Thaman .S | టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో ఆస్కార్ గెలిచి మనందరికీ ఒక మార్గాన్ని వేశారని, అదే బాటలో ప్రయాణించి రాజమౌళి మరియు కీరవాణి గారు ‘RRR’ సినిమాతో ఆస్కార్‌ను మన ముందుకు తీసుకువచ్చారని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో తాను కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాతో ఆస్కార్ వేదికపై నిలబడతానని థమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ గారి ఆలోచనలు, ఆయన రాసే కథలకు ఆస్కార్ స్థాయి సత్తా ఉందని, ఆయన దర్శకత్వంలో ఖచ్చితంగా ఒకరోజు ఆ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంటామనే గట్టి నమ్మకాన్ని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ దగ్గర అద్భుతమైన ‘రామాయణం’ స్క్రిప్ట్ ఉందని, అది వంద ఏళ్ల వరకు గుర్తుండిపోయేలా ఉంటుందని థమన్ పేర్కొనడం విశేషం. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. థమన్ కష్టపడే తత్వాన్ని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయనపై సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్‌ను ఒక యోగిలా భావించే థమన్, తన గురువుతో కలిసి ఆస్కార్ కల నెరవేర్చుకుంటారా అనేది వేచి చూడాలి.