Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు 10’ త్వరలో ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో షో ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ.. హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా విడుదలైన జబర్దస్త్ కొత్త ప్రోమో ఇప్పుడు బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లపై కొత్త చర్చకు తెరలేపింది. ప్రముఖ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ ఈ ప్రోమోలో కనిపించకపోవడంతో.. వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మరింత జోరందుకుంది.
జబర్దస్త్‌లో రెగ్యులర్‌గా కనిపించే ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ తాజా ప్రోమోలో ఎక్కడా కనిపించకపోవడం అభిమానుల్లో అనేక అనుమానాలకు కారణమైంది. సాధారణంగా బిగ్‌బాస్‌లో పాల్గొనబోయే సెలబ్రిటీలు షో ప్రారంభానికి కొన్ని రోజుల ముందే ఇతర ప్రాజెక్టులు, షూటింగ్‌ల నుంచి కొంత విరామం తీసుకుంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రామ్ ప్రసాద్, నరేష్ కూడా బిగ్‌బాస్ 10 కోసం జబర్దస్త్ షూటింగ్‌కు తాత్కాలికంగా దూరంగా ఉన్నారేమోననే ఊహాగానాలు బుల్లితెర వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే వీరి ఎంట్రీపై ఇప్పటివరకు షో నిర్వాహకులు లేదా సంబంధిత కమెడియన్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
బిగ్‌బాస్ షోలో టాస్క్‌లు, గొడవలు, ఎమోషన్స్‌తో పాటు వినోదం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గత సీజన్లలో జబర్దస్త్‌కు చెందిన పలువురు కమెడియన్లు హౌస్‌లోకి అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించారు. ముక్కు అవినాష్, రోహిణి, ఇమ్మాన్యుయేల్, ఫైమా వంటి కమెడియన్లు తమదైన శైలిలో బిగ్‌బాస్‌లో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పదో సీజన్ కావడంతో ఎంటర్టైన్మెంట్ను మరింత పెంచేందుకు ఇద్దరు పాపులర్ కమెడియన్లను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఆటో రామ్ ప్రసాద్ తనదైన పంచ్‌లు, కామెడీ టైమింగ్, రైటింగ్‌తో జబర్దస్త్ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఎలాంటి సందర్భాన్నైనా తనదైన కామెడీతో మార్చేయగల ఆయన.. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే షోలో వినోదానికి కొదవ ఉండదని అభిమానులు భావిస్తున్నారు.