e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home చింతన అంగారకుడు భూమి పుత్రుడు

అంగారకుడు భూమి పుత్రుడు


అంగారకుడు భూమి పుత్రుడు


పాశ్చాత్యులు కుజగ్రహాన్ని ‘మార్స్‌’ (రెడ్‌ ప్లానెట్‌) అని పిలుస్తారు. ఎర్రగా కనిపిస్తాడు కనుక వారలా అంటారు. ‘మార్స్‌’ యుద్ధాలకు అధిదేవత. ‘మార్స్‌’ అనుకూలంగా ఉన్న సైన్యం యుద్ధంలో గెలుస్తుందని వారి నమ్మకం. వారి క్యాలెండర్‌లో మూడవ నెలను ‘మార్స్‌’కు కేటాయించారు. ‘మార్స్‌’ కాస్తా వాడుకలో ‘మార్చ్‌’ అయింది.

‘మార్స్‌’ని మనం ‘అంగారకుడు’ అంటాం. ‘అంగారము’ అంటే నిప్పు. నిప్పు కణికవలె ప్రకాశిస్తాడు కనుక అంగారకుడు. అంగారకుడు రక్తప్రియుడు. అస్త్రశస్ర్తాలను మంగళవారం నాడు ధరించడం మంచిదికాదు. ఈ కారణంగానే మంగళ్లు తమ వృత్తికి ఆ రోజున సెలవును ప్రకటిస్తారు. గడ్డం చేసేప్పుడు కత్తి తెగుతుంది. ఇది రూఢియైన సత్యం. అత్యవసరం కాని శస్త్రచికిత్సలను మంగళవారం చేయడానికి వైద్యులు కూడ ఇష్టపడరు.

ఈ దేశంలో తొలితరం శస్త్రచికిత్సకులు మంగలులే. క్షురకర్మ కల్యాణకరం. దేహారోగ్యానికి మంచిది. కల్యాణాలలో వాయించే సంగీత వాయిద్యాలను మంగళ వాయిద్యాలంటారు. మంగళకరమైన ఈ వృత్తిని నిర్వహించేవారు మంగళ్లు. అంగారకుడు మంగళకరుడు. వ్యాపారాది భౌతిక వ్యవహారాలకు మిక్కిలి అనుకూలుడు. మనకు పెండ్లిండ్లు వ్యాపారం కాదు. జీవితకాలపు అనుబంధం. అందుకే, మంగళవారం పెండ్లిండ్లకు నిషేధం. వారానికి ఏడు రోజులు. ఏడు రోజులకు ఏడు గ్రహాలు ఆధిపత్యాన్ని వహిస్తవి. తొలిస్థానం మనకు జీవనదాత అయిన సూర్యునికిచ్చారు. ఆయనది ఆదివారం. రెండవ స్థానం మనకు ఓషధులను ప్రసాదించే చంద్రునికిచ్చారు. అది సోమవారం. భూమికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహమనీ, ‘భూమికి కుమారుడని కూడ’ ఆలోచించి వారంలోని మూడవ రోజును మంగళకరుడైన కుజునికి ఇచ్చారు.

‘కు’ అంటే భూమి. ‘జ’ అంటే పుట్టినవాడు. భూమిపుత్రుడు అంగారకుడు. ‘కాయతి ధ్వనతీతి కుః’ అంటుంది ‘అమరకోశం’. ‘కుః’ అంటే శబ్దాన్ని మ్రోయునది అని అర్థం. భూమి శబ్దాన్ని మోస్తున్నదట. ఎటువంటి శబ్దాన్ని? అంతరిక్షంలో అత్యంత వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూండటం వల్ల ఉత్పన్నమయ్యే శబ్దాన్ని మోస్తున్నది. కుజుణ్ణి ‘భౌమ్యుడు’ అనికూడా పిలుస్తారు. ‘భౌమ్యుడు’ అంటే ‘భూమి కుమారుడు’ అని అర్థం. ప్రతి నెలా ‘బహుళ చతుర్థి’ని ‘సంకష్ట హర చతుర్థి’గా భావించి వినాయకుడిని పూజిస్తారు. వినాయకుడు కష్టాలను పోగొడ్తాడని ఒక నమ్మకం. ‘సంకష్ట హర చతుర్థి’ మంగళవారం వస్తే దానిని ‘అంగారక చతుర్థి’ అంటారు. భూమికి ఒక కణితి ఏర్పడింది. దానివల్ల భూమి మిక్కిలిగా బాధ పడ్తూండింది. ఆ కణితి రాక్షస రూపాన్ని ధరించింది. భూమి బాధ భరింపరానిదైంది. భూమి బాధను చూసిన వినాయకునికి భూమిపట్ల జాలి కలిగింది. అంగారము వలె భూమిని వేధిస్తున్న ఆ రాక్షసుణ్ణి ఒక్క తాపు తన్నాడు. అంగారకుడు భూమిని విడిచిపెట్టి దూరంగా వెళ్లి పడ్డాడు. అక్కడే తన జీవనాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. భూమి బాధను వినాయకుడు నివారించిన దినాన్ని ‘అంగార చతుర్థి’గా భావించి పండుగ చేసుకొంటున్నారు. ‘అంగారకుడు భూమి కుమారుడని’ నిరూపించినవాడు వినాయకుడని మనం ఈ ఐతిహ్యాన్ని అర్థం చేసుకోవాలి.

‘భూమన్‌’ అన్న సంస్కృత శబ్దానికి ‘భారీ పరిమాణం’ అని అర్థం. కుజగ్రహం విడిపోక ముందు భూమి గురుగ్రహానికన్న పెద్దది. కుజుడు విడిపోయాక గురుగ్రహమే పెద్దగ్రహంగా పేరు పొందింది. బృహస్పతి లేదా గురు శబ్దం పెద్దనైన అనే అర్థంలోనే వాడబడుతున్నది. నవగ్రహ స్తోత్రంలో కుజునికి సంబంధించిన శ్లోకమిలా వున్నది.
ధరణీగర్భ సంభూతం
విద్యుత్‌ కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం
తం మంగళం ప్రణమామ్యహమ్‌.

శ్లోకంలోని మొదటి పాదానికి కుజుడు భూమి పుత్రుడని మాత్రమేకాక ధరణీగర్భం వంటి గర్భం కలిగినవాడని కూడ అర్థం చెప్పుకోవచ్చు. భూమిపైన మట్టికి అంగారకునిపైన మట్టికి పెద్దగా భేదం లేదని ‘నాసా’వారు ధృవీకరించారు కదా! సౌర కుటుంబంలో జీవజాలం మనుగడకు అవకాశముండే స్థానంలో భూమి మాత్రమే ఉన్నది. కుజునికి సూర్యునికి ఉండే దూరం ఎక్కువగా ఉన్నందున అక్కడ భూమికి వలె జీవజాలం మనగలిగే వాతావరణం లేదు. శక్త్యాయుధాన్ని ధరించిన కుమారస్వామిని మంగళునికి ప్రతీకగా చెప్తారు. అంగారకుడి నుండి భూమి విద్యుదయస్కాంత శక్తిని గ్రహిస్తున్నదని అర్థం. అంగారకుడు విద్యుత్కాంతితో సమంగా ప్రకాశిస్తున్నాడట. ఆకాశంలోని మెరపును కూడ మనం విద్యుత్తు అనే పిలుస్తాం. ‘మైకేల్‌ ఫారడే డైనమో కనుగొన్న నాటినుండే మనకు విద్యుత్తు గురించి తెలుసును’ అన్న భ్రమనుండి మనం ఎంత త్వరగా బయట పడగలిగితే మనకంత మంచిది.

వరిగొండ
కాంతారావు
94418 86824

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అంగారకుడు భూమి పుత్రుడు

ట్రెండింగ్‌

Advertisement