Sharwanand | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తన నటనను తెరమీద కొత్తగా ఆవిష్కరిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు శర్వానంద్. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకున్నా తన హర్డ్వర్క్తో సినీరంగంలో మంచి నటుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టైర్2 హీరోలలో ముందు వరుసలో ఉన్నాడు శర్వానంద్. ఆదివారం ఈయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సీని ప్రముఖులు సోషల్ మీడియాలో విషెస్‌ను తెలియ జేస్తున్నారు.
శర్వానంద్ 1984 మార్చి 6న విజయవాడలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టెన్త్ను పూర్తిచేసుకున్న శర్వానంద్‌కు స్కూల్ లైఫ్ నుంచే నటనపై ఆసక్తి ఉండేదట. దాంతో స్కూల్లో జరిగే ప్రతి కల్చరల్ ఈవెంట్లో శర్వా ముందు వరుసలో ఉండేవాడట. రామ్‌చరణ్, రానా దగ్గుబాటి స్కూల్ నుంచే శర్వానంద్‌కు మంచి ఫ్రెండ్స్. ఇక ఇంటర్ పూర్తి కాగానే సినిమాల్లోకి వెళ్తా అని ఇంట్లో చెప్పాడట. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో ప్రయత్నించు అని కుటుంబ సభ్యులు అనడంతో శర్వానంద్ డిగ్రీ కంప్లీట్ చేసి సినిమాల్లో ప్రయాత్నాలు కొనసాగించాడు.
శర్వానంద్ హీరోగా పరిచయమవుతూ ‘ఐదవ తారీకు’ అనే సినిమా తెరకెక్కింది. 2003లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో శర్వా పేరు ఎవరికీ తెలియకుండా పోయింది. దాంతో మళ్లీ ప్రయత్నాలు కొనసాగించిన శర్వాకు సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘గౌరీ’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ పాత్ర వచ్చింది. పాత్ర నచ్చడంతో శర్వా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఒక రోజు రామ్‌చరణ్, శర్వానంద్‌ను చిరంజీవికి పరిచయం చేశాడు. అప్పుడే చిరంజీవి ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ చిత్రంతో పాటు పెప్సీ ఆడ్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత యువసేన, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మీ వంటి సినిమాలతో టాలీవుడ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ దర్శక, నిర్మాతలను తనవైపు చూసేలా చేసుకున్నాడు. అప్పుడే శర్వా నటనను చూసి ప్రముఖ దర్శకుడు, నిర్మాత గుణ్ణం గంగరాజు ‘అమ్మ చెప్పింది’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా శర్వానంద్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
గమ్యం, ప్రస్థానం, సత్య2 వంటి సినిమాలు శర్వానంద్ కెరీల్లో గుర్తిండిపోయే పాత్రలుగా నిలిచాయి. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్ని చేసిన కమర్షియల్ సక్సెస్ కోసం శర్వా ఎదురు చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రన్ రాజా రన్’ సినిమా శర్వా కెరీర్‌ను మలుపు తిప్పింది. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అప్పటి వరకు సీరియస్ పాత్రల్లోనే కనిపించిన శర్వా రన్ రాజా రన్ సినిమాతో తనలోని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.ఈ చిత్రంతో శర్వాగ్రాఫ్ అమాంతం పెరిగింది. అంతే కాకుండా ఈ చిత్రం తర్వాత శర్వా కథల ఎంపిక కూడా మారింది.
ఆ తర్వాత వచ్చిన ‘మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాలతో హ్యట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. శతమానంభవతి’, ‘మహానుభావుడు’ వంటి సినిమాలతో శర్వా టైర్2 హీరోలలో మొదటి వరుసలో ప్లేస్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం శర్వా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా శుక్రవారం విడుదలై పాజిటీవ్ రివ్యూలను సొంతం చేసుకుంది. దీంతో పాటు ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఓకే ఒక జీవితం’ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు.