Trump tariffs On Foreign Films | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ చిత్రాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో భారతీయ సినిమా పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ఈ సుంకాలు అమలైతే, అమెరికాలో విడుదలయ్యే భారతీయ సినిమాల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు, పంపిణీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్స్ సాధించే చిత్రాలలో బాలీవుడ్ తర్వాత ఆ స్థానాన్ని ప్రస్తుతం టాలీవుడ్ ఆక్రమించింది. అయితే ట్రంప్ టారిఫ్స్ అంటూ ప్రకటించడంతో భారతీయ సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం కలుగనున్నట్లు తెలుస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, పుష్ప 2 ది రూల్ సినిమాల తర్వాత తెలుగు సినిమాల డిమాండ్ ఓవర్సీస్లో విపరీతంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం వచ్చే సినిమాలకు టారిఫ్స్ విధిస్తే.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై పడుతున్నట్లు తెలుస్తుంది.
ఇదే విషయంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాసిశ్ సర్కార్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, ఎగ్జిబిటర్ అక్షయ్ రాఠి ఈ విషయంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రకటనపై స్పష్టత లేనప్పటికీ, ఒకవేళ సుంకాలు అమలైతే టికెట్ ధరలు పెరిగి, సినిమా వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు తెలిపారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాసిశ్ సర్కార్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాలు ప్రతి సంవత్సరం అమెరికాలో సుమారు రూ. 800 కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ విదేశీ సినిమాలపై 100 శాతం పన్నులు విధిస్తే, టికెట్ ధరలు పెరుగుతాయి. ఇది ప్రేక్షకులకు ఆర్థికంగా భారమవుతుంది, ఫలితంగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. టికెట్ ధరలు అందుబాటులో ఉంచాలని భావిస్తే, ఆ భారాన్ని ఎగ్జిబిటర్లు నిర్మాతల మీద వేస్తారు. దీనివల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లుతుంది లేదా లాభాలు బాగా తగ్గిపోతాయి. ఏ విధంగా చూసినా ఇది నిర్మాతలకు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితే. అంతేకాకుండా, డిజిటల్ మరియు టీవీ ఒప్పందాలలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందంటూ తెలిపారు.