avatar 2 unknown facts | ‘నాన్నా! నేను చెప్పేది మీరైనా నమ్మండి..’ అవతార్-2 టీజర్లో ఒక డైలాగ్ ఇది! ఆ ఐదున్నర అడుగుల చిన్నారి మాట పది అడుగుల ఎత్తున్న వాళ్ల నాన్న నమ్మారో లేదో సినిమా చూస్తే గానీ తెలియదు. కానీ, లేని పండోరా గ్రహాన్ని ఉన్నదని, అక్కడ గ్రహాంతరవాసులు అంతెత్తున ఉంటారని, ప్రకృతి పరిరక్షణ కోసం ప్రళయాన్ని సైతం ఎదుర్కొంటారని మాత్రం మనమంతా నమ్మేశాం. ఏదో గుడ్డిగా కాదు.. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ వెండితెరపై సృష్టించిన మాయాజాలాన్ని కన్నార్పకుండా చూసి మరీ నమ్మేశాం! ఈ నెల 16న రానున్న అవతార్ ఫ్రాంచైజీలో రెండో చిత్రం ‘ద వే ఆఫ్ వాటర్’ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కండ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుండటమే ఇందుకు నిదర్శనం.
మనదేశంలో 2009లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అవసరమైనప్పుడే ఆ సంగతి గుర్తొస్తుంది! అదే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరిగింది. పాకిస్థాన్ పొట్టి ప్రపంచకప్
విజేతగా నిలిచింది. ఆ సంగతి బలవంతంగా గుర్తుచేయాల్సిందే! కానీ, అదే ఏడాది చివర్లో డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్’ చిత్రం విడుదలైంది. రెండో ఆట ముగిసేసరికి సంచలనమైంది. మూడు రోజులు దాటకముందే రికార్డుల మోత మొదలైంది. పదమూడేండ్లు గడుస్తున్నా.. ‘అవతార్’ విశ్వరూపాన్ని మర్చిపోలేకపోతున్నాం. అంతలా అలరించింది ఈ హాలీవుడ్ సినిమా.
పచ్చని పుడమిని కాదని రోదసి దాటి మనిషి సాగిస్తున్న వెతుకులాట ఎందుకు? అవనిలో ఉన్నవన్నీ అందినకాడికి దోచుకున్న మనిషి 22వ శతాబ్దం చివరినాటికి ఇతర గ్రహాలకు చేరుకోవాలని భావిస్తున్నాడు. ఈ పరిశోధనలకు కార్పొరేట్ సంస్థలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. పుడమి చుట్టూ తిరిగే చందమామ మొదలుకొని శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తుందని భావించే పండోరా ఉపగ్రహం వరకు అనువైన చోటు కోసం అంతరిక్షం అంతా జల్లెడపడుతున్నాడు. అందుబాటులో ఉన్న భూమిని సర్వనాశనం చేసుకొని అందనంత దూరంలోని తారా తీరాల సంగతి తేల్చుకోవాలని భావిస్తున్నాడు. ఖరీదైన ఖనిజం కోసం, స్వచ్ఛమైన నీటి కోసం, కాలుష్యం అంటని గాలి కోసం.. ఇంకా చెప్పాలంటే విశ్వంలోనూ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మానవ సహజమైన ఈ స్వార్థమే ‘అవతార్’ కథావస్తువు. ఈ పరిశోధనల ఫలితంగానే పండోరా గ్రహానికి చేరుకుంటారు మనుషులు. అక్కడ ఉన్న ప్రకృతి సంపదనంతా తమ పరం చేసుకోవాలని పథకం వేస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో కొందరు మనుషులను పండోరావాసుల రూపురేఖలతో పునఃసృష్టి చేస్తారు. వారి సాయంతో అక్కడి సంపదను కొల్లగొట్టాలని కుట్ర పన్నుతారు. మనుషుల ఎత్తుగడను నావీ ఆదివాసీలు కనిపెట్టడం, పండోరావాసులుగా మారిన మనుషులు జేక్, డాక్టర్ గ్రేస్ సాయంతో వారిని ఎదిరించడం మిగిలిన కథ.
అప్పటివరకు గ్రహాంతరవాసులు అంటే.. రెప్పల్లేని కండ్లతో, పెదాలు లేని మూతితో, మరుగుజ్జుల్లా అందవికారంగా చూపేవారు. ‘అవతార్’లో పండోరా గ్రహవాసులను అంతెత్తు చూపించడం ఒక వింత! వారికి తోకలు పెట్టడం మరో వింత! ఆ తోకలను ప్రకృతితో, పండోరా జంతుజాలంతో అనుసంధానకర్తలుగా చూపించడం వింతల్లోకెల్లా వింత! ‘టెర్మినేటర్’ సినిమాలో భవిష్యత్తు నుంచి వచ్చిన మరమనిషికీ భావోద్వేగాలు ఉంటాయని చూపించిన కామెరాన్.. ‘అవతార్’లో గ్రహాంతరవాసులకు మనిషికి మించిన అనుబంధాలు ఉంటాయని కండ్ల కుకట్టాడు. పైకి యుద్ధ విన్యాసాలు, గ్రాఫిక్స్ హంగులు కనిపించినా.. అంతర్లీనంగా ప్రకృతిపట్ల సమస్త జీవజాలం ఎంత బాధ్యతతో వ్యవహరించాలో తెలియజెప్పాడు కామెరాన్. అందుకే అవతార్ అందరికీ కనెక్ట్ అయింది.
‘అవతార్’లో మట్టికీ, చెట్టుకూ, పండోరావాసులకూ ఉన్న సంబంధాన్ని తెలియజేస్తే.. రానున్న ‘అవతార్-2’లో నీటితో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించాడని ఇండస్ట్రీ టాక్. తాజా చిత్రంలో పండోరాపై ఉన్న సముద్రాలు, వాటి అడుగున ఉండే సంపద, దాన్ని దోచుకోవాలనుకునే మనుషులను జేక్ అండ్ కొ ఎలా ఎదుర్కొన్నారో చూపించాడట. టీజర్లో వినిపించే ‘ఈ నీరే అన్నిటికీ వారధి’ అనే డైలాగ్ ఈ చిత్ర కథావస్తువును తెలియజేస్తుంది. పండోరా నేలలో మనుషుల దాష్టీకంతో స్వస్థలాన్ని కోల్పోయిన నావీలకు సముద్రంతో అనుబంధం ఎలా ఏర్పడింది? వారికి ఎదురైన పరిస్థితులు? వాటిని వారు ఎదుర్కొన్న తీరు ఇవన్నీ ఈ సీక్వెల్ చిత్రంలో ప్రధానంగా అలరించనున్నాయి.
పదమూడేండ్ల కింద అవతార్ సినిమా చూస్తూ కేరింతలు కొట్టిన ఐదేండ్ల కుర్రాడు.. ఇప్పుడు 18 ఏండ్ల వాడయ్యాడు. అప్పుడు పాతికేండ్ల యువకుడు ఇప్పుడు నడివయసు బాధ్యతల్లో బిజీ అయ్యాడు. వీళ్లంతా ఈ నెల 16 కోసం ఎదురు చూస్తున్నారు. పండోరా వండర్స్ ఎంజాయ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన సినిమాను త్రీడీ, ఫోర్డీఎక్స్ త్రీడీ, ఫోర్కే రిజల్యూషన్ ఫార్మాట్లో తిలకించి పులకించిపోవడానికి సిద్ధమవుతున్నారు. అందుకే రిలీజ్‌కు మూడు వారాల ముందు నుంచే టికెట్ల అమ్మకాల జోరు పెరిగింది.
‘అవతార్’ చిత్ర నిర్మాణానికి 23 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. 2009లో డాలర్, రూపాయి లెక్కలతో పోలిస్తే నిర్మాణ వ్యయం సుమారు రూ.1150 కోట్లు. బాక్సాఫీస్ దగ్గర 130 కోట్ల డాలర్లు కొల్లగొట్టింది. అంటే దాదాపు రూ.6,294 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.
అవతార్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాణ వ్యయమూ పెరిగింది. దాదాపు 25 కోట్ల డాలర్లు వెచ్చించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలవుతున్నది. మనదేశంలోనే ఏకంగా 3,000 స్క్రీన్లపై కనువిందు చేయనుంది.
‘అవతార్’ ఫ్రాంచైజీపై మరిన్ని సీక్వెల్స్ వస్తాయని కామెరాన్ ప్రకటించారు. 2024లో ‘అవతార్ 3’, 2026లో ‘అవతార్ 4’ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని సీక్వెల్స్ నిర్మించడానికి తాను సిద్ధమని, ఆ విషయాన్ని మార్కెట్ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు కామెరాన్.
తెలుగు రాష్ర్టాల్లో అవతార్-2కు ఊహించనంత డిమాండ్ వస్తున్నది. రెండు రాష్ర్టాల్లో హక్కులు రూ.120 కోట్లు పలుకుతున్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. మొదటిరోజు రూ.30 కోట్ల వరకు వసూలు అవుతాయని ఇండస్ట్రీ టాక్. వారాంతం పూర్తయ్యేవరకు వంద కోట్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు.
“foriegn actress | తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న విదేశీ భామలు..”