హైదరాబాద్ : నిషేధిత మావోయిస్టు సాహిత్యాలను ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం తో అంబర్‌పేట ముసరంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాంపై పోలీసులు సోదాలు చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ మురళీధర్‌రావు, మలక్‌పేట ఏసీపీ వెంకట రమణ, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నవ్యప్రింటింగ్ ప్రెస్‌లో తనిఖీలు చేశారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్ట్ నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేసిన దాదాపు వెయ్యి వరకు పుస్తకాలను స్వాధీనం చేసుకుని, బైండింగ్ చెయ్యని పుస్తక మెటీరియల్ సీజ్ చేసినట్లు ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు.
పుస్తకాల ప్రింటింగ్ కు సంబంధించి ఎలాంటి రిసిప్ట్ లు లేవని ఆయన పేర్కొన్నారు. పుస్తకాలలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన భావజాలాన్ని పెంపొందించే విధంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి కొంత కాలంగా మావోయిస్టు అనుబంధ సంఘాలకు సహకరిస్తున్నట్లు అనుమానం ఉందని ఏసీపీ పేర్కొన్నారు.