టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన ఎందరో తారల్లో తాప్సీ పన్ను ఒకరు. వరుస అవకాశాలతో ఆమె బిజీ అయిపోయింది. తాప్సీ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ తాజా సినిమా ‘డంకీ’లో అద్భుతంగా నటించి విమర్శకుల మెప్పు అందుకుంది. కెరీర్లో తారాపథంలో దూసుకుపోతున్న తాప్సీ పంచుకున్న సంగతులు ఇవి…
దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీని విపరీతంగా అభిమానిస్తాను. ఆయన సినిమాలంటే పిచ్చి. షారుఖ్‌ఖాన్, రాజ్‌కుమార్ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిశాక.. ఎప్పుడెప్పుడు చూస్తానా అనుకున్నాను. ఓ రోజు ఆ సినిమాలో నేను నటిస్తున్నానన్న వార్తలు బీటౌన్‌లో వినిపించాయి. గాలి కబుర్లే అనుకున్నా, నాకు భలేగా అనిపించింది. ఆ ఆనందంలో ఉండగానే ఓ రోజు రాజ్‌కుమార్ ఫోన్ చేశారు. ‘ఖాన్ సినిమాలో నువ్వున్నావన్న వార్తలు వినే ఉంటావుగా! అది నిజమే!! అధికారికంగా నీకు చెబుదామని ఫోన్ చేశాను. కథ విని ఓకే చెప్పుదువుగానీ’ అన్నారు. నాకు ఓ నిమిషం నోట మాట రాలేదు. వెంటనే తేరుకొని ‘మీ సినిమాలో చెట్టు పాత్ర పోషించమని చెప్పినా.. నాకు ఓకే’ అని చెప్పా.
షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన్ను నేరుగా కలుసుకున్న సందర్భాలు లేవు. అలాంటిది ఆయనతో సినిమా అంటే కాస్త కంగారైంది. షూటింగ్ మొదటి రోజు ఏదో నార్మల్ సీన్ ఉంటుందని భావించా. కానీ, దాబాలో ఫారుఖ్‌తో వాదనకు దిగే సీన్ అని తెలిసింది. ఆయన చేసిన రొమాంటిక్ సినిమాలన్నీ నా కండ్లముందు కదలాడాయి. సినిమానే అయినా ఎలా వాదించేది అనిపించింది. కాసేపయ్యాక గానీ, కుదురుకోలేకపోయా.
షూటింగ్ స్పాట్లో షారుఖ్ చాలా కూల్‌గా కనిపిస్తారు. షాట్ బ్రేక్‌లో సరదాగా మాట్లాడతారు. నాదీ ఢిల్లీనే కావడంతోనో ఏమో ఆయనతో తొందరగా కనెక్ట్ అయ్యా! ఎన్నో విషయాలు చర్చించేవారు. తన అభిప్రాయలను నిర్మొహమాటంగా చెప్పేవారు.
రాజ్‌కుమార్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన ముందుగా ఎడిటర్‌గా చేశారు. షూటింగ్‌కు ముందే సీన్లన్నీ ఎడిటింగ్ చేసినట్టు అనిపించేవి. తనకు ఎలాంటి అవుట్‌కమ్ రావాలో పక్కాగా తెలిసిన దర్శకుడు ఆయన. రాజ్‌తో పనిచేయడం చాలా తేలిక అనిపించింది.