Virosh | టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ-రష్మిక జంట ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి వేడుకల అనంతరం ఈ జంట తమ వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదించేందుకు థాయ్‌లాండ్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ కొత్త జంట కో సముయి ద్వీపంలో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ హనీమూన్ ట్రిప్‌కు సంబంధించిన ఓ రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్ర తీరాన ఉన్న అందమైన ప్రదేశంలో తీసిన ఈ ఫోటోలో విజయ్, రష్మిక ఒకరినొకరు హత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. రష్మిక పసుపు రంగు ఫ్లోరల్ డ్రెస్‌లో మెరిసిపోతుండగా, విజయ్ క్యాజువల్ టీ షర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు హనీమూన్ కోసం లగ్జరీ రిసార్ట్స్‌ను ఎంచుకుంటారు. అయితే ఈ జంట మాత్రం భిన్నంగా ఆలోచించి, సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ విల్లాను ఎంపిక చేసుకుంది. ప్రకృతి ఒడిలో, పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ విల్లాలో వీరిద్దరూ ప్రశాంతంగా గడుపుతూ తమ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా, హడావిడి లేకుండా ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇక వీరి పెళ్లి వేడుక కూడా ప్రత్యేకతని సంతరించుకుంది. ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం తెలుగు , కొడవ సంప్రదాయాల కలయికగా సాగింది. ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా ఈ జంట కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ దుస్తులను డిజైన్ చేశారు. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో తెరపై హిట్ జోడీగా నిలిచిన ఈ ఇద్దరూ, నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించింది. గతేడాది అక్టోబర్‌లోనే నిశ్చితార్థం జరిగినప్పటికీ, పెళ్లి వరకు తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచడం విశేషం. ఇక హనీమూన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే రష్మిక మంధాన మళ్లీ షూటింగ్లలో బిజీ అయ్యారు. ఆమె ప్రస్తుతం ‘మైసా’ చిత్రంలో నటిస్తుండగా, మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మొత్తంగా, విరోష్ జంట హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి.