ఓ వైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరోవైపు నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులకు చేరువవుతున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. అదే ఉత్సాహంతో ఈ సంస్థ తెరకెక్కించిన తాజా చిత్రం ‘మ్యాజిక్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. పలువురు నూతన తారలను పరిచయం చేస్తూ టీనేజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ వేసవిలో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. కాలేజీ ఫెస్టివల్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్‌ను కంపోజ్ చేయడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నాల చుట్టూ కథ నడుస్తుందని, నీలగిరి ప్రకృతి అందాల నడుమ తెరకెక్కించిన సన్నివేశాలు కనులవిందుగా ఉంటాయని చిత్రబృందం పేర్కొంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు రూపొందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్, ఆర్ట్: అవినాష్ కొల్లా, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాతలు: నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.