‘నేను పుట్టిందీ పెరిగిందీ హైదరాబాద్‌లోనే. కల్చరల్ యాక్టివిటీస్ అంటే చిన్నప్పట్నుంచీ ఇంట్రస్ట్. స్కూల్, కాలేజ్ ఈవెంట్స్‌లో కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేదాన్ని. సంగీతం నేర్చుకున్నాను. పాటలు పాడతాను. 2018లో మిస్ హైదరాబాద్‌గా సెలక్టయ్యాను. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. కళలంటే ఇష్టమున్నా కథానాయికను అయ్యింది మాత్రం యాదృశ్చికంగానే’ అంటున్నారు యువకథానాయిక శ్రీగౌరిప్రియ. ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘లవర్’. మణికందన్, కన్న రవి ప్రధానపాత్రధారులు.
ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మాతలు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమాను, దర్శకుడు మారుతి, యువనిర్మాత ఎస్కేఎన్ ‘ట్రూ లవర్’ పేరుతో తెలుగులో అనువదించి, ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీగౌరిప్రియ బుధవారం మీడియాతో ముచ్చటించారు. వైజయంతీమూవీస్ వారి ‘మెయిల్’ వెబ్‌సిరీస్ తనకు మంచి గుర్తింపు తెచ్చిందని, రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాలు థియేటర్లలో కూడా బాగా ఆడి తన కెరీర్‌ని నిలబెట్టాయని శ్రీగౌరీప్రియ పేర్కొన్నారు.
‘మోడరన్ లవ్ చెన్నై’ వెబ్ సిరీస్ ద్వారా తమిళ ప్రేక్షకులకు కూడా చేరువయ్యే అదృష్టం కలిగిందని, ఆ సిరీస్ వల్లే ‘ట్రూ లవర్’ అవకాశం తలుపుతట్టిందని శ్రీగౌరిప్రియ తెలిపారు. ఇంకా చెబుతూ ‘ఇందులో నా పాత్ర పేరు దివ్య. ఓ జంట మధ్య ఆరేళ్ల కాలంలో జరిగిన కథ ఇది. దర్శకుడు ప్రభురామ్ విభిన్నంగా ఆలోచించి నిజానికి దగ్గరగా ఈ కథ తయారు చేశారు. మంచీచెడు అనేవి సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఒక అబ్బాయిని అమ్మాయి చూసే పర్సెప్షన్, అమ్మాయిని అబ్బాయి చూసే పర్సెప్షన్ వేరువేరు సందర్భాల్లో ఎలా ఉంది? తద్వారా ఎదురైన పరిణామాలేంటి? అనేది ఈ చిత్ర కథ. ఇందులోని నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఆ కేరక్టర్‌ని అర్థం చేసుకోడానికి కాస్త టైమ్ తీసుకున్నాను. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు నిర్మాతలైన మారుతి, ఎస్కేఎన్గారికి థ్యాంక్స్’ అన్నారు శ్రీగౌరీప్రియ.