Jailer2 | సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న భారీ సీక్వెల్ ‘జైలర్ 2’ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్ర కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించగా.. ఆయన ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం లేదా ఇతర కారణాల వల్ల షారుఖ్ మరియు చిత్ర బృందం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో షారుఖ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుమారు ఐదు రోజుల పాటు కనిపిస్తారని అంతకుముందు ప్రచారం జరిగింది.
షారుఖ్ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మరో అగ్ర హీరోను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది, అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సీక్వెల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన షూటింగ్ భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షారుఖ్ లేకపోవడం ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలిగించినా ఆయన స్థానంలో వచ్చే ఆ మరొక సూపర్ స్టార్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.