లక్నో : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా స్ఫూర్తితో దుండగులు తగ్గేదేలే అంటూ వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. సినిమాలో చూపిన విధంగా దోపిడీదారులు, స్మగ్లర్లు ఇటీవల చెలరేగిన ఉదంతాలు మరువకముందే ఈ తరహా మరో ఘటన వెలుగుచూసింది.యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం లిక్కర్ సరఫరాకు వీరు పుష్ప సినిమాలోని ట్రిక్‌ను వాడారు. ఆగ్రాలోని లిక్కర్ స్మగ్లర్లు కెమికల్ ట్యాంకర్లో మద్యాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.
ట్యాంకర్‌లోని ఓ క్యాబిన్లో కెమికల్‌ను ఉంచిన స్మగ్లర్లు రెండో క్యాబిన్లో లిక్కర్ కార్టన్లను నింపి తరలించారు. పోలింగ్‌కు ముందు ఈ మద్యాన్ని తూర్పు యూపీకి తరలించేందుకు ప్లాన్ చేశారు. ఆగ్రాలోని హరి పర్బత్ పోలీసులు వీరి ఆట కట్టించి మద్యం కార్టన్లను సీజ్ చేశారు. దాదాపు 360 మద్యం కార్టన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హర్యానా నుంచి అక్రమంగా మద్యాన్ని వారు స్మగుల్ చేస్తున్నట్టు గుర్తించారు. తాము కెమికల్ ట్యాంకర్‌తో వెళుతున్నామని పోలీసులు తమను తనిఖీ చేయరని నిందితులు భావించారు. లిక్కర్ స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు కెమికల్ ట్యాంకర్‌ను వెంటాడి మద్యాన్ని సీజ్ చేశారు. పుష్ప మూవీలో హీరో అల్లు అర్జున్ మిల్క్ ట్యాంకర్లో ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తాడు.