Singer KK | ప్రముఖ సంగీత గాయకుడు కేకేగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణకుమార్ కున్నత్ బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఈ వార్త యావత్ సినీ సంగీతాభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక కేకే లేడన్న వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోల్‌కతాలో లైవ్ కాన్సర్ట్‌లో కేకే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాటలు పాడారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురైన కేకే.. ఆ తర్వాత కొద్ది సేపటికి మృతి చెందినట్లు వార్తలు రావడంతో అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతాలోని గురుదాస్ కాలేజీ ఫెస్ట్‌లో లైవ్ కాన్సర్ట్‌లో కేకే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటలు పాడుతున్న తరుణంలో కేకే ఆరోగ్యం క్షీణించింది. ఓ వైపు ఇబ్బంది అనిపించినా మరో వైపు ప్రేక్షకులను అలరిస్తూ పాటలు పాడారు.
ఈ క్రమంలో ‘హమ్ రహే యా నా రహేం కల్’ పాటను పాడుతున్న సమయంలో మరింత ఇబ్బందిగా ఉండడంతో ఆయన టీమ్‌ను పిలిచి.. స్పాట్ లైట్ ఆపేయాలని నిర్వాహకులను కోరాడు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటల ప్రాంతంలో లైవ్ ఈవెంట్‌ను ముగించుకొని కేకే తిరిగి బస చేసిన హోటల్‌కు చేరుకున్నాడు. అయితే, ఇక్కడ కూడా విశ్రాంతి తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయనను 10.30 గంటల ప్రాంతంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMRI) ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు మరణించినట్లుగా ధ్రువీకరించారు. కేకే మరణవార్త అందుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ విశ్వాస్ ఆసుపత్రికి చేరుకున్నారు. సింగర్ కేకే మరణించినట్లుగా తనకు ఫోన్ వచ్చిందని, ఆయన కుటుంబంతో మాట్లాడానని, ముంబై నుంచి కోల్‌కతాకు వస్తుందని పేర్కొన్నారు.