Sunitha | సింగర్ సునీత ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ‘మై బాడీ మై రైట్’ అనే అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు పలువురు మద్దతు తెలపగా, మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గాయని చిన్మయి శ్రీపాద స్పందించడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత, మహిళలకి తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పటికీ, సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.దీనిపై స్పందించిన చిన్మయి శ్రీపాద, సునీత పట్ల తనకు గౌరవం ఉన్నప్పటికీ, అలాంటి వ్యాఖ్యలు మహిళల హక్కులకు వ్యతిరేకంగా అర్థమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహిళల శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా వారిదేనని ఆమె అభిప్రాయపడ్డారు.
తాజాగా ఈ వివాదంపై సునీత మరోసారి స్పందించారు. చిన్మయిపై తనకూ ఎంతో గౌరవం ఉందని చెబుతూ, తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. ‘మై బాడీ మై విష్’ అనే భావన అర్థం నాకు పూర్తిగా తెలుసు. ఒక వ్యక్తిగా తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నేను చెప్పదలచుకున్నది సమాజంలోని వాస్తవ పరిస్థితుల గురించే. మన సమాజం ఇంకా పూర్తిగా మారలేదు అనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశాను” అని సునీత వివరించారు. అలాగే, మహిళలపై జరిగే వేధింపులు, అన్యాయాలను తాను ఎప్పటికీ సమర్థించనని స్పష్టం చేశారు. ఎవరైనా మహిళల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, దానికి వ్యతిరేకంగా నిలబడే వారిలో నేను కూడా ముందుంటాను అని ఆమె పేర్కొన్నారు.
ఫెమినిజం గురించి కూడా సునీత తన అభిప్రాయాలను వెల్లడించారు. తన దృష్టిలో ఫెమినిజం అంటే మహిళలు, పురుషులు పరస్పరం గౌరవించుకోవడం, అవకాశాల్లో సమానత్వం ఉండటమేనని చెప్పారు. మహిళలను తక్కువగా చూడడం, వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేయడాన్ని వ్యతిరేకించడమే తన ఫెమినిజమని పేర్కొన్నారు. సమానత్వం అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు. మహిళలు, పురుషులు వేర్వేరు లక్షణాలు కలిగినవారు. కానీ పరస్పర గౌరవం, అవకాశాల్లో సమానత్వం ఉండాలి అని సునీత అభిప్రాయపడ్డారు.ఇక సునీత, చిన్మయి ఇద్దరూ కూడా మహిళల హక్కులు, సమానత్వం వంటి అంశాలపై గతంలో పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినవారే. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.