక్కిరిస్తున్నాయి. సగానికిపైగా కేంద్రాల్లో సామాన్య ఆరోగ్య పరీక్షలు జరిపే వైద్యులు లేరు. వారానికోసారి చుట్టపుచూపుగా వచ్చే వైద్యులతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పీహెచ్‌సీల్లో అవసరమైన 86 రకాల మందుల్లో సగం కూడా అందుబాటులో లేవని తెలుస్తున్నది. మరోవైపు టెక్నీషియన్లు లేక, ఉన్నచోట యంత్రాలు పనిచేయక ఆరోగ్య పరీక్షలు అందుబాటులో లేకుండా పోయాయి.
ఇలా వైద్య కేంద్రాలు సమస్యలతో సతమతం అవుతుంటే సామాన్యులు వైద్య సేవల కోసం దూరాలకు పరుగులు తీయడమో, ప్రైవేట్‌కు డబ్బులు లేక చికిత్సకు దూరం కావడమో జరుగుతుండటం విచారకరం. సామాన్యులు కనీస వైద్యానికి నోచుకోక ప్రాణాల మీదికి తెచ్చుకునే పరిస్థితులు నెలకొనడానికి కారణం సర్కార్ నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ప్రాథమిక వైద్య కేంద్రాలను ప్రస్తుత దుస్థితి నుంచి బయటపడేసేందుకు అత్యవసర ప్రాతిపదికపై చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందులో అన్నిటికన్నా ముందు జరుగాల్సింది బడ్జెట్ బూటకాలను కట్టిపెట్టి పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడం. రెండోది, ఖాళీగా ఉన్న మెడికల్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నియమబద్ధంగా జీవోలు జారీ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవడం. వీటన్నిటికన్నా ముందుగా మందుల సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడం తక్షణావసరమని చెప్పక తప్పదు.