ఇంట్లో రెండు శివ లింగాలు ఉండకూడదని శాస్త్ర వచనం. శివలింగం, సాలగ్రామం, చక్ర చిహ్నంతో ఉండే ద్వారకా శిల, సూర్యకాంతమణి వీటిని రెండు ఉంచి పూజించరాదు. ఈ జగత్తు అంతటినీ తనలో ఇముడ్చుకుని సకల శుభాలనూ ప్రసాదించే పరమేశ్వరుడి ప్రతిరూపమే శివలింగం. శివారాధన వల్ల పుణ్యమూ, పురుషార్థమూ రెండూ అబ్బుతాయి. ఒకే శివలింగం ఉంచి అభిషేకాదులు చేయాలని ఆగమం చెబుతున్నది.
ఒకవేళ ఇంట్లో రెండు శివలింగాలు ఉన్నట్లయితే, ప్రధాన లింగాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రెండోదానిని ఇంటి వెలుపల ఉండే తులసికోటలో ఉత్తరాభిముఖంగా పానపట్టాన్ని ఉంచి పూజించవచ్చు. ‘అభిషేక ప్రియః శివః’ అన్నారు. శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి. ప్రతిరోజూ శక్తికొద్దీ అర్చన నిర్వహించాలి. నియమనిష్ఠలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి.