Nana Patekar | ప్రముఖ దిగ్గజ నటుడు నానా పటేకర్ గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూయడం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నివాళులు అర్పించారు. నానా పాటేకర్ మృతితో ‘కాలా’ చిత్రంలో వీరిద్దరి నటన మరియు ఆ సినిమా జ్ఞాపకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 75 ఏళ్ల వయసున్న నానా పటేకర్ గోవాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక ఉదయం 5:20 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే నానా మృతిపై రజనీ స్పందిస్తూ..
“నా ప్రియమైన మిత్రుడు నానాజీ ఇకలేరని నేను నమ్మలేకపోతున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని రజనీకాంత్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. పా రంజిత్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ‘కాలా’ చిత్రంలో రజనీకాంత్, నానా పాటేకర్ కలిసి నటించారు. ఈ చిత్రంలో నానా పాటేకర్ ప్రతి నాయకుడిగా ‘హరి దాదా’ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు.