Rowdy Janardhana | టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రౌడీ జనార్ధన’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్‌ను ఊపేసే ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. దర్శకుడు రవి కిరణ్ ఈ పాట కోసం ఒక పవర్ఫుల్ సిచువేషన్ను సిద్ధం చేయగా, అందులో విజయ్ పక్కన స్టెప్పులేసేందుకు ‘కన్నప్ప’ ఫేమ్ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు నడుస్తున్నాయని, అంతా అనుకూలిస్తే రౌడీ హీరోతో కలిసి ప్రీతి ముకుందన్ మాస్ డ్యాన్స్‌తో థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు.
ఈ సినిమాపై అంచనాలు పెంచే మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే.. టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్, సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్‌ను మునుపెన్నడూ చూడని విధంగా, ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేశారట. ముఖ్యంగా రాజశేఖర్ సరికొత్త లుక్ ఈ సినిమాకే పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఓ వైపు ‘రణబాలి’ సినిమా చేస్తూనే, మరోవైపు ఈ ‘రౌడీ జనార్ధన’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని విజయ్ దేవరకొండ పూర్తి కసిగా ఉన్నాడు.