Toxic | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ విజయవంతంగా దూసుకుపోతోంది. మంచి పాజిటివ్ టాక్, ప్రేక్షకుల ఆదరణతో కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్న ఈ సినిమాకు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురుకానుంది. రాకింగ్ స్టార్ యశ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపులపై ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.సాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాకు ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ చిత్రానికే ఎక్కువ స్క్రీన్లు, షోలు కేటాయించడం ఆనవాయితీ. ప్రస్తుతం యశ్ ‘టాక్సిక్’పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పెద్ద ఎత్తున థియేటర్లు కేటాయిస్తున్నారు. యశ్ చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపిస్తుండటం, సినిమా ప్రమోషనల్ కంటెంట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం కూడా ‘టాక్సిక్’కు కలిసొచ్చే అంశాలుగా మారాయి.
దీంతో ఇప్పటివరకు మంచి రన్ కొనసాగిస్తున్న ‘ఇరుముడి’కి కొన్ని ప్రధాన థియేటర్లలో షోలు తగ్గించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతున్న సమయంలో ‘టాక్సిక్’ ఎంట్రీ ఇవ్వడం రవితేజ సినిమాకు కీలక పరీక్షగా మారిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రవితేజకు చెందిన ART సినిమాస్‌లోనే ‘టాక్సిక్’కు ఎక్కువ ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది. అక్కడ ‘టాక్సిక్’ చిత్రానికి ఏకంగా 10 షోలు కేటాయించగా, ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ఇరుముడి’కి మాత్రం 5 షోలు మాత్రమే దక్కినట్లు సమాచారం.దీంతో అభిమానులు కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సొంత థియేటర్లోనే రవితేజ సినిమా కంటే యశ్ ‘టాక్సిక్’కు ఎక్కువ షోలు కేటాయించడం, ప్రస్తుతం ఆ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
అయితే థియేటర్లు తగ్గడం వల్లే ‘ఇరుముడి’ ప్రయాణం ఆగిపోతుందని ఇప్పుడే చెప్పలేం. సినిమా కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి బలమైన స్పందన వస్తుండటంతో, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఆదరణ కొనసాగితే పరిమిత స్క్రీన్లలోనూ మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. మరోవైపు ‘టాక్సిక్’ తొలి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటే మరిన్ని రోజులు భారీ సంఖ్యలో థియేటర్లను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిక్స్డ్ టాక్ వచ్చినా, ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న ‘ఇరుముడి’కు మళ్లీ షోలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.