గువహటి : దివంగత లెజండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియాగో మారడోనాకు చెందిన చోరీకి గురైన లగ్జరీ హెరిటేజ్ హబ్లట్ వాచ్‌ను దుబాయ్ పోలీసుల సమన్వయంతో అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. నిందితుడు వాజిద్ హుసేన్‌ను అరెస్ట్ చేశారని దీనిపై తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మారడోనాకు చెందిన హెరిటేజ్ వాచ్ హబ్లట్ వాచ్‌ను దుబాయ్ పోలీసుల సమన్వయంతో, భారత దర్యాప్తు ఏజెన్సీల సహకారంతో అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. కేంద్ర ఏజెన్సీ ద్వారా దుబాయ్ పోలీసులు పంపిన సమాచారం మేరకు శివసాగర్‌లోని నివాసం నుంచి శనివారం తెల్లవారుజామున నాలుగు గుంలకు నిందితుడిని అసోం పోలీసులు అరెస్ట్ చేశారని అసోం డీజీపీ వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్‌లో దివంగత ఫుట్‌బాల్ ప్లేయర్ వస్తువులను స్టోర్ చేసిన కంపెనీలో నిందితుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మారడోనా సంతకం చేసిన లిమిటెడ్ ఎడిషన్ హబ్లట్ వాచ్‌ను చోరీ చేసి ఈ ఏడాది ఆగస్ట్‌లో అసోంకు తిరిగివచ్చాడు. తమకు వచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడు తన అత్తగారింట్లో ఉండగా శనివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి మారడోనాకు చెందిన హబ్లట్ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని శివసాగర్ జిల్లా ఎస్పీ రాకేష్ రోషన్ తెలిపారు.