Yoga Anthem | మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ‘యోగా ఆంథెమ్’ సాంగ్‌ను ప్రముఖ దర్శకులు మారుతి విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, దర్శకులు మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకులు మారుతి మాట్లాడుతూ, “యోగా గురించి మాట్లాడాలంటే చాలా అర్హత ఉండాలి. ‘యోగా ఆంథెమ్’ సాంగ్‌ను నా చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రధాని మోదీ గారు యోగా డేను సెలబ్రేట్ చేస్తున్నారు. విశాఖపట్నంలో ఆయన యోగా డే వేడుకలకు హాజరవుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ‘యోగాంధ్ర’ వేడుకల్లో ఈ ‘యోగా ఆంథెమ్’ పాట మొదటి బహుమతి గెలుచుకోవడం సంతోషకరం. ఈ పాట ద్వారా ఇషాన్ క్రియేషన్స్ అశోక్ గారు మోదీ గారిని కలిసే అవకాశం దక్కించుకున్నారు. యోగాకు ఏ మతం లేదు. అందరూ ఆరోగ్యం కోసం యోగాను ప్రాక్టీస్ చేయాలి. మనకు అతి తక్కువ ఖర్చుతో చేసుకునే వ్యాయామం యోగా. ఈ పాటను మణిశర్మ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. అనంత శ్రీరామ్ గారు అందరికీ అర్థమయ్యేలా మంచి లిరిక్స్ రాశారు. అశోక్ నాకు డిస్ట్రిబ్యూటర్‌గా తెలుసు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్లో నష్టాలు వచ్చి కొంతకాలం పరిశ్రమకు దూరమయ్యారు. ఆ తర్వాత సెలూన్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు పెట్టి మంచి పొజిషన్‌కు వచ్చారు. అలాగే అన్ని శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలను తిరిగి, యోగా గురించి తెలుసుకుని, యోగాకు ప్రచారం చేస్తున్నారు. వారు ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, “మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. అలా మనసు, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు ఉంది. ఏ పేటెంట్ లేకుండా మనం ప్రపంచానికి అందించిన బహుమతి యోగా. ఈ పాటను అన్ని భాషల వారికీ అర్థమయ్యేలా రాయాలని అనుకున్నాను. అందుకే ఎక్కువగా సంస్కృత పదాలను ఉపయోగించి రాశాను. సంస్కృతాన్ని దైవ భాష అని అంటారు. ఈ పాట రూపకల్పన చేసి నాతో పాట రాయించాలని అశోక్ గారు అనుకున్నందుకు ధన్యవాదాలు. యోగాకు ప్రచారం కల్పిస్తూ దానికి ఒక ప్రత్యేకమైన రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడం లోక కల్యాణానికి మంచిది. యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న మన నాయకులు అందరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ మాట్లాడుతూ, “నేను తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా పలు సక్సెస్ఫుల్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాను. అప్పటి నుంచే మారుతి గారి సపోర్ట్ ఉండేది. ఆ తర్వాత ‘శంకరాభరణం’, ‘కళావతి’ అనే మూవీస్ పంపిణీ చేసి నష్టపోయాను. పరిశ్రమ నుంచి వెళ్లిపోదామనుకునే సమయంలో మారుతి గారు పిలిచి ‘నీకు మంచి రోజులు వస్తాయి, వెయిట్ చేయి’ అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి యోగా చేయడం అలవాటు ఉండేది. డిస్ట్రిబ్యూషన్ ఆపేశాక ఏడాదిపాటు రోజుకు 18 గంటలు యోగా ప్రాక్టీస్ చేశాను. 17 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలను దర్శించాను. ఆ తర్వాత సెలూన్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు పెట్టాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం పెట్టి 11 ఏళ్లవుతోంది. ఈసారి ‘యోగాంధ్ర’ వేడుకల్లో మా ‘యోగా ఆంథెమ్’ సాంగ్‌కు మొదటి బహుమతి వచ్చింది. ఈ పాటను మణిశర్మ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు, అనంత శ్రీరామ్ గారు అందమైన లిరిక్స్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి గారు ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటకు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయల నగదు బహుమతి, మొదటి బహుమతి ఇచ్చారు. రేపు మోదీ గారిని కలిసే 50 మందిలో నాకు మొదటి అవకాశం కల్పించారు” అని వెల్లడించారు.