Chandini Chowdary | ‘కొన్ని కథలు విన్నప్పుడు నన్ను నేను నియంత్రించుకోలేను. ‘గామి’ కథ విన్నప్పుడు తప్పకుండా అందులో భాగం కావాలనిపించింది’ అని చెప్పింది చాందిని చౌదరి. ఆమె కథానాయికగా విశ్వక్సేన్తో కలిసి నటించిన చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాందిని చౌదరి మాట్లాడుతూ “గామి’ అంటే గమ్యాన్ని గమించేవాడు అని అర్థం.
ఈ సినిమాను వారణాసి, కుంభమేళ, కశ్మీర్, హిమాలయాల్లోని రియల్ లోకేషన్స్‌లో షూట్ చేశారు. సినిమా ప్రయాణం అంతా ఓ సాహస యాత్రలా సాగింది. టీం అంతా ఐదేళ్ల పాటు సినిమా కోసం శ్రమించాం. ఐమాక్స్ స్క్రీన్‌లో ట్రైలర్ చూసినప్పుడు మేం పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందనే భావన కలిగింది’ అని చెప్పింది. నటిగా పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, జయాపజయాలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పనిలో సాగిపోవాలనే సత్యాన్ని తెలుసుకున్నానని ఆమె తెలిపింది. అన్ని జోనర్స్ సినిమాలు చేయాలన్నదే తన లక్ష్యమని, ఈ ఏడాది తాను నటించిన నాలుగు సినిమాలు రాబోతున్నాయని చాందిని చౌదరి పేర్కొంది.