Varanasi |సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ రిలీజ్‌కు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. భారతీయ సినిమా హద్దులను దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్ర బృందం ప్రచారాన్ని విదేశాల్లో వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇటీవల మెక్సికోలో జరిగిన ప్రముఖ కామిక్ కాన్ మెక్సికో ఈవెంట్లో ‘వారణాసి’కు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌తో పాటు రాజమౌళి పంపిన వీడియో సందేశం ప్రదర్శించగా, అక్కడి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సినిమాలో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతికత, గ్రాండియర్ విజువల్స్ చూసి అంతర్జాతీయ సినీ ప్రియులు ఆశ్చర్యపోయినట్లు సమాచారం.
ఈ స్పందనతో ఉత్సాహంగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు బ్రెజిల్లో భారీ ప్రమోషన్స్‌కు సిద్ధమవుతోంది. లాటిన్ అమెరికా మార్కెట్లో సినిమాపై హైప్ పెంచేందుకు బ్రెజిల్‌ను కీలక వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన RRR అక్కడ భారీ క్రేజ్ సంపాదించుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ గ్లోబల్ ప్రమోషన్ వెనుక రాజమౌళి పక్కా వ్యూహం పనిచేస్తోంది. సినిమా షూటింగ్ దశలోనే అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రమోషన్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ల దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. బ్రెజిల్లో జరగబోయే ఈ ప్రచార కార్యక్రమంలో మహేష్ బాబు వర్చువల్‌గా పాల్గొనే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది.
యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ‘వారణాసి’ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందించేందుకు చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, రఫ్ ఫిజిక్‌తో ఆయన గెటప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా విషయంలో రాజమౌళి అనుసరిస్తున్న గోప్యత కూడా ఆసక్తికరంగా మారింది. కామిక్ కాన్‌లో చూపించిన విజువల్స్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ సైలెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఏది ఏమైన బ్రెజిల్ ప్రచారం తర్వాత ‘వారణాసి’పై గ్లోబల్ స్థాయిలో మరింత హైప్ పెరగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.