శ్రీరాముడు సద్గుణాల గని. ధర్మానికి నిలువెత్తు రూపం. ఇచ్చిన మాటకు కట్టుబడినవాడు. శత్రువులనైనా క్షమించగల ఔదార్యం ఉన్నవాడు. సుఖదుఃఖాలను సమంగా స్వీకరించిన స్థితప్రజ్ఞుడు. పట్టాభిషేకం అంటే మురిసిపోలేదు. అడవులకు వెళ్లవలసి వచ్చినా కుంగిపోలేదు. ‘సామాన్య మానవుడు జీవితంలో ఎలా ప్రవర్తించాలి? ఎలా ఎదగాలి?’ అని చూపించాడు రాఘవుడు. శ్రీరామనవమి సందర్భంగా.. ఆ ‘మర్యాద పురుషోత్తముడి’ ఆదర్శ జీవనమార్గంపై ప్రత్యేక కథనం.
శ్రీరాముణ్ని తలవని తెలుగు లోగిళ్లు కనిపించవు. వాళ్లకు ఆయన కనిపించని దైవం కాదు. కంటికి రెప్పలా కాచుకునే ఇంటి పెద్ద. అండదండగా నిలిచే కుటుంబ భాగస్వామి. ఓ కన్నబిడ్డ, ఓ సోదరుడు, ఓ భర్త, ఓ తండ్రి. ‘మన బంధువు.. మన నెయ్యం.. మన సారథి.. మన గురుడు.. మన విభుడు’ అని శ్రీకృష్ణుడి గురించి అర్జునుడు పేర్కొన్న చందంగా మన జీవితాల్లో రాముడు అంతగా పెనవేసుకుపోయాడు.
ఏ చిన్నపాటి కష్టం వచ్చినా ‘రామచంద్రా’ అని తలుచుకుంటాం. ఆశ్చర్యం గొలిపే సంగతులు చెవిన పడినప్పుడు ‘అయ్యో రామా!’ అని.., వినకూడని మాటలకు ‘రామ రామ” అని తెలియకుండానే అనేస్తాం. పిల్లలకు లాలపోసే అమ్మమ్మలు, నాయనమ్మలు ‘శ్రీరామ రక్ష’ అని దిష్టి తీస్తారు. శ్రీరాముడిలా వాళ్లకు సుగుణాలు అలవడాలని, ఆయురారోగ్యాలతో కళకళలాడాలని కోరుకుంటారు.
ఇప్పటికీ ఏదైనా శుభకార్యానికి సంబంధించి కాగితం మీద ఏం రాసినా తొలుత ‘శ్రీరామ’ అని రాయటం మన సంప్రదాయంగా మారిపోయింది. ‘శ్రీరామరక్ష సర్వజగద్రక్ష’ అన్న తోరణాలతో ఇంటి గడపలు స్వాగతం పలుకుతుంటాయి. వివాహం అయిన నూతన వధూవరులను ‘సీతారాముల్లా వర్ధిల్లండి’ అని దీవించే ఆనవాయితీ కొనసాగుతున్నది. ఆదర్శ జీవనానికి శ్రీరాముడు స్ఫూర్తి అయితే సత్పరిపాలనకు రామరాజ్యం దిక్సూచి. సామాజిక ఐక్యతకి ‘జై శ్రీరామ్’ నినాదం ఒక ఆలంబన. ‘రాముడు లేని వాడ లేదు. రామాలయం లేని ఊరు లేదు’ అన్న నానుడి తెలుగు రాష్ర్టాలలో ప్రబలంగా ఉంది. రామనామం, రామబాణం, రామపాదం, ఆఖరికి రాముని మాట దేనికవే గొప్పవిగా ప్రాచుర్యం పొందాయి.

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ॥
లోక సంచారి నారద మహాముని ఓ సందర్భంలో వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు. ఈ సందర్భంగా వాల్మీకి, ‘ఈ లోకంలో గుణవంతుడు యుద్ధంలో శత్రువుని ధైర్యంగా ఎదుర్కోగలిగిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరవని వాడు, ఎల్లప్పుడు సత్యాన్ని పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు. ఎవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించాడు.
దానికి సమాధానంగా నారద ముని.. ‘మహర్షీ.. ఇన్ని సుగుణాలు ఉండటం చక్రవర్తులకే అసంభవమైన విషయం. ఇక మామూలు మనుషులకు ఇది సాధ్యమయ్యే పనేనా? కాకపోతే అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు.. ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంశ ’ అంటూ పై శ్లోకం చెప్పారు.
“ఇక్ష్వాకు వంశంలోపుట్టిన రాముడు అపార సంకల్పశక్తి ఉన్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసిన వాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువులను జయించినవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు..’ అంటూ రాముడి శక్తి సామర్థ్యాలను వివరించాడు. సంక్షిప్త రామాయణంతో వాల్మీకి హృదయాన్ని నింపేశాడు
నరుడి కథ రామాయణం.. ‘రామస్య అయనం రామాయణం. రాముని కదలికకు అంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది? అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం. ఆయన కదలికలన్నీ సత్యధర్మాలే. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నారు. దశావతారాల్లో ఏడోది రామావతారం. విభిన్నమైనది, విశిష్ఠమైనది. రామావతారంలో స్వామి పరిపూర్ణ మానవుడే. ధర్మబద్ధమైన జీవనానికి నిలువెత్తు నిదర్శనంగా మసిలాడు. రావణ సంహారం కోసం అవతరించి విలువలను చాటాడు.

“శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై ఉన్నది. శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై ఉన్నది”అని నమ్మిన భక్త శిఖామణి రామదాసు.“హరి హరి రామ నన్నరమర జూడకు.. నిరతము నీ నామ స్మరణ యేమరను”అని ఆత్మ నివేదన చేసుకున్నాడు. గోల్కొండ కారాగారంలో మగ్గుతూ.“ఎందుకు దయరాదు శ్రీరామ.. నేనేమి చేసితి శ్రీరామ.. గతి నీవెయనుకొంటి శ్రీరామ.. నా వెత మాన్పవయ్య శ్రీరామ..” అని ఆర్తితో ప్రార్థించాడు. కష్టాలకు తాళలేని పరిస్థితిలో “ఎవడబ్బా సొమ్మని కులుకుచూ తిరిగేవు రామచంద్రా” అని నిందాస్తుతి చేశాడు.
‘దాశరథీ కరుణాపయోనిధి’ మకుటంతో రామదాసు రచించిన ‘దాశరథీ శతకం’ భక్తి కావ్యాలలో అగ్రగామిగా నిలిచింది. మరో వాగ్గేయకారుడు త్యాగయ్య శ్రీరాముడిపై 600కి పైగా కృతులను రచిస్తే.. శ్రీవెంకటేశ్వరుని భక్తుడైన అన్నమయ్య శ్రీరాముణ్ని స్తుతిస్తూ అనేక సంకీర్తనలు రచించారు. భక్త కబీర్ దాస్ అచంచల రామభక్తిని ప్రదర్శించారు. ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి కూడా ఎన్నో కృతులను రామయ్యకు సమర్పించుకున్నారు.
రామకథను విన్న వాల్మీకి ఆ మరుసటి రోజునే తన శిష్యులతో కలిసి తమసా నదీ తీరాన సంచరిస్తున్నాడు. ఆ సమయంలో ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొట్టాడు. అది విలవిల్లాడుతూ మరణించింది. దాంతో ముని హృదయం ద్రవించింది. ఆయన నోట ‘మానిషాద ప్రతిష్ఠాం.. త్వమగు శాశ్వతీసమాః, యత్ క్రౌంచ మిథునాదేకమ్, అవధీ కామమోహితమ్..” అన్న శ్లోకం ఆశువుగా వచ్చింది. ఛందోబద్ధంగా ఉన్న ఆ శ్లోకం గొప్పతనాన్ని బ్రహ్మ ఆయనకు వివరించాడు. శ్రీరామచరిత్రను కావ్యరూపంగా రచించమని ప్రేరేపించాడు. ఈ లోకంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలం రామాయణ మహాకావ్యం ప్రకాశిస్తుందని దీవించాడు. అందుకే వాల్మీకి రామాయణానికి అంతటి ప్రశస్తి. ఆ కావ్య ఘనతను ఇలా ప్రస్తుతిస్తారు.
రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం ప్రోక్తమ్ పుంసాం మహాపాతకనాశనమ్ ॥
శ్రీరాముడి జీవితం అత్యున్నత ధర్మనిరతిని, సత్యసంధతను సూచిస్తుంది. పితృవాక్య పరిపాలనకు కట్టుబడిన ఆదర్శమూర్తిగా ఆయన నిలుస్తాడు. కైకేయికి తండ్రి దశరథుడు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం 14 ఏళ్లు వనవాసానికి వెళ్లాడు. ఆ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించలేదు. తండ్రి మాటను జవదాటకుండా అడవి బాట పట్టాడు. తెల్లవారితే రాజ్యాభిషేకం జరగవలసిన తరుణంలో ఎలాంటి ఆశాపాశాల్లేకుండా రాజ్యభోగాలను తృణ ప్రాయంగా త్యజించాడు. ‘తండ్రి మాటను నెరవేర్చటం కుమారుని ధర్మం’ అని నమ్మాడు. ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించాడు. రాముడి ధర్మనిష్ఠకు, తండ్రిపై ఉన్న భక్తికి ఇది నిదర్శనం. భారతీయ సంస్కృతిలో కుటుంబ విలువలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఇది చెప్పకనే చెబుతుంది.

బుధకౌశిక మునికి స్వప్నంలో పరమేశ్వరుడు ‘రామరక్ష స్తోత్రా’న్ని ఉపదేశించాడట. దానిని ఆయన ఈ జగత్తుకు అందించాడు. ఇది శ్రీరాముడి ఘనచరిత్రను శ్లాఘిస్తుంది. ఈ స్తోత్రాన్ని పఠించేవారు దీర్ఘాయుష్మంతులు, సుఖవంతులు, పుత్రవంతులు, విజయవంతులు, వినయవంతులు అవుతారని ప్రతీతి. దీనిని నిత్యం పారాయణం చేస్తే అంతరంగంలో అలజడులు నశించి, కల్యాణ భావనలు మేల్కొంటాయి. మానసిక భయాందోళనలు తొలగించే అమృత సంజీవని ఇది అనేది ఎందరో భక్తుల అనుభవం.
శ్రీరాముడు కంటే శ్రీరామనామం చాలా గొప్పదని ప్రతీతి. ‘రమయతి ఇతి రామః’.. రామ అన్న మాటతోనే హృదయం రమిస్తుంది. నోరు తెరిచి మనం ‘రామ’ అన్నప్పుడు.. ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలు బయటికి వెళ్లి దహించుకపోతాయట. ‘మ’ అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయట ఉన్న పాపాలు లోపలికి రాకుండా ఉంటాయని చెబుతారు. అలాగే ‘రా’ అక్షరం భక్తులను సంసార సాగరం నుంచి రక్షిస్తే, ‘మ’ భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తుందని పెద్దల వివరణ.
‘రామ.. రామ’ అన్న నామం ఉచ్ఛరిస్తే సంసార వ్యామోహాలు దగ్ధం అవుతాయి. సుఖసంపదలు కలుగుతాయి. యమదూతలను కూడా అది పారదోలుతుందని విశ్వాసం. ‘శ్రీరామ రామ రామ’ అని మూడు సార్లు జపిస్తే, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితం కలుగుతుందని పరమశివుడు పార్వతీదేవికి తెలిపినట్టు పురాణ కథనం. ‘శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే … సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అన్న శ్లోకం జనం నాలుకపైన తరతరాలుగా నర్తిస్తూనే ఉన్నది.
ప్రాచీన భారతీయంలో గణితంలో కటపయాది సూత్రం అని ఒకటి ఉంది. సంస్కృత వర్ణమాలలో హల్లులను వర్గాల వారీగా విభజించి వాటికి సంఖ్యలను కేటాయిస్తారు. ‘అ’ అలాగే ఇతర అచ్చులు సున్నా విలువను కలిగి ఉంటాయి. వాటి ప్రకారం ఒకసారి రామ అంటే 10, మూడుసార్లు అంటే వెయ్యికి సమానం అని తెలియజేశారు. అందుకే భక్తులు రామనామాన్ని జపిస్తారు. రామకోటిని లిఖిస్తారు. రామచంద్రుణ్ని స్తోత్రపాఠాలతో కీర్తిస్తారు.
శ్రీరామచంద్రుడి సుందర మనోహర రూపాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. ‘ధనుర్భాణాలు ధరించినవాడు, పద్మాసనంలో విరాజిల్లేవాడు, పీతాంబర ధారి, అప్పుడే వికసించిన తామర పూరేకులతో పోటీపడుతూ, ఎడమ పక్కన ప్రకాశిస్తున్న సీతాదేవి ముఖ కవళికలో మిళితములై ప్రసన్నములైన నేత్రాలు కలవాడు, ఆజానుబాహువు, మేఘశ్యాముడు, అనేక విధాల దివ్యాభరణాలతో శోభిల్లువాడు, విశాలమైన జటాజూటం కలవాడు’.. అని దాశరథిని రామరక్షా స్తోత్రం వర్ణిస్తుంది. ‘నల్లకలువల బోలిన దేహకాంతి కలవాడు, కమల నయనుడు, జటాజూటం అనే కిరీటంతో శోభించేవాడు, చేతులలో ఖడ్గం,అమ్ములపొది, ధనుర్బాణాలు కలవాడు, రాక్షస సంహారకుడు, ప్రపంచ రక్షణకు లీలగా అవతరించినవాడు, జన్మ రహితుడు, సర్వవ్యాపకుడు, సీతాలక్ష్మణ సమేతుడు’ అని రామ వైభవాన్ని చాటుతూ ఆ స్తోత్రం సాగుతుంది.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే,
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
‘రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, బ్రహ్మ స్వరూపుడు, రఘునాథుడు ప్రభువగు సీతాపతికి నమస్కారం. శ్రీరామ.. రఘునందన.. భరతాగ్రజ.. రణధీర.. రామ.. నీవు నాకు ఆశ్రయమై నిలువు’ అని భక్తులు కోరుతారు. రామనామం ఎంత శక్తిమంతమైనదో రామబాణం కూడా అంతే అమోఘమైనది. అది అజేయమైనది. రామబాణం ప్రయోగిస్తే అది లక్ష్యాన్ని తప్పకుండా ఛేదిస్తుంది. అంతేకాదు అది ఆయుధం మాత్రమే కాదు, ‘ధర్మాత్మా సత్య సంధశ్చ’ అంటే ధర్మాన్ని నిలబెట్టే శక్తి దానికి ఉంది అని చెబుతారు.
శ్రీరాముణ్ని వనవాసం నుంచి తిరిగి రమ్మని భరతుడు కోరితే అందుకు ఆయన నిరాకరించాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి 14 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. భగవంతుడి కంటే ఆయన పాదుకలే గొప్పవని ఈ విషయం చాటి చెబుతుంది. రాయిగా మారిన అహల్య రాముడి పాద స్పర్శతో తిరిగి స్త్రీ రూపం పొందింది. భగవంతుని పాద రజస్సు ఎంతటి కఠినమైన పాపాలనైనా తుడిచేస్తుందనే సత్యాన్ని ఇది చాటుతుంది. శ్రీరాముడి పాదాలను ఆశ్రయించటం అంటే సంసార సాగరాన్ని దాటడమే. హనుమంతుడు, విభీషుణుడు వంటి గొప్ప భక్తులు దీనిని నిరూపించారు. హిందూ ధర్మశాస్ర్తాల పరంగా భగవంతుడి పాదాల వద్ద గంగానది ఉద్భవించినట్టు భావిస్తారు. రామ పాదాలను స్మరించటం లేదా పూజించటం వల్ల సకల పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.
శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే
‘శ్రీరామచంద్రుని పాదాలను మనసుతో స్మరిస్తున్నాను. ఆయన చరణాలను వాక్కుతో కీర్తిస్తున్నాను. తలవంచి నమస్కరిస్తున్నాను. చరణాలను శరణుజొచ్చుతున్నాను’ అని ఈ శ్లోకానికి తాత్పర్యం.

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రాముణ్ని మించిన వ్యక్తి మరొకరు కనిపించరు. పితృవాక్య పరిపాలన కోసం 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడు. దండకారణ్యంలో ఉన్నప్పుడు రాక్షస పీడ నుంచి రక్షించమని మునులు కోరగా రాముడు వారికి అభయం ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవటానికి ఎంతకైనా వెరవనని వారికి స్పష్టం చేశాడు.
అపి అహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స లక్ష్మణామ్
న తు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః॥
“ఓ సీతా! అవసరమైతే నా ప్రాణాలను, నిన్ను, చివరికి లక్ష్మణుడినైనా వదులుకుంటాను కానీ, ఇచ్చిన మాట తప్పను’ అని చెప్పాడు రాముడు. వాలి భయంతో రుష్యమూక పర్వతంపై తలదాచుకున్న సుగ్రీవునికి సాయం చేస్తానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాముడు. ‘బలవంతుడైన వాలిని చంపి, నిన్ను కిష్కింధకు రాజును చేస్తాను. సకల రాజభోగాలను అప్పగిస్తాను. భార్య రూపను నీ చెంత చేరుస్తాను’ అని వాగ్దానం చేసి ఆ మాట నిలబెట్టుకున్నాడు.
వనవాసానానికి వెళ్లిన రాముడిని అయోధ్యకు తిరిగి రావలసిందిగా భరతుడు కోరాడు. ఈ సందర్భంగా అతనికి ధర్మాచరణ, రాజ్య పాలనకు సంబంధించి హితోపదేశం చేస్తాడు రాముడు. తండ్రికి ఇచ్చిన మాట తప్పనంటాడు. 14 ఏళ్ల వనవాసం చేయడం తన ధర్మమంటాడు. వనవాసం ముగియగానే తాను కచ్చితంగా అయోధ్యకు తిరిగి వస్తానని, అప్పటి వరకూ రాజ్యపాలన చేసి ప్రజలను రక్షించాలని భరతుణ్ని ఆదేశిస్తాడు. పాలనలో రహస్యాలను కాపాడాలని, సమర్థులైన మంత్రులను నియమించుకోవాలని, వెయ్యి మూర్ఖుల కంటే ఒక జ్ఞాని సలహా పాటించాలని పాలనా ధర్మాలను తమ్ముడికి బోధిస్తాడు.
ఈ సందర్భానికి ముందు పరివార సమేతంగా వస్తున్న భరతుణ్ని చూసి లక్ష్మణుడు అనుమానిస్తాడు. భరతుడు తమపై యుద్ధానికి వస్తున్నాడని రాముడితో చెబుతాడు. లక్ష్మణుడి మాటలను కొట్టి పారేస్తాడు రాముడు. భరతుణ్ని నిందిస్తే తనను దూషణ చేసినట్టే అంటాడు. భరతుడి వంటి సహోదరుడు మరొకడు దొరకడు అంటాడు. రాముడి సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఈ మాట. ఇక్ష్వాకు వంశీకులు అంత హీనంగా ప్రవర్తించరనే మాట కూడా స్పష్టంగా చెబుతాడు.
రావణుని సోదరుడైన విభీషణుడు శరణు కోరినప్పుడు.. అతనికి రక్షణ కల్పిస్తానని శ్రీరాముడు మాట ఇస్తాడు. “శరణు కోరిన వారు శత్రువులైనా వారిని రక్షించటం నా ధర్మం” అని ప్రకటిస్తాడు. రావణ సంహారానికి ముందే విభీషణుడిని లంకా నగరానికి రాజుగా ప్రకటిస్తూ మాట ఇస్తాడు. రావణ వధ అనంతరం విభీషణుడికి పట్టాభిషేకం చేయాలని లక్ష్మణుడిని ఆదేశిస్తాడు. అలాగే విభీషణుని భక్తికి మెచ్చి రాముడు తన కులదైవమైన రంగనాథుని విగ్రహాన్ని అతనికి బహుమతిగా ఇస్తాడు. చిరంజీవిగా ఉండి ప్రజలను ధర్మమార్గంలో నడిపించమని వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయంలో విభీషణుడికి చెబుతాడు.
త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో జన్మించాడు. ఇన్ని తిథులు ఉండగా, రాముడు నవమి నాడే ఎందుకు జన్మించారు అని ఎవరికో సందేహం కలిగింది. 9 సంఖ్య పరమాత్మను సూచిస్తుంది. ఈ సంఖ్యను ఏ అంకెతో హెచ్చించినా మళ్లీ తొమ్మిదే వస్తుంది. ఎన్ని రూపాలలో ఉన్నా, ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎన్ని పేర్లు పెట్టినా, అసలు తత్వం ఒక్కటే అన్న రహస్యాన్ని ప్రపంచానికి వెల్లడించటానికే స్వామి ఆ రోజున జన్మించాడని చెబుతారు.
అలాగే అప్పటి కాలానికి విరుద్ధంగా శ్రీరాముడు జీవితాంతం ఏకపత్నీ వ్రతుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. సీతను కేవలం భార్యగానే కాకుండా కష్టసుఖాలలో పాలుపంచుకునే అర్ధాంగిగా గౌరవించాడు. ఆదర్శవంతమైన దాంపత్యానికి సీతారాములు మారుపేరుగా నిలిచారు. సీతారామకల్యాణం లోకజీవన హేతుకం. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున భక్తిశ్రద్ధలతో రామ కల్యాణం నిర్వహిస్తారు. తమ ఇంట్లో పెళ్లంత ఉత్సాహంగా దేవుడి పెళ్లిలో చిన్నాపెద్దా భాగమవుతారు.
నరుడిగా చరించి.. పితృభక్తి, సోదర ప్రేమ, ఏకపత్నీ వ్రతం, కర్తవ్యనిష్ఠ లాంటి సద్గుణాలను ఆచరించి చూపిన ధర్మమూర్తి శ్రీరాముడు. మానవ జాతి నిలిచి ఉన్నంత వరకూ ఆయన చరిత్ర అజరామరంగా మిగిలిపోతుంది. మానవాళికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
వివిధ భాషలు, సంస్కృతులలో దాదాపు 300కి పైగా రామాయణాలు ఉన్నాయి. అత్యంత ప్రాచీనమైనదిగా వాల్మీకి రామాయణాన్ని పరిగణిస్తారు. ఇది 24 వేల శ్లోకాలతో, ఏడు కాండలుగా విభజించి ఉంది. ఇందులోని ప్రత్యేకతలు దీనిని శాశ్వత ఇతిహాసంగా, ఆదర్శవంతమైన కావ్యంగా నిలిపాయి. వాల్మీకి ఆదికవిగా నిలిచాడు.
1 హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, అయ్యలార్యుడు, కుమార రుద్రుడు రచించిన తెలుగు కావ్యం భాస్కర రామాయణం, తిక్కన సోమయాజి రచించిన నిర్వచనోత్తర రామాయణం, నన్నయ భట్టారకుడు రచించిన రాఘవాభ్యుదయం ఇవన్నీ కావ్య గౌరవాన్ని సంతరించుకున్నాయి. గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అత్యంత ప్రజాదరణ పొందింది. కవయిత్రి మొల్ల రచించిన సరళమైన తెలుగు కావ్యం మొల్ల రామాయణం ఆమె భక్తికి తార్కాణంగా నిలుస్తుంది.
2 తులసీదాస్ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అవధి భాషలో శ్రీ సీతారామ కథను ‘రామచరిత మానస్’ పేరిట రాశాడు. సరయూ నది తీరంలో తాను రాసిన రామాయణాన్ని గానం చేస్తూండగా ఆంజనేయుడు ముందు వరుసలో కూర్చుని స్వయంగా విన్నాడని ప్రతీతి. ఈ ప్రేమానురాగాలకు ముగ్ధుడై తులసీదాసు హనుమాన్ చాలీసా రచించాడని చెబుతారు.
3 ఆధ్యాత్మ రామాయణం, అద్భుత రామాయణం, యోగవాశిష్ఠ రామాయణం తదితరాలు సంస్కృతంలోవెలువడిన గ్రంథాలు.
4 తమిళంలో కంబ రామాయణం, బెంగాల్లో కృత్తివాస్ రామాయణం బాగా ప్రాచుర్యం పొందాయి.
5 థాయ్లాండ్, మలేషియా, జపాన్ దేశాలలో వేర్వేరు రూపాల్లో రామకథ ప్రాచుర్యంలో ఉంది. పాత్రల వ్యక్తిత్వాలు, బాంధవ్యాలు కూడా భిన్నంగా ఉంటాయి.
– డాక్టర్ పార్థసారథి చిరువోలు