ఇప్పటికే ‘రణబాలి’ ‘రౌడీ జనార్ధన’ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న అగ్ర హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. తాజాగా వీటిని ధృవీకరిస్తూ చిత్రబృందం శనివారం అధికారిక ప్రకటన వెలువరించింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కనుంది.
హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ఔట్ వంటి చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్జినెజ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫీ అందిస్తుండగా, ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్’ చిత్రానికి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేసిన ఎరిక్ డస్ట్ ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. శనివారం రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ దేవరకొండ వేట కుక్కలను నడిపిస్తూ ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు. సినిమా టీమ్ మెంబర్స్ వివిధ రకాల ఆయుధాలతో కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమే’ అనే క్యాప్షన్ ఇదొక వయొలెంట్ అండ్ రొమాంటిక్ స్టోరీ అనే భావనను కలిగిస్తున్నది. మైథలాజికల్ యూనివర్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతాన్నందించనున్నారు.