బంజారాహిల్స్ : తనతో పాటు కలిసి ఇంట్లో పని మనిషిగా చేస్తున్న యువతిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి… బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఓ విల్లాలో 15 రోజుల క్రితం ఓ యువతి (23) పని మనిషిగా చేరింది. అక్కడే సర్వెంట్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటుంది.
అదే ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న శివ (38) ఈ నెల 23న తెల్లవారుజామున సెల్లార్లో ఊడుస్తున్న బాధితురాలిని పక్కకు లాక్కెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు. రెండు రోజుల క్రితం తనను చూసేందుకు వచ్చిన సోదరుడికి విషయం చెప్పింది. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు శివపై ఐపీసీ సెక్షన్ 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.