గత కొన్ని మాసాలుగా తెలుగు రాష్ర్టాలతో పాటు దక్షిణాది చిత్రసీమలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు నేడు జరగనున్నాయి. కొద్ది వారాలుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ పరస్పర ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. రెండేళ్లకొకసారి జరిగే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్..18 మంది ఈసీ సభ్యులతో కలిసి మొత్తం 26 మందిని ఎన్నుకుంటారు. నేటి ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్‌ను నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా…883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓట్ల లెక్కింపు సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుంది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఫలితాలు వెలువడే అవకాశముంది.