Hero Surya | సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రం స్ఫూర్తివంతమైన కథాంశంతో విమర్శకుల ప్రశంసలందుకొంది. జాతీయ అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది. సూర్య కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. తాజాగా ఈ హిట్ కాంబో మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించనున్నారు.
ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రను పోషించబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందించనున్నారు. ఆయనకిది 100వ చిత్రం కావడం విశేషం. ‘అనేక ప్రత్యేకతల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. సూర్య, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ అద్భుతమైన నటులు. వారి పర్ఫార్మెన్స్ అభిమానులకు ఓ పండగలా ఉంటుంది. నజ్రియా ఫహద్, విజయ్‌వర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషిస్తారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది.