Vishwambara | మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ విజువల్ వండర్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తికావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంలో కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ను 2027 మహాశివరాత్రి సందర్భంగా మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వాస్తవానికి ‘విశ్వంభర’ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇది సోషియో ఫాంటసీ కథ కావడంతో సినిమాలోని విజువల్స్, గ్రాఫిక్స్ అత్యంత సహజంగా, అద్భుతంగా కనిపించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పనులు చేయించినట్లు సమాచారం. క్వాలిటీ విషయంలో రాజీపడకపోవడం వల్లే సినిమా విడుదలలో ఆలస్యం జరిగినట్లు టాక్. ప్రస్తుతం సినిమా తుది కాపీకి సంబంధించిన పనులు పూర్తయినప్పటికీ.. భారీ స్థాయి చిత్రానికి సరైన విడుదల తేదీ, సోలో రిలీజ్ అవకాశాన్ని చూసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంక్రాంతి సీజన్ ప్రత్యేకమైనది. దీంతో ‘విశ్వంభర’ కూడా 2027 సంక్రాంతి బరిలోకి వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ‘కాకా’ను జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఒకే హీరో నటించిన రెండు భారీ చిత్రాలు ఒకే పండుగ సీజన్లో విడుదలైతే కలెక్షన్ల పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో రెండు సినిమాల మధ్య పోటీ లేకుండా ‘విశ్వంభర’ను సంక్రాంతి రేసు నుంచి తప్పించి మార్చిలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ‘విశ్వంభర’ను మహాశివరాత్రి సీజన్‌కు తీసుకురావడం వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఫాంటసీ కథాంశం, దైవిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివరాత్రి పండుగ వాతావరణం మరింతగా కలిసొస్తుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.అదే జరిగితే సంక్రాంతికి ‘కాకా’తో సందడి చేయనున్న చిరంజీవి.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మార్చిలో ‘విశ్వంభర’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒకే ఏడాది తొలి మూడు నెలల్లోనే మెగాస్టార్ నుంచి రెండు భారీ చిత్రాలు విడుదల కానుండటం అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారనుంది.