పాన్ ఇండియా సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు అగ్రహీరో విజయ్ దేవరకొండ. తాజా సమాచారం ప్రకారం ఆయన తొలి హిందీ స్ట్రెయిట్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. వైవిధ్య చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ ఓ చిత్రాన్ని చేయబోతున్నారని గతకొంతకాలంగా వార్తలొస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మాణం చేపట్టనుందని ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ తెరకెక్కించనుందని సమాచారం.
ఇటీవల ముంబయిలోని ఆ సినిమా ఆఫీసులో విజయ్ దేవరకొండ, విక్రమ్ కె కుమార్ ఇద్దరూ కనిపించడంతో ఈ వార్తలకు మరింతగా బలం చేకూరినట్లయింది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని, ఓ యూనివర్సల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ‘రౌడీ జనార్ధన’ చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఇవి ప్రేక్షకుల ముందుకురానున్నాయి.