గువహటి : దోచుకునేందుకు వచ్చిన ఓ దొంగ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అందినకాడికి దోచుకున్న ఆ వ్యక్తి.. పారిపోలేదు. ఆకలిగా ఉండటంతో ఆ ఇంట్లోనే కిచిడి వండటం మొదలుపెట్టాడు. అంతలోనే ఆ దొంగ పోలీసులకు అడ్డంగా దొరికి కటకటలాపాలయ్యాడు.
అసోంలోని ఓ ఏరియాలో తాళం వేసిన ఇంట్లోకి సోమవారం రాత్రి దొంగ చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ దొంగ మూటకట్టాడు. ఇక ఇంటి నుంచి వెళ్లే ముందు ఆకలిగా అనిపించింది. ఇంకేముంది.. కిచెన్లో కిచిడి వండటం మొదలుపెట్టాడు. వంట పాత్రల శబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారికి మెలకువ వచ్చింది. దీంతో వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దొంగతనం ఘటనపై అసోం పోలీసులు చాలా చమత్కారంగా ట్వీట్ చేశారు. కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి హానికరం. దొంగను అరెస్ట్ చేశాం. పోలీసులు అతనికి వేడి వేడి భోజనం అందిస్తున్నారు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.