శ్రద్ధతోనే దానం చేయాలి. అని చెప్పటమే కాకుండా.. ‘శ్రియా దేయం’ తన సంపదకు తగ్గట్టు దానం చేయాలి.. అనీ ఉపదేశించింది తైత్తరీయ ఉపనిషత్తు శిక్షావల్లి. ఒక మహారాజు ప్రతిరోజూ పెద్ద ఎత్తున తోటకూర దానం చేసేవాడు. తోటకూర కట్ట చేతి కందించి, అంతకి ఇంతైతే ఇంతకి ఎంతౌతుంది.. అనే వాడు. ఎవరూ జవాబు చెప్పేవారు కాదు. ఏండ్లు గడిచిపోయాయి. అదృష్టం కొద్దీ ఒకరోజు ఒక మహాయోగి రాజ ప్రాసాదానికి వచ్చాడు. అతణ్నీ రాజు ఇదే ప్రశ్నించాడు.
వెంటనే ఆ యోగి ‘మహారాజా! అంతకు ఇంతైతే, ఇంతకు ఇంతే!’ అన్నాడు దివ్యదృష్టితో చూసి. రాజు తెల్లబోయాడు. ‘అదేమిటి?’ అన్నాడు గద్దించి. యోగి మాట్లాడుతూ ‘మహారాజా! నీవు గత జన్మలో బీద బ్రాహ్మణుడివి. ఇంట్లో పెరట్లో తోటకూర నాటి అడిగిన వాడికేదో దానం చేసేవాడివి. ఆ పుణ్యంతో మహారాజువు అయ్యావు. అదృష్టవశాత్తు పూర్వజ్ఞానం వచ్చేసింది. ఆ జన్మలో దానం చేస్తే ఈ జన్మలో రాజయ్యాను, ఈ జన్మలో చేస్తే ఇంకా మంచి జన్మ లభిస్తుందనుకున్నావు..’ కదా అన్నాడు.
‘నిజమే కదా!’ అన్నాడు రాజు. అప్పుడు యోగి ‘మహారాజా! అప్పుడది నీ స్థాయికి తగిన దానం. ఏదో గొప్ప జన్మ కావాలనీ చేయలేదు. తోటి వారికి సాయపడాలని భావించావు! నిష్కామ కర్మ అయింది. మరి ఇప్పుడో! నీవు మహారాజువి. నీ స్థాయికి తోటకూరేం కర్మ? రత్నరాశులైనా దానం చేయవచ్చు. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు. వారిని కన్నబిడ్డల్లాగా చూసుకోవచ్చు. నీకు ఆ ధ్యాసే లేదు. ఇంకా మంచి స్థాయి ఎలా వస్తుంది? అందుచేత అలా అన్నాను’ అన్నాడు. రాజు తలవంచుకొని తరుణోపాయం చెప్పమన్నాడు. ‘రాజా! అన్నార్తులకు, బాటసారులకు అన్నదానం చెయ్. విద్యా దానం చెయ్. రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించు’ అన్నాడు జ్ఞాని. శక్తివంచన లేకుండా దానం చేయాలని తెలుసుకున్న రాజు తన స్థాయికి తగ్గ దానాలు చేస్తూ ధన్యుడయ్యాడు.