బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో మొదటి సినిమా చేసే అవకాశం రావాలేగానీ ఎవరైనా ఎగిరి గంతేస్తారు. సోనాక్షి సిన్హా కూడా అలానే సంబరపడిందట. కానీ, ఆమెకు చాలామంది సల్మాన్ గురించి చెడుగా చెప్పారట. ఆమె నటించిన కొత్త సినిమా ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమా ఈ రోజే (నవంబర్ 4) విడుదల అయింది. ఈ సందర్భంగా ‘బాలీవుడ్ బబుల్’ అనే వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాల్లోకి అడుగుపెట్టిన తొలి రోజుల్ని గుర్తుచేసుకుంది సోనాక్షి. ‘సల్మాన్ ఖాన్ సరసన మొదటి సినిమా చేసినవాళ్లకు కెరీర్ ఎక్కువ రోజులు ఉండదు. నీ విషయంలోనూ అదే జరగుతుంది చూడు అని చాలామంది నన్ను భయపెట్టారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్లకు అలా చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అయితే, వాళ్ల మాటలేవీ పట్టించుకోకుండా నా పనిమీద దృష్టి పెట్టాను’ అని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తనకు తొలి రోజులను గుర్తుచేసుకుంది సోనాక్షి సిన్హా. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి మాటలు చాలా విన్నానని చెప్పింది సోనాక్షి.
దబాంగ్ సిరీస్‌తో పాపులర్
హిందీలో 2010లో వచ్చిన దబాంగ్ సినిమాలో సల్మాన్‌కి జోడీగా నటించింది సోనాక్షి సిన్హా. అభినవ్ సింగ్ కశ్యప దర్శకత్వం వహించిన ఈ మూవీలో సల్మాన్ పోలీస్ గెటప్‌లో చుల్బుల్ పాండేగా అభిమానుల్ని ఎంటర్టైన్ చేశాడు. యాక్షన్, కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. దాంతో, దబాంగ్ 2లోనూ సోనాక్షిని హీరోయిన్గా తీసుకున్నారు. హుమా ఖురేషీతో కలిసి ఆమె నటించిన డబుల్ ఎక్సెల్ సినిమాలో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ అతిథి పాత్రలో కనిపించాడు.