విజయ సంకల్పం దసరా సంకేతం..
శత్రువులపై విజయం సాధించేందుకు శక్తి అనుగ్రహం కావాలి. ఆ శక్తే అపరాజిత. రాక్షససంహారం చేసి జగాన్ని కాపాడిన జగన్మాత మహాత్మ్యానికి సంకేతం విజయదశమి. ఈ పండుగ వేళ అమ్మవారిని అపరాజితగా అర్చిస్తారు. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం. అమ్మవారి సహస్రనామాల్లో ఒకటైన ఈ అపరాజితాదేవి విజయానికి అధిదేవత. ‘సర్వకామార్థ సాధనం అపరాజిత పూజనం’ అని పురాణోక్తి.
- మంగళవారం విజయదశమి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ దసరా. విజయదశమి కేవలం పదిరోజుల పండుగే కాదు.. తరతరాలుగా మనిషి తన ఆశలకు, ఆకాంక్షలకు, విజయస్వప్నాలకు దర్పణం పట్టిన ఓ అందమైన సంస్కృతి. విజయదశమి వేళ చేతిలోకి వచ్చే జమ్మి ఆకు బంగారమవుతుంది.. ఆకాశంలో కనిపించే పాలపిట్ట శుభసూచకమవుతుంది.. అపరాజితాదేవి ఆరాధన విజయానికి సంకల్పమవుతుంది. తద్వారా ఈ పండుగ పరిపూర్ణమవుతుంది. శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వయుజ దశమి నాడే విజయముహూర్తం వస్తుందని, ఆ రోజునే క్షీరసాగర మథనం జరిగిందని అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకొనే అమ్మవారి ఉత్సవం శరన్నవరాత్రి సంబురం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని విజయదశమి వరకు శరత్ కాల ఆరంభంలో వచ్చే ఈ నవరాత్రులలో దేశమంతా అమ్మవారి ఆరాధనలో మునిగితేలుతుంది. అమ్మవారిని తొమ్మిదిరూపాలలో కొలుస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుకొన్న ఈ తొమ్మిది రాత్రులు పూర్తయిన తర్వాత పదో రోజున విజయోత్సవం చేసుకుంటారు. ఆ సమయంలో నవదుర్గలుగా, దశమహావిద్యలుగా.. ఇలా పలు రకాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ అర్చించడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది.
శత్రువులపై విజయం సాధించేందుకు శక్తి అనుగ్రహం కావాలి. ఆ శక్తే అపరాజిత. రాక్షససంహారం చేసి జగాన్ని కాపాడిన జగన్మాత మహాత్మ్యానికి సంకేతం విజయదశమి. ఈ పండుగ వేళ అమ్మవారిని అపరాజితగా అర్చిస్తారు. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం. అమ్మవారి సహస్రనామాల్లో ఒకటైన ఈ అపరాజితాదేవి విజయానికి అధిదేవత. ‘సర్వకామార్థ సాధనం అపరాజిత పూజనం’ అని పురాణోక్తి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే ఆ తల్లిని పూజిస్తే చేపట్టిన పనుల్లో ఓటమి ఉండదనే నమ్మకంతో ఆమెను అపరాజితగా కొలుస్తారు. మహిషుడు, శుంభనిశుంభుల వంటి రాక్షసులెందరినో సంహరించిన ఆ మహామాతను ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా’ అంటూ అన్ని చోట్లా శక్తి ఉంటుందని ఆ శక్తి దేవీస్వరూపమంటూ కొలిచే పర్వదినం ఇది. ఆ శక్తి ఆశ్వయుజ శుక్ల దశమి రోజున నక్షత్రోదయ సమయంలో ప్రకృతిలో ఆవహించి ఉండి, సకల సుఖాలు ప్రసాదిస్తుంది. రుతువుల సంధికాలంలో వ్యాపించే వ్యాధులను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని శరన్నవరాత్రుల్లో నవదుర్గారూపాల్లో అమ్మవారిని ప్రకృతి శక్తిగా ప్రార్థిస్తారు. పరమ శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ కుడిచేతితో అభయమిస్తూ, ఎడమచేతితో చెరుకుగడ ధరించిన రాజరాజేశ్వరీదేవి షోడశమంత్ర స్వరూపిణి. అపరాజితయైన ఈ అమ్మవారు అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిదేవతగా, మహాత్రిపురసుందరిగా పూజలందుకుంటున్నది. దశవిధ పాపాలను హరించేది కాబట్టి విజయదశమిని దసరాగా పిలుస్తారు. దసరా నాడు దుర్గ, సరస్వతీ, లక్ష్మీ అవతారాల్లో కనిపించే ఆదిపరాశక్తిని అపరాజితగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.
చెట్లను దేవతాస్వరూపాలుగా భావించి పూజించడం భారతీయుల సంప్రదాయం. పరమశివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధిప్రదాత గణపతికి శమీపత్రి సమర్పించే విధానం ఆయా దేవతల పూజలలో కనిపిస్తుంది. అయితే శమీ వృక్షంలో అపరాజిత అమ్మవారు కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. విజయదశమి రోజున అపరాజితాదేవిని శమీవృక్షం వద్ద పూజించడం ఆచారంగా వస్తున్నది. పూర్వం జమ్మిచెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞయాగాదుల క్రతువులు నిర్వహించేవారు. అగ్నివీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. విజయదశమి రోజున అపరాజిత స్వరూపంగా భావిస్తూ శమీపూజ నిర్వహిస్తారు. ఇదేరోజు శమీపూజ చేసి శ్రీరాముడు రావణునిపై విజయం సాధించాడు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ ఆయుధాలను శమీచెట్టుపై పెట్టారు. అజ్ఞాతవాసం తర్వాత జమ్మిచెట్టు మీద పెట్టిన ఆయుధాలను దించి విజయదశమినాడే అర్జునుడు ఉత్తరగోగ్రహణంలో గెలిచాడని ప్రతీతి. శమీ అంటే పాపాలను, శత్రువులను నశింపజేసేది. జమ్మిచెట్టును పూజించేటప్పుడు ‘శమీశమయతే పాపం.. శమీశత్రు వినాశనం.. అర్జునస్యధనుర్ధారీ.. రామస్యప్రియదర్శినీ..’ అని శ్లోకం చెప్పి జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అపరాజితాదేవి కటాక్షంతో శత్రుభయం తొలగి విజయం చేకూరుతుందని పెద్దలు చెబుతారు. జమ్మి ఆకును బంగారం అంటూ పలువురికి పంచిపెట్టడం, పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం దసరా రోజు సాయంకాలం కనిపిస్తుంది.
విజయదశమి రోజున పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా ప్రజలు భావిస్తారు. ప్రత్యేకించి పాలపిట్ట దర్శనం తెలంగాణ దసరా సంబరాలతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉంటుంది. పాలపిట్టగా పిలిచే భారతీయ నీలకంఠం (ఇండియన్ రోలర్) తన నీలం, గోధుమ రంగు రెక్కలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. విజయదశమి రోజున శరన్నవరాత్రి దీక్ష ముగించుకుని ఊరికి ఉత్తరదిక్కుగా పొలిమేరలు దాటి సీమోల్లంఘన చేస్తారు. ఆ సమయంలో పాలపిట్ట దర్శనం శుభసూచకమని, మేలు చేకూరుతుందని భావిస్తారు. పాలపిట్ట దర్శనానికి సంబంధించి జానపదులు ఒక గాథను పాడుకుంటారు. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తయి తిరిగి వస్తుండగా వారికి పాలపిట్ట కనిపించిందట. అప్పటి నుంచి వారికి అన్నీ విజయాలే కలిగాయని, అందుకోసం పాలపిట్ట దర్శనం చేసుకుంటే చేసే ప్రతీపనిలోనూ విజయం లభిస్తుందని జానపదులు చెబుతారు. సాధారణంగా పాలపిట్ట అన్ని పక్షుల మాదిరి తరచూ కనిపించదు. దానికి నీరంటే బెరుకనీ, అందుకు వానలు వెనకబడిన తర్వాత బయటికి వస్తుందని గ్రామీణులు చెబుతారు. ముఖ్యంగా తెలంగాణలో పాలపిట్ట రాష్ట్ర పక్షి కాగా ఈ పక్షికి ఈ ప్రాంతంలో చాలా ప్రాధాన్యముంది.
దసరా అంటే చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీక మాత్రమే కాదు.. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే సంప్రదాయం. అపరాజిత పూజ, జమ్మిచెట్టు ఆరాధన, పాలపిట్ట దర్శనం.. ఈ మూడింటినీ కలిపి చూస్తే విజయంపై మనిషికి ఉన్న నమ్మకంతో పాటు ప్రకృతి ఆరాధన అంతర్లీనంగా కనిపిస్తుంది. అపరాజిత ధైర్యాన్ని గుర్తు చేస్తే, జమ్మి అనుబంధాలను బలపరుస్తుంది. పాలపిట్ట మనసులో ఆశను నింపుతుంది. జమ్మి ఆకు చిన్నగానే ఉన్నా పంచే ఆనందం పెద్దది కాగా పాలపిట్ట క్షణకాలమే కనిపించినా అది మిగిల్చే మురిపెం చిరకాలం ఉంటుంది. ఇక విజయదశమి నాడు అపరాజితను పూజించే సంప్రదాయం.. గెలవాలనే సంకల్పాన్ని మనలో అణువణువునా నింపుతుంది. అందుకే జీవితంలోని సమస్యలను అధిగమించి విజయతీరాలకు చేరుకోవడం, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం, మనుషుల మధ్య బంధాలను కాపాడుకోవడం.. ఈ మూడింటి సమాహారమే విజయదశమి వేళ అమ్మవారి ఆరాధనలో ఉన్న అంతరార్థం.
రంగనాథ్ మిద్దెల 9866573461 …?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

